కరువు సీమలో కాలా ట్యాక్స్‌!  | Kale Nayak Charges Money For Tube Connections Under The Name Of Panchayat Approval | Sakshi
Sakshi News home page

కరువు సీమలో కాలా ట్యాక్స్‌! 

Published Tue, Jul 30 2019 11:22 AM | Last Updated on Tue, Jul 30 2019 11:24 AM

Kale Nayak Charges Money For Tube Connections Under The Name Of Panchayat Approval - Sakshi

కొళాయి కనెక్షన్‌కు డబ్బు తీసుకుని కాలే నాయక్‌ ఇచ్చిన నకిలీ రసీదు, రుద్రంపేట పంచాయతీ కార్యాలయం

ప్రజలు సర్పంచ్‌గా గెలిపించిన వ్యక్తి ఆ విధులు మరిచి జలగలా మారాడు. పదవీ కాలం ముగిసే వరకు ప్రతి పనికీ ఓ రేటు కట్టి ప్రజలకు చుక్కలు చూపించాడు. డబ్బు తీసుకున్నా...పనన్నా సక్రమంగా చేశాడా అంటే అదీ లేదు. కొళాయి కనెక్షన్లు మొదలు ఇల్లు కట్టుకునేందుకు పంచాయతీ అప్రూవల్‌ వరకు అన్నింటిలోనూ దగా చేశాడు. పంచాయతీకి పైసా కట్టకుండా సొంతానికి వాడేసుకున్నాడు. ఆయనకు డబ్బులిచ్చిన జనం ఇప్పుడు నెత్తీనోరు బాదుకుంటున్నారు.    – అనంతపురం రూరల్‌ 

సాక్షి, అనంతపురం రూరల్‌ : రుద్రంపేట.. నగరానికి అత్యంత సమీపంలో ఉన్న పంచాయతీ. బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. అందుకే ఇక్కడ స్థిరపడుతున్న వారి సంఖ్య ఏటికేడు పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం పంచాయతీ పరిధిలో దాదాపు 25 వేల మంది జనాభా నివాసం ఉంటున్నారు. ఇంత పెద్ద పంచాయతీకి సర్పంచ్‌గా పనిచేసిన కాలే నాయక్‌.. ప్రజా సమస్యలను పరిష్కరించడం మాని.. వారికి సమస్యగా మారాడు. పదవీకాలం ఉన్నన్నాళ్లూ యథేచ్ఛగా దోపిడీ పర్వం కొనసాగించాడు.  

కొళాయి కనెక్షన్‌ పేరుతో స్వాహా 
రుద్రంపేటలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దీంతో కొళాయి కనెక్షన్లకు డిమాండ్‌ అధికంగా ఉంటోంది. ఇదే అదనుగా భావించిన కాలే నాయక్‌ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడు. అధికారుల ప్రమేయం లేకుండానే 2015లో కొళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయిస్తానని చెప్పి దాదాపు 300 మందితో రూ.3 వేల చొప్పున దాదాపు రూ.10 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. డబ్బులు చెల్లించి నాలుగు సంవత్సరాలైనా ఇంతవరకూ కొళాయి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో ఆయనకు డబ్బులిచ్చినవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ డబ్బు తిరిగి ఇవ్వాలని కోరిన వారిపై దౌర్జన్యం చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు.
  
నిబంధనలకు విరుద్ధంగా డబ్బు వసూలు  
పంచాయతీలో కొళాయి కనెక్షన్‌ పొందాలంటే నిబంధనల ప్రకారం పంచాయతీ కార్యదర్శికి డీడీ రూపంలో డబ్బు చెల్లించాలి. ఆ తర్వాత పంచాయతీ అధికారులు విచారణ చేసి నిబంధనల ప్రకారం కొళాయి కనెక్షన్‌ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇస్తారు. అయితే రుద్రంపేటలో మాత్రం అధికారులతో పనిలేదు. తనకు డబ్బులు చెలిస్తే చాలు అన్నట్లు సర్పంచ్‌ కాలే నాయక్‌  వ్యవహరించి కొళాయి కనెక్షన్ల కోసం  ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేశారు. డబ్బు తీసుకున్నట్లు ఓ రసీదు కూడా తన సంతకంతో ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు.  

పంచాయతీ అప్రూవల్‌ పేరుతో భారీ దోపిడీ 
రుద్రంపేట పంచాయతీ నగరానికి సమీపంలో ఉండటంతో చాలా మంది ఇక్కడ స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకోవాలని భావిస్తున్నారు. కానీ ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే కాలే నాయక్‌కు ట్యాక్స్‌ కట్టాల్సిందే.  ఆయన అనుమతి తీసుకుని ప్లానింగ్‌ తెస్తే ఆయన దానిపై ఓ సంతకం చేసి రూ. వేలు దండుకుంటారు. ఈ మొత్తంలో ప్రభుత్వానికి పైసా కూడా చెల్లించడు. ఇలా కాలే నాయక్‌ వద్ద అప్రూవల్స్‌ పొందిన వారు వందల మంది ఉన్నట్లు తెలుస్తోంది.
  
నీళ్ల పేరుతోనూ భారీ దోపిడీ 
రుద్రంపేట పంచాయతీలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. దీన్ని కూడా కాలే నాయక్‌ తన ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. ఆయనే ట్యాంకర్లు ఏర్పాటు చేసి నీళ్లు సరఫరా చేసేవాడు. ఒక్కో ట్యాంకర్‌ నీటికి ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ రూ.600 చెల్లించేది. అయితే పెట్టే బిల్లులకు తోలిన ట్యాంకర్లకు పొంతన ఉండేది కాదు. రోజుకు 10 ట్యాంకర్ల నీటిని సరఫరా చేసి...20 నుంచి 30 వాటికి బిల్లులు పెట్టుకునే వాడు. అప్పుడు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉన్నతాధికారి కూడా కాలే నాయక్‌ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ఉండటంతో బిల్లులన్నీ మంజూరయ్యేవి.   

పంచాయతీ అధికారుల అండతోనే... 
కొళాయి కనెక్షన్ల కోసం, పంచాయతీ అప్రూవల్‌ పేరుతో కాలే నాయక్‌ డబ్బులు వసూలు చేసినట్లు పంచాయతీ అధికారులు తెలిసినా వారు పట్టించుకోవడం లేదు. పైగా పంచాయతీ కార్యాలయంలోని కొందరు సిబ్బందే మధ్యవర్తిత్వం నడిపి కాలే నాయక్‌ వద్దకు జనాన్ని తీసుకువచ్చి డబ్బులిప్పించినట్లు తెలుస్తోంది. పట్టించుకోవాల్సిన జిల్లా పంచాయతీ అధికారి కూడా కళ్లుమూసుకోవడంతో కాలే నాయక్‌ ఆడింది ఆటా...పాడింది పాటగా ఇన్నాళ్లూ సాగింది.  

ఎప్పుడూ అధికారం చుట్టూనే... 
సర్పంచ్‌ పదవి అడ్డం పెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న కాలే నాయక్‌ ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే తాను ఆ పార్టీ వాడినని చెప్పుకుంటూ తిరుగుతాడనే చర్చ ఉంది. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు సైతం దిగుతున్నట్లు సమాచారం. దీంతో అధికారులు కూడా ఆయన జోలికి వెళ్లేందుకు సాహసించడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణ వేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement