పటిష్ట బందోబస్తు
కాకినాడ క్రైం : కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 318 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కాకినాడ ఇన్‌చార్జి డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం స్థానిక రంగరాయ మెడికల్ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో సెక్షన్ 30 అమల్లో ఉందని, రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు కూడా ర్యాలీలు నిర్వహించరాదని, పరాజయం పాలైన అభ్యర్థులు ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్ప డరాదన్నారు.
ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అల్లర్లు, తగాదాలు జరక్కుండా పోలీసు బలగాలతో మందస్తు భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ముందస్తుగా రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఐదుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, 75 మంది ఏఎన్‌ఎస్ సిబ్బంది, 196 మంది హెచ్‌సీలు , కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. బందోబస్తులో జిల్లాలో ఉన్న అన్ని సబ్ డివిజినల్ అధికారులతోపాటు పలువురు సీఐలు విధులు నిర్వహిస్తారన్నారు.
కౌంటింగ్ కేంద్రం ఆవరణలోకి కేవలం ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల వాహనాలను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, అభ్యర్థులు, కార్యకర్తల వాహనాల పార్కింగ్ కోసం ఐటీఐ గ్రౌండ్, ఎగ్జిబిషన్ స్థలంలో ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ర్యాలీలు, సమావేశాలు జరక్కుండా నగర శివారు, ప్రవేశ ద్వారాల్లో ముఖ్యమైన కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాంతి యుత వాతావరణంలో ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన పలువురు సబ్ డివిజినల్ అధికారులు,పలువురు సీఐలు పాల్గొన్నారు.