Bhopal Jail break
-
ఉగ్రవాదులకు ఇంటి దొంగల సాయం?
దీపావళి రోజు రాత్రి ఎనిమిది మంది సిమి ఉగ్రవాదులు భోపాల్ జైలు నుంచి పారిపోవడానికి సబ్ జైలర్, ఇద్దరు గార్డులు సాయం చేశారన్న అనుమానాలు వస్తున్నాయి. ఇంటి దొంగల సాయంతోనే వాళ్లు పారిపోయారని అంటున్నారు. ఇందుకోసం ఆ ముగ్గురినీ సీఐడీ విచారిస్తోంది. లోపలి వాళ్ల సాయం లేకుండా అంత పటిష్ఠ భద్రత ఉన్న జైలు నుంచి పారిపోవడం అసాధ్యమని సీఐడీ భావిస్తోంది. ఉగ్రవాదులు పారిపోడానికి కొద్ది రోజుల ముందే.. ఈ కుట్రకు సూత్రధారి అయిన ఓ ముఖ్యమైన సిమి నాయకుడిని ఉన్నతాధికారులకు తెలియకుండా ఎ బ్లాకు నుంచి బి బ్లాకుకు మార్చినట్లు తెలిసింది. బి బ్లాకులో మొత్తం 17 మంది ఖైదీలుండగా, వాళ్లలో జైలుగార్డు రాంశంకర్ యాదవ్‌ను చంపి, మరో కానిస్టేబుల్ చందన్ ఖిలాంటేను కట్టిపారేసి 8 మంది ఖైదీలు పారిపోయారు. వాస్తవానికి 9 మంది పారిపోవాలని తొలుత ప్లాన్ చేసినా, తొమ్మిదో వ్యక్తి అనారోగ్యం కారణంగా లోపలే ఉండిపోయాడు. అసలు ఆ 8 మంది సెల్ నుంచి బయటకు ఎలా బయటకు వచ్చారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ప్రతిరోజూ రాత్రిపూట తాళాలను మారుస్తుంటారు. ఒకదానికి ఎలాగోలా డూప్లికేట్ తాళం చెవి చేయగలిగినా, తాళం మారిపోతుంది కాబట్టి బయటకు వచ్చే చాన్స్ లేదు. అందువల్ల లోపలి వాళ్లు సాయం చేయకుండా వాళ్లు అసలు సెల్ లోంచి బయటకు వచ్చే అవకాశం ఉండదు. యాదవ్ షిఫ్టుకు వచ్చేసరికే వాళ్లంతా సెల్ నుంచి బయటకు వచ్చారు. కానీ, బ్లాక్ గేట్ల తాళాలు లేకపోవడంతో చీకట్లో ఆగిపోయారు. యాదవ్, ఖిలాంటే రౌండ్ల కోసం రాగానే వాళ్లను నిర్బంధించి, తాళాలు లాక్కున్నారు. జైలుగోడ బయట కొత్తగా ట్రైనింగ్ నుంచి వచ్చిన గార్డు ఉండటంతో.. పారిపోతున్నవాళ్లు సిమి ఉగ్రవాదులన్న విషయం అతడికి తెలియలేదు. అయినా అతడు అప్రమత్తం చేయడంతో.. లోపల ఖైదీలను లెక్కించడం మొదలుపెట్టారు. ఈలోపే యాదవ్ మృతదేహం కనిపించింది. పారిపోయే క్రమంలో ఒక ఉగ్రవాది కాలికి గాయం కావడంతో వాళ్లు ఎక్కువ దూరం వెళ్లలేకపోయారు. గత ఐదారేళ్లలో వాళ్లు పారిపోయిన మార్గం బాగా మారిపోవడంతో, తమకు తెలుసనుకున్న ఊళ్లను వాళ్లు గుర్తుపట్టలేకపోయారు. మణిఖెండి పహాడి వద్దకు వెళ్లేసరికి పోలీసులు వారిని చుట్టుముట్టారు. అసలు ఉన్నతాధికారులకు తెలియకుండా సిమి ఉగ్రవాదులను బ్లాకులు ఎందుకు మార్చారన్నది ఇప్పుడు విచారణలో ప్రధానాంశంగా మారింది. దానికితోడు వాళ్లకు సెల్ తాళాలు ఎలా వచ్చాయని కూడా చూస్తున్నారు. అందుకే సబ్ జైలర్, మరో ఇద్దరు గార్డులను గట్టిగా విచారిస్తున్నారు. -
అందరినీ ఆశ్చర్యపరిచిన సీఎం
-
జైళ్ల నుంచి ముస్లింలే ఎందుకు పారిపోతారు: దిగ్విజయ్
