ఉగ్రవాదులకు ఇంటి దొంగల సాయం? | did jail staff help simi terrorists to escape from bhopal jail | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదులకు ఇంటి దొంగల సాయం?

Published Fri, Nov 4 2016 8:51 AM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM

ఉగ్రవాదులకు ఇంటి దొంగల సాయం?

ఉగ్రవాదులకు ఇంటి దొంగల సాయం?

దీపావళి రోజు రాత్రి ఎనిమిది మంది సిమి ఉగ్రవాదులు భోపాల్ జైలు నుంచి పారిపోవడానికి సబ్ జైలర్‌, ఇద్దరు గార్డులు సాయం చేశారన్న అనుమానాలు వస్తున్నాయి. ఇంటి దొంగల సాయంతోనే వాళ్లు పారిపోయారని అంటున్నారు. ఇందుకోసం ఆ ముగ్గురినీ సీఐడీ విచారిస్తోంది. లోపలి వాళ్ల సాయం లేకుండా అంత పటిష్ఠ భద్రత ఉన్న జైలు నుంచి పారిపోవడం అసాధ్యమని సీఐడీ భావిస్తోంది. 
 
ఉగ్రవాదులు పారిపోడానికి కొద్ది రోజుల ముందే.. ఈ కుట్రకు సూత్రధారి అయిన ఓ ముఖ్యమైన సిమి నాయకుడిని ఉన్నతాధికారులకు తెలియకుండా ఎ బ్లాకు నుంచి బి బ్లాకుకు మార్చినట్లు తెలిసింది. బి బ్లాకులో మొత్తం 17 మంది ఖైదీలుండగా, వాళ్లలో జైలుగార్డు రాంశంకర్ యాదవ్‌ను చంపి, మరో కానిస్టేబుల్ చందన్ ఖిలాంటేను కట్టిపారేసి 8 మంది ఖైదీలు పారిపోయారు. వాస్తవానికి 9 మంది పారిపోవాలని తొలుత ప్లాన్ చేసినా, తొమ్మిదో వ్యక్తి అనారోగ్యం కారణంగా లోపలే ఉండిపోయాడు. అసలు ఆ 8 మంది సెల్ నుంచి బయటకు ఎలా బయటకు వచ్చారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ప్రతిరోజూ రాత్రిపూట తాళాలను మారుస్తుంటారు. ఒకదానికి ఎలాగోలా డూప్లికేట్ తాళం చెవి చేయగలిగినా, తాళం మారిపోతుంది కాబట్టి బయటకు వచ్చే చాన్స్ లేదు. అందువల్ల లోపలి వాళ్లు సాయం చేయకుండా వాళ్లు అసలు సెల్ లోంచి బయటకు వచ్చే అవకాశం ఉండదు. 
 
యాదవ్ షిఫ్టుకు వచ్చేసరికే వాళ్లంతా సెల్ నుంచి బయటకు వచ్చారు. కానీ, బ్లాక్ గేట్ల తాళాలు లేకపోవడంతో చీకట్లో ఆగిపోయారు. యాదవ్, ఖిలాంటే రౌండ్ల కోసం రాగానే వాళ్లను నిర్బంధించి, తాళాలు లాక్కున్నారు. జైలుగోడ బయట కొత్తగా ట్రైనింగ్ నుంచి వచ్చిన గార్డు ఉండటంతో.. పారిపోతున్నవాళ్లు సిమి ఉగ్రవాదులన్న విషయం అతడికి తెలియలేదు. అయినా అతడు అప్రమత్తం చేయడంతో.. లోపల ఖైదీలను లెక్కించడం మొదలుపెట్టారు. ఈలోపే యాదవ్ మృతదేహం కనిపించింది. పారిపోయే క్రమంలో ఒక ఉగ్రవాది కాలికి గాయం కావడంతో వాళ్లు ఎక్కువ దూరం వెళ్లలేకపోయారు. 
 
గత ఐదారేళ్లలో వాళ్లు పారిపోయిన మార్గం బాగా మారిపోవడంతో, తమకు తెలుసనుకున్న ఊళ్లను వాళ్లు గుర్తుపట్టలేకపోయారు. మణిఖెండి పహాడి వద్దకు వెళ్లేసరికి పోలీసులు వారిని చుట్టుముట్టారు. అసలు ఉన్నతాధికారులకు తెలియకుండా సిమి ఉగ్రవాదులను బ్లాకులు ఎందుకు మార్చారన్నది ఇప్పుడు విచారణలో ప్రధానాంశంగా మారింది. దానికితోడు వాళ్లకు సెల్ తాళాలు ఎలా వచ్చాయని కూడా చూస్తున్నారు. అందుకే సబ్ జైలర్, మరో ఇద్దరు గార్డులను గట్టిగా విచారిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement