సాక్షి, కడప : కడప నుంచి విజయవాడ బయల్దేరిన విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. పైలెట్ అప్రమత్తం కావడం..ఏటీసీ అధికారులకు సమాచారం అందించడం..విమానాన్ని కడప ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చి సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన ట్రూ జెట్ విమానంలో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో విమానం బయలుదేరగా 10–15 నిమిషాల వ్యవధిలో పక్షి తగిలింది. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన పైలెట్ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు.
నేరుగా విమానాన్ని కడప ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చి దింపారు. ఇందులో ప్రయాణిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు మిగిలిన ప్రయాణికులను క్షేమంగా ఎయిర్‌పోర్టులో దింపేసి ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అయితే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా మరో విమానంలో హైదరాబాదుకు బయలుదేరి వెళ్లారు. క్షేమంగా దిగడంతో అందరిలోనూ సంతోషం వెల్లివిరిసింది. ప్రమాదం దృష్ట్యా విజయవాడ వెళ్లాల్సిన విమాన సర్వీసు, చెన్నై వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేశారు.
కడప ఎయిర్‌పోర్టులో ఆగిన విమానం
ప్రమాద నేపథ్యంలో విమానం కడప ఎయిర్‌పోర్టుకు చేరింది. దానిని ఎయిర్‌పోర్టు అధికారులు పరీక్షల నిమిత్తం కడపలోనే ఉంచారు. ఈ విమానాన్ని గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం పలువురు అధికారులు పరిశీలిస్తారు.అన్ని పరీక్షలను నిర్వహించాక విమానం బయలుదేరనుంది.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అధికారులు
కడప నుంచి విజయవాడకు బయలుదేరిన విమానానికి ప్రమాదం ఎదురు కావడంతో అత్యవసరంగా పైలెట్ విమానాన్ని కడప ఎయిర్‌పోర్టుకు సురక్షితంగా తీసుకొచ్చారు. ప్రయాణికులు తిరిగి వెళ్లడానికి ట్రూ జెట్ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కొందరికి వాహనాలు సమకూర్చింది. మరికొందరికి బస్సు లు, మరో విమానంలో అవకాశం కల్పించారు. అయితే చెన్నై విమాన సర్వీసును రద్దు చేయడంతో టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య నేపథ్యంలో ట్రూజెట్ అధికా>రులు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment