
కృష్ణంరాజు అవకాశవాది: వైఎస్సార్ సీపీ
హైదరాబాద్: స్వార్థ ప్రయోజనాల కోసమే కనుమూరి రఘురామ కృష్ణంరాజు పార్టీని వీడారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విమర్శించారు. రఘురామ కృష్ణంరాజు కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ అని ఆరోపించారు. డబ్బు మదంతో వైఎస్ జగన్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ను విమర్శించే స్థాయి ఆయనకు లేదని అన్నారు.
రఘురామ కృష్ణంరాజు అవకాశవాది అని నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. రాజకీయ అవకాశవాదంతో జగన్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల పార్టీ అని చెప్పారు. తనను నమ్ముకున్న వారికి జగన్ అన్యాయం చేయరని అన్నారు. నరసాపురంలో ఎవరి సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. రఘురామ కృష్ణంరాజు లాంటి నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.
తాను సూచించిన వారికే టిక్కెట్లు ఇవ్వాలని జగన్ పై ఆయన ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. పార్టీని నమ్ముకున్న వారిని కాదని టిక్కెట్లు ఇచ్చేది లేదని కృష్ణంరాజుకు జగన్ స్పష్టం చేశారని చెప్పారు. నిన్నటివరకు సమైక్య రాష్ట్రం కోసం పోరాడిన ఏకైక నేత జగన్ అంటూ ప్రశంసించిన ఆయన ఇప్పడు అవకాశవాదంతో తమ నాయకుడిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కాగా, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ బాధ్యతల నుంచి రఘురామ కృష్ణంరాజును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలగించింది. నియోజవర్గంలో అసెంబ్లీ సమన్వయకర్తల ఫిర్యాదుల మేరకు ఈ చర్య తీసుకున్నట్టు వైఎస్సార్ సీపీ తెలిపింది.