క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు: దిగ్విజయ్
న్యూఢిల్లీ: తెలంగాణ పోలీసులపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ, ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ఆయన తెగేసి చెప్పారు. తెలంగాణ పోలీసులు ఐసిస్ నకిలీ వెబ్‌సైట్లతో ముస్లిం యువతను రెచ్చగొడుతున్నారంటూ ట్వీటర్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఆయన స్పందించారు.
మంగళవారం ఢిల్లీలో దిగ్విజయ్ ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలకు పూర్తిగా కట్టుబడి ఉన్నానన్నారు. ఈ విషయంపై ఎవరెన్ని కేసులు పెట్టుకున్నా తనకు అభ్యంతరం లేదని చెప్పారు. తెలంగాణ పోలీసులు యువతను ఎలా రెచ్చగొడుతున్నారో తన వద్ద ఆధారాలు ఉన్నాయని దిగ్విజయ్ తెలిపారు. ఈ అంశంపై చాలా మందితో మాట్లాడి అధ్యయనం చేసి ఆధారాలు సేకరించానన్నారు. ముస్లిం యువతను ట్రాప్ చేయడం నైతికంగా ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు.
మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో బాంబు పేలుళ్లు, కాన్పుర్‌లో సైఫుల్లా ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ పోలీసులకు ముందే సమాచారం ఉందని...దీనిని తెలంగాణ పోలీసులే అంగీకరించారన్నారు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన ఫొటోలు తెలంగాణ పోలీసుల వద్ద ఉండటమే అందుకు నిదర్శనమని దిగ్విజయ్ పేర్కొన్నారు.
తెలంగాణ పోలీసుల వ్యూహం ఏదైనా కావచ్చుగానీ నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి ఐసిస్ వైపు ఆకర్షితులయ్యే ముస్లిం యువతను గుర్తించే విధానం సరికాదని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. ఐసిస్‌వైపు యువతను రెచ్చగొట్టడం వల్ల వారు ఇంకా ఎక్కువగా ఆకర్షితులవుతారన్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన కౌంటర్ టెర్రరిజం సమావేశాల్లో పాల్గొన్న యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులంతా కూడా ఈ విధానాన్ని వ్యతిరేకించారని దిగ్విజయ్ చెప్పారు.
మరోవైపు దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్పాలని లేదా ఆరోపణలను రుజువు చేయాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన గనుక క్షమాపణ చెప్పనట్లయితే చట్టప్రకారం చర్య తీసుకుంటామని హెచ‍్చరించారు. ‘పనితీరులో తెలంగాణ పోలీసులు సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు. అలాంటప్పుడు ముస్లింల పిల్లలను పోలీసులు తీవ్రవాదం వైపు మళ్లిస్తున్నారంటూ ఆరోపించటమేంటన్నారు. ఆ వ్యాఖ‍్యలను ఆయన నిరూపించుకోవాల’ని మంత్రి సవాల్ విసిరారు.
ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన దిగ్విజయ్ ఇలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం చాలా గర్హనీయమన్నారు. తెలంగాణ పోలీసులు ఐసిస్ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసి ముస్లిం యువతను మత తీవ్రవాదం వైపు మళ్లిస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలకు కారణమైంది. కాగా, దిగ్విజయ్ వ్యాఖ్యలపై జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.