- నర్సరీలో ఎర్రచందనం చెట్ల నరికివేత
- జిల్లా అధికారుల జాబితాలో కలికిరివాసుల పేర్లు
- {పైవేట్ భూముల్లోనూ చె ట్లు నరికిన వైనం
కలికిరి, న్యూస్‌లైన్: సీఎం సొంత మండలమైన కలికిరిలో ఎర్రదొంగలు పడ్డారు. పీలేరు- కలికిరి మార్గమధ్యంలో అటవీశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సామాజిక వనవిభాగం కార్తీకవనంతో పాటు మరికొన్ని ప్రైవేట్ భూముల్లో ఎర్రచందనం చె ట్లు నరికి గుట్టుచప్పుడు కాకుండా తరలించేశారు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం కార్తీకవనంలో నాలుగు చెట్లు నరికారు. వీటిలో రెండు చెట్ల దుంగలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. మరో రెండు చెట్లను నరికి అక్కడే వదిలేశారు.
మదనపల్లె మార్గంలోని సాయిరాం డాబాకు వెనుకవైపున ఓ ప్రైవేట్ స్థలంలో ఉన్న ఎర్రచందనం చెట్టును నరికి దుంగలు తీసుకెళ్లారు. ఈ రెండు చోట్లా ఒకేరోజు ఎర్రచందనం చెట్లు నరికి అపహరించుకుపోయినట్లు సమాచారం. దీన్ని బట్టిచూస్తే స్థానికంగా ఉన్నవారే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎర్రావారిపాళెం మండ లం నుంచి కేవీపల్లె మండలం మీదుగా ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో కలికిరి మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు ఎర్రచందనం అక్రమరవాణా చేస్తున్నట్లు వినికిడి. వారిపేర్లు జిల్లా పోలీస్ యంత్రాంగం వద్ద ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
అడవిని వదిలి..పొలాలపై పడ్డారు
ఇటీవల అధికారులు విస్తృత దాడులు చేస్తున్నారు. శేషాచలం అడవుల్లో గస్తీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఎర్రచందనం దొంగలు పొలాలు, నర్సరీల వద్ద ఉన్న చెట్లపై పడ్డారు.