
రాయలసీమ రైల్వేలో కడప జిల్లా సౌత్‌సెంట్రల్ రైల్వే నుంచి విశాఖ జోన్ పరిధికి వెళ్లిపోనుంది. జిల్లా నుంచి జోన్ కేంద్రం విశాఖ చాలా దూరమని రైల్వే కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కనీసం తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ప్రతిపాదనకు జోన్‌లో పచ్చజెండా ఊపుతారని భావించిన వారికి నిరాశ ఎదురైంది. ఈ డివిజన్ కేంద్రంగా తిరుపతిని చేస్తే కాట్పాడి నుంచి గుంతకల్, నెల్లూరు జిల్లా గూడూరు, కడపల పరిధిలోకి సమారు 700 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఈ డివిజన్ ఆదాయం రూ.200 కోట్లు ఉంటుందని సమాచారం. 400 కిలోమీటర్లు ఉంటే డివిజన్‌గా ప్రకటించవచ్చు. అన్ని అనుకూలాంశాలు ఉన్నా బాలాజీ డివిజను ప్రస్తావన ఈసారి కూడా పట్టాలెక్కకపోవడం విచారకరం.
కడప ,రాజంపేట : విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించడంపై హర్షం వ్యక్తమవుతున్నా తమ చిరకాల వాంఛ నెరవేరలేదని భావన జిల్లా రైల్వే ప్రయాణికులను..ఉద్యోగులను వేధిస్తోంది. కనీసం తిరుపతి డివిజను గురించి ఇందులో రైల్వేమంత్రి ప్రస్తావించకపోవడం ఆశలపై నీళ్లు చల్లింది. తూర్పు కోస్తా పరిధిలోని వాల్తేరు డివిజన్‌లో కొంతభాగం విశాఖ రైల్వేజోన్‌లో కలపడం కన్నా, తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్‌గా చేసి గుంతకల్, గుంటూరు, విజయవాడ నాలుగు డివిజన్లుగా విశాఖజోన్ పరిధిలో కలిపి ఉంటేబాగుండేదని నిపుణులు అంటున్నారు. తిరుపతి డివిజన్‌గా చేస్తే రాయలసీమ ప్రాంతానికి ఉపయోగకరంగా ఉంటుంది. తరచూ సమావేశాలకు గుంతకల్ డివిజన్ కేంద్రానికి వెళ్లి రావాలంటే అధికారులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు విశాఖ జోన్‌గా ప్రకటించడంతో మూలిగే నక్కపై తాటికాయపడ్డట్లు పరిస్ధితి మారిపోయింది.
గుంతకల్ జోన్ ఆశలపై నీళ్లు..
గుంతకల్ రైల్వే డివిజన్ కుదింపులతో కుదేలవుతోంది. ఈ డివిజన్ ఉనికి ప్రశ్నార్ధకరంగా మారనుంది. ఈ డివిజన్‌ను రైల్వేజోన్ చేయాలని ఒక వైపు రాజకీయపార్టీల నాయకులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. మరోవైపు డివిజన్‌ను విభజించి ఇతర వాటిల్లోకి విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. గుల్బర్గా, తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు పరిశీలించారు. ప్రాధాన్యం ఉన్న ఈ డివిజన్‌ను ఇప్పటికే పలుసార్లు కుదించారు. ఉత్తర, దక్షిణ భారతాలను కలిపే కీలక రైల్వే జంక్షన్ గుంతకల్లు డివిజన్. ఈ రైల్వేడివిజన్‌లో 1697.90కిలోమీటర్లు లైన్లు ఉండేవి. 2003 ఏప్రిల్1న బల్లారి–హోస్పేట్, బళ్లారి–రాయదుర్గం, నంద్యాల–దొనకొండ, ధర్మవరం–సికింద్రాబాదు సెక్షన్‌లోని 367కి.మీలైన్లను గుంటూరు, హుబ్లీ, బెంగళూరు డివిజన్‌లోకి విలీనం చేశారు. ప్రస్తుతం డివిజన్ పరిధిలో 1330.90కీ.మీల ట్రాక్ మాత్రమే ఉంది.
బాలాజీ డివిజన్ ఏర్పాటైతే..
బాలాజీ డివిజన్ ఏర్పాటైతే ఇందులో తిరుపతి–గూడూరు (92.96కి.మీ), తిరుపతి–కాట్పాడి (104.39కి.మీ), పాకాల–మదనపల్లె(83కి.మీ), రేణిగుంట–కడప (125కి.మీ)లైను కలిపే అంశాన్ని గతంలో అధికారులు పరిశీలించారు. నంద్యాల–పెండేకల్లు (102 కి.మీ) లైను గుంటూరు డివిజన్‌లోకి విలీనం చేయాలని యోచిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన కర్ణాటకలోని గుల్బర్గా డివిజన్‌లోకి వాడి–రాయచూరు (107.48కిమీ) సెక్షన్‌ను కలపడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో దాదాపు 614.83కిమీ లైన్లను ఇతర డివిజన్ వెళ్లనున్నాయి. చివరికి గుంతకల్లు డివిజన్‌కు 716.07 కిమీల ట్రాక్ మాత్రమే మిగులుతుంది.
నందలూరుకు పూర్వవైభవం..
బాలాజి డివిజన్ ఏర్పడితే నందలూరు పూర్వవైభవం సంతరించుకుంటుంది.. రైల్వేమంత్రిగా పనిచేసిన లాలూ హయాంలో నందలూరులో రైల్వే ప్రత్యామ్నాయ పరిశ్రమను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. కోచ్ రిహాబిటేషన్ వర్క్‌షాపు గానీ వ్యాగగన్ రిపేరు వర్క్‌షాపు గాని ఏర్పాటుదిశగా ప్రయత్నాలు జరిగాయి. నందలూరుకు ఈ పరిశ్రమ వస్తే డివిజన్ కేంద్రం గుంతకల్ ప్రాధాన్యత తగ్గిపోతుందని భావనలు పుట్టుకొచ్చాయి. దీంతో నందలూరు కు రైల్వేపరిశ్రమ రాకుండా కొందరు రైల్వే ఉన్నతాధికారులు అడ్డుకున్నారనే ఆరోపణలు గుప్పమన్నాయి. తప్పుడు నివేదికలు రైల్వేబోర్డుకు పంపించారని విమర్శలున్నాయి. ఇప్పుడు విశాఖ జోన్ ఏర్పడిన నేపథ్యంలో గుంతకల్ డివిజన్ నుంచి వేరుచేసి కడప వరకు బాలాజీడివిజన్‌గా ఏర్పాటుచేసే ప్రతిపాదన కార్యరూపం దాల్చేందుకు పాలకులు నడుంబిగించాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment