jail staff help
-
98 ఏళ్ల వృద్ధ ఖైదీకి..ఘనంగా జైలు సిబ్బంది వీడ్కోలు
జైలు నుంచి విడుదలైన ఖైదీలకు ఘనంగా వీడ్కోలు పలకడం చాలా అరుదు. ఒకవేళ మంచి సత్ప్రవర్తన కారణంగానో లేక ఏదైన మంచి పనులు చేసినట్లయితే గనుక వారిని మంచిగా సన్మానించి విడుదల చేయడం వంటి ఘటనలు జరుగుతుంటాయి. ఇలా ఒక ఖైదీకి జైలు సూపరింటెండెంటే ఏకంగా స్వయంగా కారు వద్దకు తీసుకువెళ్లి ఘనంగా పంపిచడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకెళ్తే..98 ఏళ్ల రామ్ సూరత్ అనే వృద్ధ ఖైదీ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జైలు నుంచి విడుదలయ్యాడు. అతడు ఐపీసీ సెక్షన్ 452, 323, 352 కింద దోషిగా నిర్థారించి 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ మేరకు జైలు శిక్ష అనంతర విడుదలైన రామ్ సూరత్‌ని తీసుకుని వెళ్లేందుకు అతని కుటుంబ సభ్యులు ఎవరు రాలేదు. దీంతో జైలు సూపరింటెండెంట్ శశికాంత్ మిశ్రా పుత్రావత్ ఘనంగా వీడ్కోలు పలుకుతూ..స్వయంగా ఆయనే ఆ వృద్ధ ఖైదీ వెంట వచ్చి కారు ఇచ్చి మరీ అతని ఇంటికి పంపించారు. వాస్తవాని సూరత్ ఆగస్టు8న విడుదల కావాల్సి ఉంది. కానీ మే 20, 2022న కోవిడ్ ఉన్నట్లు నిర్థారణ కావడంతో 90 రోజులపాటు పెరోల్‌పై ఉన్నారు. అందుకు సంబంధించిన ఘటనను ఉత్తరప్రదేశ్ డీజీ ప్రిజన్స్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు 98 ఏళ్ల వృద్ధుడిని జైలులో ఉంచడం మానవత్వం అని ఫైర్ అవుతుండగా, మరికొందరూ మాటలు రావడం లేదు ఎంత ఘనంగా పంపిచారంటూ జైలు సిబ్బందిపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. परहित सरिस धर्म नहीं भाई . 98 वर्षीय श्री रामसूरत जी की रिहाई पर लेने कोई नहीं आया . अधीक्षक जिला जेल अयोध्या श्री शशिकांत मिश्र पुत्रवत अपनी गाड़ी से घर भेजते हुए . @rashtrapatibhvn @narendramodi @myogiadityanath @dharmindia51 pic.twitter.com/qesldPhwBB — DG PRISONS U.P (@DgPrisons) January 8, 2023 (చదవండి: వేధించాడని ఇంటికి పిలిచి హత్య) -
జైలు సిబ్బందిపై సూపరింటెండెంట్ సీరియస్
కర్నూలు: కర్నూలు శివారులో పంచలింగాల సమీపంలోని జిల్లా జైలు సిబ్బంది తీరుపై సూపరింటెండెంట్ వరుణారెడ్డి సీరియస్ అయ్యారు. ‘వసూళ్ల జైలు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో వెలువడిన కథనానికి స్పందించి కిందిస్థాయి సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘జిల్లా అంతటా పరువు తీశారు... ఇకపై మీ ఆటలు చెల్లవు.. పద్ధతి మార్చుకోకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సి వస్తుందంటూ’ హెచ్చరించినట్లు సమాచారం. ‘ఖైదీలను కలుసుకునేందుకు వచ్చే బంధువులు, స్నేహితు లు.. జైలు సిబ్బందికి ఎవరికీ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ములాఖత్ కోసం ఎవరైనా డబ్బు అడిగితే తగిన చర్యల కోసం 08518–247227, 94946 33400కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి’ అంటూ జైలు బారీకేడ్స్పై బోర్డులు రాయించారు. ‘అవినీతి రహిత జైలుగా ఉంచేందుకు మీ అందరి సహకారం అవసరం’ అంటూ సూపరింటెండెంట్ పేరుతో బోర్డులు రాయించి పరోక్షంగా అవినీతి సిబ్బందిని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఫిర్యాదులు లేవు.. జైలుకు వచ్చే సందర్శకుల నుంచి వార్డర్, హెడ్ వార్డర్లు మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని వరుణారెడ్డి సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మామూళ్ల విషయంపై ఖైదీల బంధువులు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏసీబీ కేసులో పట్టుబడిన ముద్దాయిలైనా.. ఇతర కేసుల్లో రిమాండ్‌కు వచ్చిన నిందితులైనా.. జైలులో అందరినీ సమానంగా చూస్తున్నామని, ఎవరికీ అదనపు సౌకర్యాలు కల్పించడం లేదని ఆయన తెలిపారు. -
ఉగ్రవాదులకు ఇంటి దొంగల సాయం?
దీపావళి రోజు రాత్రి ఎనిమిది మంది సిమి ఉగ్రవాదులు భోపాల్ జైలు నుంచి పారిపోవడానికి సబ్ జైలర్, ఇద్దరు గార్డులు సాయం చేశారన్న అనుమానాలు వస్తున్నాయి. ఇంటి దొంగల సాయంతోనే వాళ్లు పారిపోయారని అంటున్నారు. ఇందుకోసం ఆ ముగ్గురినీ సీఐడీ విచారిస్తోంది. లోపలి వాళ్ల సాయం లేకుండా అంత పటిష్ఠ భద్రత ఉన్న జైలు నుంచి పారిపోవడం అసాధ్యమని సీఐడీ భావిస్తోంది. ఉగ్రవాదులు పారిపోడానికి కొద్ది రోజుల ముందే.. ఈ కుట్రకు సూత్రధారి అయిన ఓ ముఖ్యమైన సిమి నాయకుడిని ఉన్నతాధికారులకు తెలియకుండా ఎ బ్లాకు నుంచి బి బ్లాకుకు మార్చినట్లు తెలిసింది. బి బ్లాకులో మొత్తం 17 మంది ఖైదీలుండగా, వాళ్లలో జైలుగార్డు రాంశంకర్ యాదవ్‌ను చంపి, మరో కానిస్టేబుల్ చందన్ ఖిలాంటేను కట్టిపారేసి 8 మంది ఖైదీలు పారిపోయారు. వాస్తవానికి 9 మంది పారిపోవాలని తొలుత ప్లాన్ చేసినా, తొమ్మిదో వ్యక్తి అనారోగ్యం కారణంగా లోపలే ఉండిపోయాడు. అసలు ఆ 8 మంది సెల్ నుంచి బయటకు ఎలా బయటకు వచ్చారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ప్రతిరోజూ రాత్రిపూట తాళాలను మారుస్తుంటారు. ఒకదానికి ఎలాగోలా డూప్లికేట్ తాళం చెవి చేయగలిగినా, తాళం మారిపోతుంది కాబట్టి బయటకు వచ్చే చాన్స్ లేదు. అందువల్ల లోపలి వాళ్లు సాయం చేయకుండా వాళ్లు అసలు సెల్ లోంచి బయటకు వచ్చే అవకాశం ఉండదు. యాదవ్ షిఫ్టుకు వచ్చేసరికే వాళ్లంతా సెల్ నుంచి బయటకు వచ్చారు. కానీ, బ్లాక్ గేట్ల తాళాలు లేకపోవడంతో చీకట్లో ఆగిపోయారు. యాదవ్, ఖిలాంటే రౌండ్ల కోసం రాగానే వాళ్లను నిర్బంధించి, తాళాలు లాక్కున్నారు. జైలుగోడ బయట కొత్తగా ట్రైనింగ్ నుంచి వచ్చిన గార్డు ఉండటంతో.. పారిపోతున్నవాళ్లు సిమి ఉగ్రవాదులన్న విషయం అతడికి తెలియలేదు. అయినా అతడు అప్రమత్తం చేయడంతో.. లోపల ఖైదీలను లెక్కించడం మొదలుపెట్టారు. ఈలోపే యాదవ్ మృతదేహం కనిపించింది. పారిపోయే క్రమంలో ఒక ఉగ్రవాది కాలికి గాయం కావడంతో వాళ్లు ఎక్కువ దూరం వెళ్లలేకపోయారు. గత ఐదారేళ్లలో వాళ్లు పారిపోయిన మార్గం బాగా మారిపోవడంతో, తమకు తెలుసనుకున్న ఊళ్లను వాళ్లు గుర్తుపట్టలేకపోయారు. మణిఖెండి పహాడి వద్దకు వెళ్లేసరికి పోలీసులు వారిని చుట్టుముట్టారు. అసలు ఉన్నతాధికారులకు తెలియకుండా సిమి ఉగ్రవాదులను బ్లాకులు ఎందుకు మార్చారన్నది ఇప్పుడు విచారణలో ప్రధానాంశంగా మారింది. దానికితోడు వాళ్లకు సెల్ తాళాలు ఎలా వచ్చాయని కూడా చూస్తున్నారు. అందుకే సబ్ జైలర్, మరో ఇద్దరు గార్డులను గట్టిగా విచారిస్తున్నారు.