
మీసాల రాజు గారూ.. మీరేం చేశారో చెప్పరూ..
అందమైన మీసాలను పదే పదే తిప్పడం, తీయనైన మాటలు చెప్పడంలో నరసాపురం సిట్టింగ్ ఎంపీ కనుమూరి బాపిరాజు సిద్ధహస్తులు. రెండు సార్లు ఎంపీగా జిల్లా ప్రజలు ఆయనను ఎన్నుకున్నారు.అయితే ఎంపీగా ఆయన నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. టీటీడీ చైర్మన్ పదవిని కూడా అలంకరించిన బాపిరాజు పదవులు పొందడమే గాని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపింది లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గత ఎన్నికల సమయంలో అనేక వాగ్ధానాలు ఇచ్చిన ఆయన గెలిచిన తర్వాత వాటిని మరిచిపోయారు. నియోజకవర్గంలో 19 కిలోమీటర్ల మేర తీరప్రాంతం విస్తరించి పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నా బాపిరాజు కనీస ప్రయత్నాలు కూడా చేయలేదు. గతంలో తీరగ్రామాల్లో పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు బాపిరాజు హామీ ఇచ్చారు. చైనాకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ ప్రతినిధులు ప్రాజెక్ట్ ఏర్పాటుపై 2005లో అధ్యయనం చేశారు. అప్పట్లో ఆ బృందంతో కలిసి తీరగ్రామాల్లో బైక్‌పై తిరిగి బాపిరాజు నానా హడావిడి చేశారు.
కానీ ఆ తరువాత ఆ ప్రాజెక్ట్ ఏమైందనేది ఇప్పటికీ తెలియదు. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ రూ. 20 వేల కోట్లతో తీరగ్రామాల్లో పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తామని ముందుకు వచ్చింది. బాపిరాజు దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఉంటే ఫలితం ఉండేది. కానీ అంటీముట్టనట్లు వ్యవహరించడంతో అది కూడా కొండెక్కింది. జిల్లాలో బియ్యం ఎగుమతులకు సంబంధించి ఎలాంటి మౌలిక వసతులూ లేవు. తీరప్రాంతంలో రైస్ పోర్ట్ నిర్మిస్తే ఎంతో ఉపయోగం ఉంటుందని రైతు సంఘం నాయకులు మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు.
నరసాపురం-విజయవాడ రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు తానే కృషి చేశానని తరచూ ఆయన చెప్పుకుంటుంటారు. కానీ ఇది నాలుగు దశాబ్దాలుగా ఉన్న ప్రతిపాదనే. దీనికి ఎప్పుడో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. భీమవరంలో బైపాస్ రోడ్డు వద్ద నిర్మించిన రైల్వే ట్రాక్ వద్ద ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా ఆయన అనుమతులు ఇప్పించలేకపోయారు. పదేళ్ల పాటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన బాపిరాజు ప్రజలకు అందుబాటులో ఉన్నదీ అంతంత మాత్రమే. తిరుమల శ్రీవారి దర్శనమైనా తేలిగ్గా దొరుకుంతుందేమో కానీ బాపిరాజు కటాక్షం గగనమేనన్న విమర్శలూ ఉన్నాయి.