విజేతలెవరో..! | kakinada corporation election results today | Sakshi
Sakshi News home page

విజేతలెవరో..!

Published Fri, Sep 1 2017 2:27 AM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM

విజేతలెవరో..! - Sakshi

విజేతలెవరో..!

♦  అభ్యర్థుల భవితవ్యం తేలేది నేడే  
  ఎన్నికల కౌంటింగ్‌కు 14 టేబుళ్ల ఏర్పాటు
  జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక పర్యవేక్షణ  
ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం
  ప్రత్యేక స్క్రీన్ల ఏర్పాటు  
12లోపు మొత్తం పూర్తి ఫలితాలు వెల్లడి


కాకినాడ : కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం తేలనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పర్యవేక్షణలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 12 గంటలలోపు మొత్తం 48 డివిజన్ల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

14 టేబుల్స్‌ ఏర్పాటు...
కౌంటింగ్‌ ప్రక్రియకు సంబంధించి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు ఒక రిటర్నింగ్‌ అధికారి, కౌంటింగ్‌ సూపర్‌వైజర్, కౌంటింగ్‌ అసిస్టెంట్, అదనపు కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌ను ఏర్పాటు చేశారు. మొత్తం 60 మందికిపైగా కౌంటింగ్‌ సిబ్బంది విధి నిర్వహణకు నియమించారు. ప్రతి టేబుల్‌ వద్ద ఏజెంట్లు ఉండేందుకు కూడా ఏర్పాట్లు సిద్ధం చేశారు. మొత్తం 21 రౌండ్లలో కౌంటింగ్‌ ప్రక్రియ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఉదయం 7.30 గంటలకు అభ్యర్థుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌లను తెరుస్తారు. ఈవీఎంలను బయటకు తెచ్చి 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభించనున్నారు. కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, కమిషనర్‌ అలీమ్‌ బాషా, అబ్జర్వర్‌ కె.వి.రమణ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. కౌంటింగ్‌ ప్రక్రియ వద్ద డీఆర్‌డీఏ పీడీ మల్లిబాబు, ఆర్డీవో ఎల్‌.రఘుబాబు, తహసీల్దార్‌ బాలసుబ్రహ్మణ్యం మరికొంతమంది అధికారులను కూడా ప్రత్యేక పర్యవేక్షణ కోసం నియమించారు.

స్క్రీన్ల ఏర్పాటు...
కౌంటింగ్‌ ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు వీలుగా ప్రత్యేక స్క్రీన్‌లను కూడా ఏర్పాటు చేశారు. మీడియా కోసం ప్రత్యేక హాల్‌ను ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ హాల్లోకి అనుమతించే విషయంలో కూడా నిబంధనలు రూపొందించారు.

ఏర్పాట్ల పరిశీలన...
కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లను కలెక్టర్‌ కార్తికేయమిశ్రా గురువారం పర్యవేక్షించారు. కౌంటింగ్‌ జరిగే రంగరాయ మెడికల్‌ కళాశాల ఎగ్జామ్‌ హాలును ఆయన పరిశీలించారు. కౌంటింగ్‌ సిబ్బందికి నిర్వహించిన శిక్షణా తరగతులను కూడా సందర్శించి పలు సూచనలిచ్చారు. ఈవీఎంలలోని ఫలితాల నమోదు, కంప్యూటరీకరణ, ఎన్నికల ఫలితాల ప్రకటనలో అనుసరించాల్సిన నిబంధనలు, జాగ్రత్తలను ఆయన సిబ్బందికి వివరించారు.

12 గంటలలోపే అన్ని డివిజన్ల ఫలితాలు...
కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నం 12 గంటలలోపే వెలువడే అవకాశం ఉందని కలెక్టర్‌ మిశ్రా చెప్పారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడుతూ  ఉదయం 5 గంటలకు ఉద్యోగుల ర్యాండమైజేషన్‌ ప్రక్రియ జరుగుతుందన్నారు. 7 గంటలకు రాజకీయ పార్టీల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌ను తెరుస్తామన్నారు. 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్‌ 12 గంటలకు ముగిసే అవకాశం ఉంటుందన్నారు.

అమలులో ప్రవర్తనా నియమావళి...
ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని కలెక్టర్‌ మిశ్రా చెప్పారు. నిబంధనల మేరకు ఆయా రాజకీయ పార్టీల నేతలు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా జరిపేందుకు వీలుగా పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు.

విజేతలెవరో...?
కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల జాతకాలు శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి బయటపడనున్నాయి. ఇప్పటికే ఆయా రాజకీయ పక్షాల అభ్యర్థులు ఎవరి అంచనాల్లో వారున్నారు. గెలుపుపై ప్రధాన పక్షాలైన టీడీపీ, వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ధనప్రభావంపై విస్తృత చర్చ...
కార్పొరేషన్‌ ఎన్నికల్లో మున్నెన్నడూ లేనంతగా సాగిన ధన ప్రవాహంపై ఇప్పుడు అన్ని వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. అనే డివిజన్లలో పెద్ద మొత్తంలో డబ్బు, మద్యంతోపాటు అధికార పార్టీ కానుకలు కూడా ఇచ్చి ప్రలోభాలకు తెరదీసిన నేపథ్యంలో ఈ ప్రభావం ఎన్నికలపై ఏ స్థాయిలో ఉంటుందనే అంశంపై మేధావుల్లో చర్చకు దారితీసింది. టి.డి.పి. పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడి స్వతంత్ర అభ్యర్థులను కొనుగోలు చేసి, ఓటర్లకు డబ్బు ఎరగా వేసి, రూ.30 కోట్లకు పైగా ఖర్చు చేసింది.  ఖరీదైన ఈ ఎన్నిక ఫలితం ఎలా ఉండబోతుందన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement