సాక్షి, తూర్పు గోదావరి: ఏపీ రాజకీయాలకు రాజధాని వంటి తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ జగ్గంపేట సమన్వయకర్త జ్యోతుల చంటిబాబు అన్నారు. కాకినాడలో సోమవారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ సమరశంఖారావం సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వగానే వైఎస్ జగన్ తొలుత కాకినాడులో సభ నిర్వహించడం తమ జిల్లా అదృష్టమని అభిప్రాయపడ్డారు. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తమ జిల్లా నుంచి ప్రారంభమవుతుందని, జిల్లాలోని అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించితీరుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
ఏపీ ప్రత్యేక హోదా కోసం మాట తప్పకుండా పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే అని పేర్కొన్నారు. హోదా వస్తే కార్మికులకు ఉపాధి దొరుకుందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయని చంటిబాబు వివరించారు. ఏపీ అభివృద్ధి జరిగే విధంగా తమ నాయకుడి నిర్ణయాలు ఉంటాయిని, జాతీయ స్థాయిలో చక్రం తిప్పే విధంగా భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు..
ఏపీ సీఎంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని చూడాలని యావత్ ఏపీ రాష్ట్రమంతా ఎదురుచూస్తోందని వైఎస్సార్‌సీపీ ముమ్మిడివరం కో ఆర్డినేటర్ పొన్నాడ సతీష్ అన్నారు. తమ పార్టీకి అండగా నిలబడిన ప్రతీ ఒక్కరిని వైఎస్ జగన్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు మనందరికీ దిశానిర్ధేశం చేయడానికి వైఎస్ జగన్ ఇక్కడి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ప్రజల్లోకి వెళ్లడానికి నవరత్నాలు పథకంతో మనకు ప్రజా అస్త్రాలు ఉన్నాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment