జైళ్ల నుంచి ముస్లింలే ఎందుకు పారిపోతారు: దిగ్విజయ్
ప్రతిసారీ జైళ్ల నుంచి ముస్లింలు మాత్రమే ఎందుకు పారిపోతారు.. హిందువులు ఎందుకు పారిపోరని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. భోపాల్ సెంట్రల్ జైలు నుంచి పారిపోయిన 8 మంది సిమి ఉగ్రవాదుల కాల్చివేత ఘటనపై ఆయన స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ జరిపించాలని, దాన్ని కోర్టు పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ముస్లింలు మాత్రమే ఎందుకు జైళ్ల నుంచి పారిపోతున్నారని, అసలు సమస్య ఏంటన్న విషయంపై కూడా దర్యాప్తు జరగాలని ఆయన అన్నారు.
అయితే దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను మధ్యప్రదేవ్ హోం శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ ఖండించారు. మన దేశంలో ఎప్పుడైనా ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్‌లో మరణించగానే దాని మీద అనుమానాలు వ్యక్తం చేయడానికి కొంత మంది సిద్ధంగా ఉంటారని, ముఖ్యంగా అందులో కాంగ్రెస్ వాళ్లే ముందుంటారని అన్నారు. సిమి ఉగ్రవాదుల వ్యవహారంలో ఇక దర్యాప్తు ఏమీ అవసరం లేదని, పోలీసులు మొత్తం సమాచారం అందించారని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయన్న అంశంపై మాత్రమే ఎన్ఐఏ విచారణ జరుగుతుందని భూపీంద్ర సింగ్ అన్నారు.