సాక్షి, కమలాపురం(కడప) : కమలాపురం సబ్ జైలు అధికారులు నిబంధనలు తుంగలో తొక్కారు. ఓ కేసులో గురువారం రాత్రి కమలాపురం సబ్ జైలుకు వచ్చిన టీడీపీ రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి కి జైలు అధికారులు రాచ మర్యాదలు కల్పిస్తున్నారు. రిమాండ్ ఖైదీతో ములాఖత్‌కు రోజులో ముగ్గురు లేదా అయిదుగురు కలిసే వీలుంటుంది. కానీ పదుల సంఖ్యలో టీడీపీ నాయకులు వరుస కట్టారు.
జైలు అధికారులు కిమ్మనకుండా అనుమతించారు. శుక్రవారం ఉదయం టీడీపీ నాయకులు లింగారెడ్డి, విజయమ్మ వారి అనుచరులతో వచ్చి రెడ్యంను కలిసి వెళ్లారు. సాయంత్రం టీడీపీ జిల్లా అధ్యక్షుడు వాసు, మాజీ టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌లు దాదాపు 30 మంది అనుచరులతో కలవడానికి వచ్చారు. జైలు అధికారులు నిబంధనలను పక్కన బెట్టి వారికి పూర్తిగా వత్తాసు పలికారు.
నిబంధనల ప్రకారం సాయంత్రం 5.30 గంటలకే ములాఖత్ ముగియాల్సి ఉండగా 6.30 దాటినా ములాఖత్ కొనసాగించారు. ములాఖత్‌కు వచ్చిన వారంతా తినుబండారాలు తీసుకెళ్లారు. ఏ ఒక్క విషయంలోనూ సబ్‌జైలు అధికారులు నిబంధనలు పాటించలేదు. సాధారణ ఖైదీలకు ఒక న్యాయం, టీడీపీ నాయకులకు ఒక న్యాయమా అని విమర్శలు వెల్లువెత్తాయి. డిప్యూటీ జైలర్ వేణును వివరణ కోరగా వంటకాలకు అనుమతి లేదన్నారు. టైం ప్రకారమే పండ్లు, బిస్కెట్లు మాత్రమే అనుమతించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment