సభకు నమస్కారం | kapu Loan Mela failure | Sakshi
Sakshi News home page

సభకు నమస్కారం

Published Sun, Mar 13 2016 4:11 AM | Last Updated on Mon, Jul 30 2018 6:21 PM

సభకు  నమస్కారం - Sakshi

సభకు నమస్కారం

ఆర్భాటంగా  ‘కాపు’ రుణమేళా
అంతంత మాత్రంగానే హాజరైన లబ్ధిదారులు
జనం లేకపోవడంతో అధికారుల టెన్షన్
కాపు నేతలకు ఫోన్ చేసి హడావుడి
మహిళా సంఘాల సభ్యులు, ముస్లింలు, విద్యార్థుల తరలింపు
నేతలు ప్రసంగిస్తుండగానే వెనుదిరిగిన వైనం
 

 
 అనంతపురం టౌన్ : ‘ఇప్పటికే ఆలస్యమైంది. సభకు నమస్కారం చేసి రెండు నిమిషాలు మాట్లాడండి. వీలైతే నిమిషంలో ముగిస్తే మంచిది’ అంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పదేపదే నాయకులను కోరగా... జనం కూడా అచ్చం ఆయనలాగే ఆలోచించారు. సభ నుంచి ఒక్కొక్కరు జారుకున్నారు. శనివారం అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ మైదానంలో కాపు రుణమేళాను ఆర్భాటంగా నిర్వహించారు. అయితే.. ఆశించిన స్థాయిలో స్పందన కన్పించలేదు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ గంట ఆలస్యమైంది.  జన సమీకరణ కోసం ఒక రోజు ముందు నుంచే అటు అధికారులు, ఇటు టీడీపీకి చెందిన కాపు నేతలు నానా తంటాలు పడ్డారు. అయినప్పటికీ శనివారం ఉదయం సభ ప్రారంభానికి ముందు ఆశించిన స్థాయిలో జనం కన్పించలేదు.

పరువుపోతుందని భావించిన అధికారులు.. కాపు నేతలకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పారు. తాము ఇప్పుడేమీ చేయలేమని వారు చేతులెత్తేయడంతో చివరకు జన సమీకరణ బాధ్యతను అధికారులే తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 15 వేల మందికి పైగా కాపు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కేవలం 2,460 మందికి మాత్రమే రుణాలు మంజూరయ్యాయి. వారిలో కూడా చాలా మంది సభకు రాలేదు. దరఖాస్తు చేసుకున్న వాళ్లంతా రావాలని, రెండో దశలో రుణాలు ఇప్పిస్తామని కాపు నేతలు హామీలు గుప్పించినా ప్రయోజనం లేకపోయింది. చివరకు మహిళా సంఘాల సభ్యులు, మైనార్టీలు, విద్యార్థులను సభకు తరలించారు. తప్పనిసరిగా రావాలని, లేకుంటే ఇబ్బందులు పడతారని హుకుం జారీ చేయడంతో తాము వచ్చినట్లు కొందరు మహిళలు ‘సాక్షి’కి తెలిపారు. 

వారినైతే సభ వరకు రప్పించగలిగారు గానీ చివరి వరకు కూర్చోబెట్టలేకపోయారు.  మంత్రులు ప్రసంగిస్తుండగానే ఎవరికి వారు వెళ్లిపోయారు. చివరి దాకా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రమే మిగిలారు. పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను అటు ప్రజలు సందర్శించకపోగా.. మంత్రులు కూడా పట్టించుకోలేదు. సభ చివరలో కొందరు లబ్ధిదారులకు మంత్రులు చెక్కు, రుణ మంజూరు పత్రాలు అందించారు. వారంతా టీడీపీ నేతల అనుచరులు, కుటుంబ సభ్యులే కావడం గమనార్హం.

 కాపు సంక్షేమమే ధ్యేయం
కాపు రుణమేళాలో  ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, పార్థసారథి, హనుమంతరాయ చౌదరి, ఈరన్న, ఎమ్మెల్సీలు తిప్పేస్వామి, శమంతకమణి, జెడ్పీ చైర్మన్ చమన్ , మేయర్ స్వరూప, బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ్య, డెరైక్టర్ రాయల్ మురళి, వేణుగోపాల రాయుడు మాట్లాడారు.

కాపుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఎన్నికల హామీలను చంద్రబాబు దశలవారీగా అమలు చేస్తున్నారన్నారు.  కాపులను బీసీల్లో చేర్చడం కోసం మంజునాథ కమిషన్ ఏర్పాటు చేశామని, తొమ్మిది నెలల్లో నివేదిక అందగానే రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు.  రాష్ట్ర రాజధాని విషయంలో వైఎస్ జగన్ తీరు సరిగా లేదని ఆరోపించారు. సభలో కలెక్టర్ కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement