sub jailer
-
టీడీపీ నేతకు సబ్ జైలులో రాచ మర్యాదలు
సాక్షి, కమలాపురం(కడప) : కమలాపురం సబ్ జైలు అధికారులు నిబంధనలు తుంగలో తొక్కారు. ఓ కేసులో గురువారం రాత్రి కమలాపురం సబ్ జైలుకు వచ్చిన టీడీపీ రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి కి జైలు అధికారులు రాచ మర్యాదలు కల్పిస్తున్నారు. రిమాండ్ ఖైదీతో ములాఖత్‌కు రోజులో ముగ్గురు లేదా అయిదుగురు కలిసే వీలుంటుంది. కానీ పదుల సంఖ్యలో టీడీపీ నాయకులు వరుస కట్టారు. జైలు అధికారులు కిమ్మనకుండా అనుమతించారు. శుక్రవారం ఉదయం టీడీపీ నాయకులు లింగారెడ్డి, విజయమ్మ వారి అనుచరులతో వచ్చి రెడ్యంను కలిసి వెళ్లారు. సాయంత్రం టీడీపీ జిల్లా అధ్యక్షుడు వాసు, మాజీ టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌లు దాదాపు 30 మంది అనుచరులతో కలవడానికి వచ్చారు. జైలు అధికారులు నిబంధనలను పక్కన బెట్టి వారికి పూర్తిగా వత్తాసు పలికారు. నిబంధనల ప్రకారం సాయంత్రం 5.30 గంటలకే ములాఖత్ ముగియాల్సి ఉండగా 6.30 దాటినా ములాఖత్ కొనసాగించారు. ములాఖత్‌కు వచ్చిన వారంతా తినుబండారాలు తీసుకెళ్లారు. ఏ ఒక్క విషయంలోనూ సబ్‌జైలు అధికారులు నిబంధనలు పాటించలేదు. సాధారణ ఖైదీలకు ఒక న్యాయం, టీడీపీ నాయకులకు ఒక న్యాయమా అని విమర్శలు వెల్లువెత్తాయి. డిప్యూటీ జైలర్ వేణును వివరణ కోరగా వంటకాలకు అనుమతి లేదన్నారు. టైం ప్రకారమే పండ్లు, బిస్కెట్లు మాత్రమే అనుమతించామన్నారు. -
గీత దాటిన సబ్ జైలర్
సాక్షి, కల్వకుర్తి(నాగర్‌కర్నూల్) : విధుల పట్ల నిర్లక్ష్యం, అక్రమార్కులతో కుమ్మక్కు, తోటి ఉద్యోగుల పట్ల దురుసు ప్రవర్తన వెరసి కల్వకుర్తి సబ్‌జైలర్ సుధాకర్‌రెడ్డిపై వేటుకు కారణమైంది. కల్వకుర్తి సబ్ జైలర్‌గా మంథని నుంచి సుధాకర్‌రెడ్డి బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి విధుల పట్ల అంటిముట్టనట్లుగా ఉన్న ఈయన సబ్‌జైలర్ నుంచి ఎస్ఐగా మారి తన పరిధి దాటి ఇసుక అక్రమార్కుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్ఐ అవతారం ఎత్తి.. సబ్ జైలర్‌గా విధులు నిర్వహించాల్సిన సుధాకర్‌రెడ్డి దారితప్పి ఎస్ఐగా అవతారం ఎత్తి ఇసుక అక్రమార్కుల దగ్గర అక్రమంగా వసూళ్లకు పాల్పడుతూ దందా నిర్వహిస్తున్నారు. కొంతమంది సిబ్బందిని తన అక్రమాలకు అండగా ఉపయోగించుకుంటున్నారు. డబ్బులు ఇవ్వని ఇసుక వ్యాపారు లకు ఫోన్లు చేస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఇసుక ట్రా క్టర్లు సీజ్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు సబ్ జైలర్ సుధాకర్‌రెడ్డి మంథనిలో విధులు నిర్వహించిన సమయంలో అనేక ఆరోపణలు రావడంతో కల్వకుర్తికి బదిలీ చేశా రు. ఇక్కడ కూడా విధులు నిర్వహిస్తూ ఒక ఇసుక వ్యాపారిని డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాధిత వ్యా పారి సబ్‌జైలర్ ఫోన్‌కాల్‌ను రికార్డు చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో రెండు రోజుల క్రితం కల్వకుర్తికి వచ్చి సమగ్ర విచారణ జరిపారు. సుధాకర్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతోపాటు విధుల పట్ల నిర్లక్ష్యాన్ని గుర్తించిన అధికారుల నివేదిక మేరకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిసన్స్ సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేయడంతోపాటు సుధాకర్‌రెడ్డిని హెడ్‌క్వార్టర్ వదిలి పోకూడదనే ఆదేశాలిచ్చారు. సబ్ జైలర్ వ్యవహారం కల్వకుర్తి ప్రాంతంలో కలకలం రేకెత్తించింది. -
సొంతింటిలో చేరకుండానే...
సాక్షి, ఆదోని(కర్నూలు) : సొంతింటితో చేరకుండానే ఓ ఉద్యోగిని మృత్యువు కబళించింది. గృహం నిర్మించుకొని ప్రవేశ పూజల్లో నిమగ్నమై ఉన్న అతన్ని విద్యుదాఘాతం రూపంలో అనంతలోకాలకు తీసుకెళ్లింది. ఆదోనిలో శనివారం చోటుచేసుకున్న ఘటన వివరాలు.. తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లా ఐజ మండలం సింధనూరు గ్రామానికి చెందిన రవీంద్రబాబు(55) పత్తికొండ సబ్‌జైల్ హెడ్‌గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదోని సబ్‌జైల్ గార్డుగా పనిచేస్తూ ఏడాది క్రితం హెడ్‌గార్డుగా పదోన్నతిపై పత్తికొండ సబ్‌జైలుకు వెళ్లాడు. అయితే ఆదోని నుంచి రాకపోకలు సాగిస్తున్నాడు. భార్య అర్లమ్మ ఆలూరు ప్రభుత్వ బాలికల హైస్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో మంచి ఇల్లు నిర్మించుకోవాలని కలలుగన్నారు. అందులో భాగంగా దాదాపు రూ.30 లక్షలు ఖర్చు చేసి ఆర్టీసీ కాలనీలో ఇల్లు నిర్మించుకున్నాడు. ఆదివారం గృహ ప్రవేశం ఉండటంతో బంధువులందరికీ కబురంపాడు. పూజల్లో భాగంగా శనివారం పండితులతో హోమం తలపెట్టాడు. హోమంలో కూర్చున్న రవీంద్రబాబు విద్యుత్ తీగ రూపంలో మృత్యువు వెంటాడింది. ఇంటి పెరట్లోని మోటార్‌కు సంబంధించిన వైరు అడ్డుగా ఉందన్న కారణంతో పూజలో నుంచి బయటకు వచ్చి వైరు చుట్టగా చుట్టి గోడపై పెట్టే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కుప్ప కూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. శుభ కార్యం జరగాల్సిన చోట రోదనలు.. గృహప్రవేశం పిలుపుతో పలువురు దగ్గరి బంధులు రావడంతో అప్పటి వరకు సందడిగా ఉండేది. కాగా ఇంటి యజమనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు బంధువుల రోదనలు మిన్నంటాయి. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని సొంతగ్రామం సింధనూరుకు తీసుకెళ్లడంతో శుభ కార్యం జరగాల్సిన ఇల్లు ఒక్కసారిగా బోసిపోయింది. -
ఉగ్రవాదులకు ఇంటి దొంగల సాయం?
