కనులపండువగా వసంతోత్సవం
- శేషవాహనంపై ఊరేగిన ఉత్సవమూర్తులు
- ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన వెంకటేశ్వరుడు
- ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మండలి
కోడూరు : మంగళవాయిద్యాలు.. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ శ్రీకల్యాణ వేంకటేశ్వరుడి వసంతోత్సవాన్ని శుక్రవారం కనులపండువగా నిర్వహించారు. కోడూరులోని శ్రీశ్రీదేవి భూదేవి సమేత శ్రీకల్యాణ వెంకటేశ్వరస్వామివారి 18వ వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో మహాపూర్ణాహూతి కార్యక్రమాన్ని భక్తిప్రపత్తులతో నిర్వహించారు.
ఆలయ ధర్మకర్త కోట పద్మావతి వరప్రసాద్, కృష్ణాపురానికి చెందిన ఇంకొల్లు మురళీకృష్ణ, ప్రముఖ వ్యాపారులు ఇమ్మడి రాంబాబు, రామకృష్ణప్రసాద్ దంపతులు ఈ కార్యక్రమానికి ఉత్సవకర్తలుగా వ్యవహరించారు. తిరుపతికి చెందిన వేదపండితులు కొగంటి రామానుజాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూర్ణాహూతి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి మహిళలు తరలిరావడంతో ఆలయప్రాంగణంలో పండుగ వాతావరణం సంతరించుకుంది.
కోడూరు, ఇస్మాయిల్‌బేగ్‌పేట, కృష్ణాపురం, యర్రారెడ్డివారిపాలెం నుంచి వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో గులాంలు, వివిధ రంగులు కలిపిన నీళ్లు ఒకరిపై ఒకరు చల్లుకుంటూ భక్తిభావంతో ఉత్సాహంగా గడిపారు.
శేషవాహనంపై ఊరేగిన వెంకటేశ్వరుడు..
బ్రహోత్సవాలను పురస్కరించుకుని వెంకటేశ్వరున్ని శేషవాహనంపై గ్రామాల వెంట ఊరేగిస్తూ తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో శేషవాహనానికి ఇంకొల్లు మురళీకృష్ణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జరుగువానిపాలెంకు చెందిన శ్రీనివాసా భక్తసమాజం సభ్యుల భజన కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది.
రంగురాళ్లతో పొదిగిన వెండికవచం..
వెంకటేశ్వరస్వామివారి మూలమూర్తికి ప్రత్యేకంగా చేయించిన రంగు రాళ్లతో పొదిగిన వెండికవచం అలంకరించారు. ఉత్సవాలను పురస్కరించకుని మద్దూరి కాంతారావు ఉత్సవమూర్తులకు రాళ్లకిరీటం, యండూరి యజ్ఞనాగవరప్రసాద్ దంపతులు రాళ్ల వక్షస్థలాన్ని బహుకరించారు. శనివారం ఉదయం స్వామివారి శాంతికల్యాణం నిర్వహించి, రాత్రికి సహస్ర దీపాలంకారసేవ నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి ద్వాదశ ప్రదక్షణులు చేయించి ఆలయ ప్రవేశం చేయించనున్నట్లు ధర్మకర్త కోట పద్మావతి వరప్రసాద్ తెలిపారు.
మండలి ప్రత్యేక పూజలు..
బ్రహోత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు, పండితులు బుద్ధప్రసాద్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేడీసీసీ బ్యాంక్ డెరైక్టర్ ముద్దినేని చంద్రరావు, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు కోట సంపత్‌కుమార్, గోగినేని సోమశేఖరరావు, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.