అందరినీ ఆశ్చర్యపరిచిన సీఎం
భోపాల్: సిమి కార్యకర్తల ఎన్ కౌంటర్ పై కొంత మంది చేస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలపై రాజకీయాలు చేయడం తగదన్నారు. మన సైనికుల త్యాగాలను గుర్తించకుండా కొంతమంది రాజకీయ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సిమి ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్ రమాశంకర్ యాదవ్ కు ఆయన నివాళి అర్పించారు. యాదవ్ ఇంటికి వచ్చి అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. యాదవ్ భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... రమాశంకర్ కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం అందిస్తామన్నారు. అతడి కుమార్తె వివాహానికి రూ. 5 లక్షలు ఇస్తామని హామీయిచ్చారు. రమాశంకర్ కుటుంబ సభ్యులు నివసిస్తున్న కాలనీకి అతడి పేరు పెడతామన్నారు. కాగా, రమాశంకర్ భౌతికకాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు నిర్వహించిన అంతిమయాత్రలో వేలాది మంది పాల్గొన్నారు.
సీఎం చౌహాన్.. రమాశంకర్ పాడెను మోసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఉగ్రవాదులతో పోరాడి రమాశంకర్ ప్రాణత్యాగం చేశాడని చౌహాన్ కొనియాడారు. 8 మంది సిమి కార్యకర్తలు సోమవారం రమాశంకర్ ను హత్యచేసి భోపాల్ సెంట్రల్ జైలు నుంచి పారిపోయారు. కొన్ని గంటల్లోనే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో వీరు హతమయ్యారు.