దీపావళి రోజు రాత్రి ఎనిమిది మంది సిమి ఉగ్రవాదులు భోపాల్ జైలు నుంచి పారిపోవడానికి సబ్ జైలర్, ఇద్దరు గార్డులు సాయం చేశారన్న అనుమానాలు వస్తున్నాయి. ఇంటి దొంగల సాయంతోనే వాళ్లు పారిపోయారని అంటున్నారు. ఇందుకోసం ఆ ముగ్గురినీ సీఐడీ విచారిస్తోంది. లోపలి వాళ్ల సాయం లేకుండా అంత పటిష్ఠ భద్రత ఉన్న జైలు నుంచి పారిపోవడం అసాధ్యమని సీఐడీ భావిస్తోంది. ఉగ్రవాదులు పారిపోడానికి కొద్ది రోజుల ముందే.. ఈ కుట్రకు సూత్రధారి అయిన ఓ ముఖ్యమైన సిమి నాయకుడిని ఉన్నతాధికారులకు తెలియకుండా ఎ బ్లాకు నుంచి బి బ్లాకుకు మార్చినట్లు తెలిసింది. బి బ్లాకులో మొత్తం 17 మంది ఖైదీలుండగా, వాళ్లలో జైలుగార్డు రాంశంకర్ యాదవ్‌ను చంపి, మరో కానిస్టేబుల్ చందన్ ఖిలాంటేను కట్టిపారేసి 8 మంది ఖైదీలు పారిపోయారు. వాస్తవానికి 9 మంది పారిపోవాలని తొలుత ప్లాన్ చేసినా, తొమ్మిదో వ్యక్తి అనారోగ్యం కారణంగా లోపలే ఉండిపోయాడు. అసలు ఆ 8 మంది సెల్ నుంచి బయటకు ఎలా బయటకు వచ్చారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ప్రతిరోజూ రాత్రిపూట తాళాలను మారుస్తుంటారు. ఒకదానికి ఎలాగోలా డూప్లికేట్ తాళం చెవి చేయగలిగినా, తాళం మారిపోతుంది కాబట్టి బయటకు వచ్చే చాన్స్ లేదు. అందువల్ల లోపలి వాళ్లు సాయం చేయకుండా వాళ్లు అసలు సెల్ లోంచి బయటకు వచ్చే అవకాశం ఉండదు. యాదవ్ షిఫ్టుకు వచ్చేసరికే వాళ్లంతా సెల్ నుంచి బయటకు వచ్చారు. కానీ, బ్లాక్ గేట్ల తాళాలు లేకపోవడంతో చీకట్లో ఆగిపోయారు. యాదవ్, ఖిలాంటే రౌండ్ల కోసం రాగానే వాళ్లను నిర్బంధించి, తాళాలు లాక్కున్నారు. జైలుగోడ బయట కొత్తగా ట్రైనింగ్ నుంచి వచ్చిన గార్డు ఉండటంతో.. పారిపోతున్నవాళ్లు సిమి ఉగ్రవాదులన్న విషయం అతడికి తెలియలేదు. అయినా అతడు అప్రమత్తం చేయడంతో.. లోపల ఖైదీలను లెక్కించడం మొదలుపెట్టారు. ఈలోపే యాదవ్ మృతదేహం కనిపించింది. పారిపోయే క్రమంలో ఒక ఉగ్రవాది కాలికి గాయం కావడంతో వాళ్లు ఎక్కువ దూరం వెళ్లలేకపోయారు. గత ఐదారేళ్లలో వాళ్లు పారిపోయిన మార్గం బాగా మారిపోవడంతో, తమకు తెలుసనుకున్న ఊళ్లను వాళ్లు గుర్తుపట్టలేకపోయారు. మణిఖెండి పహాడి వద్దకు వెళ్లేసరికి పోలీసులు వారిని చుట్టుముట్టారు. అసలు ఉన్నతాధికారులకు తెలియకుండా సిమి ఉగ్రవాదులను బ్లాకులు ఎందుకు మార్చారన్నది ఇప్పుడు విచారణలో ప్రధానాంశంగా మారింది. దానికితోడు వాళ్లకు సెల్ తాళాలు ఎలా వచ్చాయని కూడా చూస్తున్నారు. అందుకే సబ్ జైలర్, మరో ఇద్దరు గార్డులను గట్టిగా విచారిస్తున్నారు.