కాకినాడ సిటీ : దశాబ్దాలుగా జిల్లా వాసుల చిరకాల వాంఛ అయిన కాకినాడ-పిఠాపురం మెయిన్‌లైన్ నిర్మాణానికి కేంద్ర రైల్వేశాఖ సానుకూలంగా ఉందని, వచ్చే రైల్వే బడ్జెట్‌లో నిధులు కేటాయింపునకు రైల్వే శాఖ మంత్రి హామీ ఇచ్చారని కాకినాడ ఎంపీ, రైల్వేబోర్డు సభ్యులు తోట నరసింహం వెల్లడించారు. ఈ నెల 25న రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న దృష్ట్యా రాష్ట్రానికి రావలసిన నిధులు, కొత్త ప్రాజెక్టులపై చర్చించేందుకు మంగళవారం ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుతో సమావేశమైనట్టు ఎంపీ నరసింహం ఒక ప్రకటనలో తెలిపారు.
స్మార్ట్ సిటీగా ఎంపికవ్వడంతోపాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడకు మెయిన్‌లైన్ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గతంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ జరిగినా కార్యరూపం దాల్చలేదని, ఈ బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయించి కాకినాడ అభివృద్ధికి సహకరించాలని రైల్వేమంత్రి సురేష్ ప్రభుకు విన్నవించినట్టు తెలిపారు. దీనిపై స్పందించిన ఆయన పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుకు మోక్షం కల్పించేందుకు కృషి చేస్తానని, ఈ మేరకు బడ్జెట్‌లో ప్రాజెక్టుకు ప్రాధాన్యం కల్పించి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్టు ఎంపీ తోట వెల్లడించారు.
కాకినాడ-పిఠాపురం రైల్వేలైన్‌కు కేంద్రం సానుకూలం
Published Wed, Feb 10 2016 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 5:17 PM
Advertisement