ప్రతిసారీ జైళ్ల నుంచి ముస్లింలు మాత్రమే ఎందుకు పారిపోతారు.. హిందువులు ఎందుకు పారిపోరని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. భోపాల్ సెంట్రల్ జైలు నుంచి పారిపోయిన 8 మంది సిమి ఉగ్రవాదుల కాల్చివేత ఘటనపై ఆయన స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ జరిపించాలని, దాన్ని కోర్టు పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ముస్లింలు మాత్రమే ఎందుకు జైళ్ల నుంచి పారిపోతున్నారని, అసలు సమస్య ఏంటన్న విషయంపై కూడా దర్యాప్తు జరగాలని ఆయన అన్నారు. అయితే దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను మధ్యప్రదేవ్ హోం శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ ఖండించారు. మన దేశంలో ఎప్పుడైనా ఉగ్రవాదులు ఎన్కౌంటర్లో మరణించగానే దాని మీద అనుమానాలు వ్యక్తం చేయడానికి కొంత మంది సిద్ధంగా ఉంటారని, ముఖ్యంగా అందులో కాంగ్రెస్ వాళ్లే ముందుంటారని అన్నారు. సిమి ఉగ్రవాదుల వ్యవహారంలో ఇక దర్యాప్తు ఏమీ అవసరం లేదని, పోలీసులు మొత్తం సమాచారం అందించారని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయన్న అంశంపై మాత్రమే ఎన్ఐఏ విచారణ జరుగుతుందని భూపీంద్ర సింగ్ అన్నారు. -
అందరినీ ఆశ్చర్యపరిచిన సీఎం
భోపాల్: సిమి కార్యకర్తల ఎన్ కౌంటర్ పై కొంత మంది చేస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలపై రాజకీయాలు చేయడం తగదన్నారు. మన సైనికుల త్యాగాలను గుర్తించకుండా కొంతమంది రాజకీయ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సిమి ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్ రమాశంకర్ యాదవ్ కు ఆయన నివాళి అర్పించారు. యాదవ్ ఇంటికి వచ్చి అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. యాదవ్ భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రమాశంకర్ కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం అందిస్తామన్నారు. అతడి కుమార్తె వివాహానికి రూ. 5 లక్షలు ఇస్తామని హామీయిచ్చారు. రమాశంకర్ కుటుంబ సభ్యులు నివసిస్తున్న కాలనీకి అతడి పేరు పెడతామన్నారు. కాగా, రమాశంకర్ భౌతికకాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు నిర్వహించిన అంతిమయాత్రలో వేలాది మంది పాల్గొన్నారు. సీఎం చౌహాన్.. రమాశంకర్ పాడెను మోసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఉగ్రవాదులతో పోరాడి రమాశంకర్ ప్రాణత్యాగం చేశాడని చౌహాన్ కొనియాడారు. 8 మంది సిమి కార్యకర్తలు సోమవారం రమాశంకర్ ను హత్యచేసి భోపాల్ సెంట్రల్ జైలు నుంచి పారిపోయారు. కొన్ని గంటల్లోనే పోలీసుల ఎన్కౌంటర్లో వీరు హతమయ్యారు.