అవినీతి రహిత జైలుగా ఉంచడానికి సహకరించాలని జిల్లా జైలు గోడలపై వెలసిన బోర్డు
కర్నూలు: కర్నూలు శివారులో పంచలింగాల సమీపంలోని జిల్లా జైలు సిబ్బంది తీరుపై సూపరింటెండెంట్ వరుణారెడ్డి సీరియస్ అయ్యారు. ‘వసూళ్ల జైలు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో వెలువడిన కథనానికి స్పందించి కిందిస్థాయి సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘జిల్లా అంతటా పరువు తీశారు... ఇకపై మీ ఆటలు చెల్లవు.. పద్ధతి మార్చుకోకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సి వస్తుందంటూ’ హెచ్చరించినట్లు సమాచారం. ‘ఖైదీలను కలుసుకునేందుకు వచ్చే బంధువులు, స్నేహితు లు.. జైలు సిబ్బందికి ఎవరికీ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ములాఖత్ కోసం ఎవరైనా డబ్బు అడిగితే తగిన చర్యల కోసం 08518–247227, 94946 33400కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి’ అంటూ జైలు బారీకేడ్స్‌పై బోర్డులు రాయించారు. ‘అవినీతి రహిత జైలుగా ఉంచేందుకు మీ అందరి సహకారం అవసరం’ అంటూ సూపరింటెండెంట్ పేరుతో బోర్డులు రాయించి పరోక్షంగా అవినీతి సిబ్బందిని హెచ్చరించారు.
ఇప్పటి వరకు ఫిర్యాదులు లేవు.. జైలుకు వచ్చే సందర్శకుల నుంచి వార్డర్, హెడ్ వార్డర్‌లు మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని వరుణారెడ్డి సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మామూళ్ల విషయంపై ఖైదీల బంధువులు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏసీబీ కేసులో పట్టుబడిన ముద్దాయిలైనా.. ఇతర కేసుల్లో రిమాండ్‌కు వచ్చిన నిందితులైనా.. జైలులో అందరినీ సమానంగా చూస్తున్నామని, ఎవరికీ అదనపు సౌకర్యాలు కల్పించడం లేదని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment