రాజకీయ సభగా కాపు మేధోమధన సదస్సు
అకొందరు కాపు నేతల విమర్శలు
గుంటూరు వెస్ట్ : చంద్రబాబుకు భజన చేస్తూ మేధోమదన సదస్సును కాస్తా రాజకీయ సభగా మార్చేశారు. కాపు కార్పొరేషన్ నిధుల వినియోగంపై కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల సంక్షేమం, అభివృద్ధి ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరులోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జిల్లా కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. తొలుత కాపు మేనేజింగ్ డెరైక్టర్ అమరేందర్ రాష్ట్ర ప్రభుత్వం కాపుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. కొంతమంది కాపు సంఘాల నాయకులు, ప్రతినిధులు లేచి ఆందోళనకు దిగారు. కాపు సంక్షేమ సంఘం నాయకుడు ఆళ్ల హరి మాట్లాడుతూ రాజకీయాలు వద్దు, సమస్యలపై చర్చించాలంటూ పట్టుబట్టారు. దీంతో సభలో కొద్దిసేపు ఆందోళన నెలకొంది.
పోలీసులు వచ్చి వారిని బయటకు లాక్కువెళ్లేందుకు ప్రయత్నించగా కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ వారిని వారించారు. కాపు కార్పొరేషన్ ఎం.డి. అమరేందర్ కలుగజేసుకుని కాపుల సంక్షేమానికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని పదేపదే విజ్ఞప్తి చేసినా పెద్దగా ప్రయోజనం చేకూరలేదు.
అనంతరం ప్రసంగించిన ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తదితరులు కూడా తమ ప్రసంగాల్లో చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తేందుకే ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. దీనిపై కొంతమంది కాపు సంఘాల నాయకులు, ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రుణాల పంపిణీలో బ్యాంకర్లు ఇబ్బందికి గురిచేస్తున్నారని, దరఖాస్తు చేసుకోవడం ఎలాగో తమకు అర్థం కావడం లేదంటూ కొంతమంది చీటీలపై రాసి వేదికపై కూర్చున్న అధికారులు, నేతలకు అందజేశారు.