సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ యోజన కింద రాష్ట్రంలోని రైతులకు తొలివిడతగా రూ.2వేలు జమచేయడం ప్రారంభమైంది. 46.5 లక్షల మందికి పైగా రైతు ఖాతాలకు శుక్రవారం నుంచి ఈ నిధులు జమచేయడం మొదలైందని.. 15లోగా అర్హులైన రైతులందరి ఖాతాలకు నగదు చేరుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ‘సాక్షి’కి తెలిపారు. ఈ పథకం కింద వ్యవసాయ ఉత్పాదకాల కోసం ప్రభుత్వం ఏటా రూ.13,500 పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఖరీఫ్‌లో సగం, రబీలో మిగతా సగం నగదు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తితో ఎదురైన ప్రస్తుత విపత్కర పరిస్థితులలో రైతులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా..
► కేంద్రం వివిధ రాష్ట్రాలకు తొలి విడతగా రూ.15,841 కోట్లు విడుదల చేసింది.
► ఇందులో ఏపీకి కేటాయించిన రూ.920 కోట్లలో దాదాపు రూ.660 కోట్లు వివిధ బ్యాంకులకు చేరాయి.
► మిగతా మొత్తం ఒకటి రెండ్రోజుల్లో వచ్చే అవకాశం ఉంది.
బ్యాంకులకు జాబితాలు
వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ యోజన నోడల్ అధికారిగా ఉన్న వ్యవసాయ శాఖ కమిషనర్.. లబ్ధిదారుల జాబితాను బ్యాంకులకు పంపారు. దీంతో బ్యాంకర్లు ప్రస్తుతం తమ వద్దకు వచ్చిన నిధులను రైతుల ఖాతాల్లో జమచేస్తున్నారు. కౌలు రైతులు, అటవీ భూముల సాగుదార్లు, దేవదాయ భూముల సాగుదారులు సహా రాష్ట్రవ్యాప్తంగా 46,50,846 మందికి గత రబీలో ప్రభుత్వ సాయం అందింది. ఇప్పుడు మళ్లీ ఖరీఫ్, రబీలలో రైతులు పెట్టుబడుల కోసం ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
‘ఖరీఫ్’ మొత్తం చెల్లించేందుకు సర్కారు సన్నాహాలు
ఇదిలా ఉంటే.. వచ్చే జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్‌లో ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని మంత్రి కన్నబాబు చెప్పారు. రైతులను అన్ని విధాల ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కాగా, వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ యోజన కింద ప్రస్తుతం జమచేస్తున్న నగదును తీసుకునేందుకు రైతులు బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేదన్నారు. రూపే కార్డులు, ఏటీఎంలు, గ్రామాల్లోని బ్యాంకు మిత్ర ద్వారా నగదును డ్రా చేసుకోవచ్చని.. తప్పని పరిస్థితుల్లో బ్యాంకుల వద్దకు వెళ్తే భౌతిక దూరాన్ని పాటించాలని రైతులకు కన్నబాబు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment