ఈఓ కోటేశ్వరమ్మ , చైర్మన్ గౌరంగబాబు
రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఆలయమైన దుర్గగుడిలో అధికారవర్గం.. పాలకవర్గం విభేదాలపై పెడుతున్న శ్రద్ధ.. భక్తులకు మెరుగైన సేవలు అందించే అంశంపై పెట్టలేకపోతున్నారనేది అమ్మ భక్తులకు అర్థమవుతున్న విషయం. భక్తులు మెచ్చేలా.. అందరికీ నచ్చేలా నిర్ణయాలతో ముందడుగువేయాల్సిన తరుణంలో ఆధిపత్య పోరు ఆందోళన కలిగిస్తోంది. కనకదుర్గమ్మ ఆలయ అధికారవర్గం.. పాలకవర్గం మధ్య విభేదాలు పాలక మండలి సమావేశం సాక్షిగా మరోమారు బహిర్గతమయ్యాయి. ఎడముఖం.. పెడముఖంగా ఈవో, చైర్మన్ వేర్వేరుగా విలేకరుల సమావేశాలు నిర్వహించి ఎవరి ధోరణిలో వారు మాట్లాడటం భక్తులను విస్మయపరుస్తోంది.
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమం) : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈఓ, పాలక మండలి చైర్మన్ మధ్య విభేదాలు మరోమారు బయటపడ్డాయి. దుర్గగుడి పాలక మండలి సమావేశం శనివారం దేవస్థానానికి చెందిన మాడపాటి సత్రంలోని బోర్డు మీటింగ్ హాల్‌లో జరిగింది. చైర్మన్ గౌరంగబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈఓ వి.కోటేశ్వరమ్మ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఈఓ కోటేశ్వరమ్మ మాత్రమే మీడియాతో ప్రసంగించి ముగించారు. దుర్గగుడిలో దసరా ఉత్సవాల తర్వాత నలుగురు సిబ్బందిపై వేటు వేయడంపై పాలక మండలి సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
అయితే ఉద్యోగుల వ్యవహారం దేవస్థాన అడ్మినిస్ట్రేషన్‌కు చెందిందని ఈఓ సర్ది చెప్పారు. ఈ విషయంలో పాలక వర్గం ఆగ్రహంగా ఉంది. పాలక వర్గ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాల గురించి ఈఓ మీడియాకు వివరించి సమావేశాన్ని హడావుడిగా ముగించేశారు. అయితే సమావేశం గురించి, ఉద్యోగులపై వేటు వ్యవçహారం గురించి చైర్మన్‌ను వివరణ కోరగా, ఆయన మరోమారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో పాలక వర్గం, ఈఓ మధ్య చోటు చేసుకున్న విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయనేది అర్థమవుతోంది.
దత్తత ఆలయాల నిర్వహణపై దృష్టి : ఈఓ
దుర్గగుడి దత్తత ఆలయాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయించామని ఆలయ ఈఓ వి.కోటేశ్వరమ్మ విలేకరుల సమావేశంలో తెలిపారు. అన్ని దత్తత ఆలయాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించేందుకు పాలక మండలి ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. అన్ని దత్తత ఆలయాల్లో దుర్గగుడి దేవస్థానం సిబ్బందిని నియమించాలని నిర్ణయించామన్నారు.
ఇటీవల ఓ ఆలయాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో గర్భగుడిని అపరిశుభ్రంగా ఉంచడమే కాకుండా ధూపదీప నైవేద్యాలను సరిగా నిర్వహించడం లేదని గుర్తించి అర్చకుడిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. దీంతో ఆ ఆర్చకుడు ఈఓ, ఏఈఓతో పాటు వైదిక కమిటీపై సీఎంఓ కార్యాలయానికి ఫిర్యాదు చేశారని, అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో తీర్మానం చేశామని వివరించారు. దుర్గాఘాట్‌లో పూజా సామగ్రి విక్రయించే చిరు వ్యాపారుల లైసెన్సులు రెన్యువల్ చేయాలని నిర్ణయించామని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం దుర్గాఘాట్‌లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. భవానీ దీక్ష విరమణ మహోత్సవాలకు అవసరమైన ఇంజినీరింగ్ పనులకు ఆమోదం తెలిపామన్నారు.
ఘాట్ రోడ్డులో పార్కింగ్ సదుపాయాన్ని మరింత పెంచాలని నిర్ణయించామని, అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన బంగారం, వెండిని మింట్ ద్వారా కరిగించి గోల్డ్ బాండ్‌లుగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గొల్లపూడిలోని దేవస్థానానికి చెందిన స్థలంలో కాటేజీలు నిర్మించేందుకు పాలకవర్గం ఆమోద ముద్ర వేసిందన్నారు. త్వరలోనే వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, దీనికి విధి విధానాలను వచ్చే పాలక వర్గ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయని చెప్పారు. బస్టాండ్‌లో దేవస్థాన ప్రసాదాల కౌంటర్‌ను ఏర్పాటు చేసి అమ్మవారి ప్రసాదాలతో పాటు క్యాలెండర్లను విక్రయించనున్నామన్నారు.
పాలకవర్గాన్ని పట్టించుకోవడం లేదు : చైర్మన్
పాలక మండలి సమావేశంలో చర్చించిన అంశాలను ఈఓ మీడియాకు వివరించారు. ఇంతలో దేవస్థానానికి హైకోర్టు న్యాయమూర్తులు వస్తున్నారంటూ ఈఓ సమావేశాన్ని అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయారు. దీంతో చైర్మన్ గౌరంగబాబు మీడియాతో మాట్లాడకుండానే సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చేశారు. ఇటీవల ఆలయంలో చోటుచేసుకున్న వ్యవహారాలపై చైర్మన్, పాలక మండలి సభ్యులను మీడియా ప్రశ్నించగా ఆయన మాట్లాడేందుకు అంగీకరించారు. దేవస్థానంలో నలుగురు ఉద్యోగులపై చర్యలు అంశంపై పాలక మండలిలో చర్చించేందుకు సభ్యులు ప్రతిపాదన చేశారని, అయితే అది దేవస్థాన అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన వ్యవహారంగా ఆలయ ఈఓ పేర్కొన్నారని తెలిపారు.
దసరా ఉత్సవాలకు ఎంత వెచ్చించారని చైర్మన్‌ను ప్రశ్నించగా, గత ఏడాది దసరా ఉత్సవాల్లో మొత్తం రూ.6.65 కోట్లు ఖర్చు చేసినట్లు ఆలయ ఈఓ తమకు రికార్డు పూర్వకంగా వివరాలను తెలిపారని పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.8.40 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారన్నారు. అయితే గత ఏడాది దసరా ఉత్సవాల్లో సుమారు రూ.16 కోట్లు ఖర్చు చేసినట్లు ఆలయ ఈఓ వి.కోటేశ్వరమ్మ పలుమార్లు పేర్కొనడం జరిగిందని, ఈ వ్యవహారంలో పాలక మండలిపై కావాలనే ప్రచారం చేయడం ఎంత వరకు సబబని పాలక మండలి సభ్యులు ప్రశ్నించారు. మీడియా సమావేశంలో పలువురు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment