వేములవాడ రాజన్న ఆలయ తలనీలాల కాంట్రాక్టర్ ఆ పరమశివుడికే శఠగోపం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆలయానికి బకాయిపడ్డ రూ.3.9 కోట్ల సొమ్మును చెల్లించేందుకు మొండికేస్తున్నాడు. ఇప్పటికే వాయిదా గడువు దాటిపోయినా స్పందించడం లేదు. మరో నెలరోజుల్లో ఒప్పంద గడువు సైతం ముగియనుంది. ఈలోగా కాట్రాక్టర్ నుంచి డబ్బు రాబట్టడం అధికారులకు సవాలుగా మారింది.
వేములవాడ, న్యూస్‌లైన్: రాజన్నకు భక్తులు సమర్పించుకునే తలనీలాల వెంట్రుకలను సేకరించుకునేందు కు దేవాదాయశాఖ అనుమతితో ప్రతి సంవత్సరం అధికారులు టెండర్లు నిర్వహిస్తారు. 2012 ఫిబ్రవరిలో నిర్వహించిన టెండర్లలో 2012 నుంచి 2014 వరకు రెండేళ్ల పాటు తల నీలాలు సేకరించుకునేందుకు రూ.12.10 కోట్లకు వెంకటేశ్వర్‌రావు అనే వ్యక్తి కాంట్రాక్టు దక్కించుకున్నారు. తొలుత వాయిదాల ప్రకా రం నిర్ణయించిన మొత్తాన్ని చెల్లిస్తూ వచ్చారు. గత సంవత్సరం నుంచి వాయిదాలు తప్పించడంతో అధికారులు ఆయనపై ఒత్తిడి తెచ్చా రు. దీంతో కొంత గాడిలోపడ్డ కాంట్రాక్టర్ వా యిదాలు పొడగించమని కోరారు. అధికారు లు అనుమతి ఇచ్చినప్పటికీ ఆయన చెల్లింపు లు చేయలేకపోయారు. దీంతో పూచికత్తుకిం ద ఇచ్చిన చెక్కును ఆలయ అధికారులు బ్యాంకులో జమచేశారు. ఖాతాలో డబ్బులేకపోవడంతో చెక్కు బౌన్సయింది. మరింత ఒ త్తిడి చేసిన అధికారులు కోర్టు నోటీసులు పం పారు. ఓ మెట్టు దిగివచ్చిన కాంట్రాక్టర్ కొంత మొత్తాన్ని చెల్లించి మళ్లీ వాయిదా కోరాడు. అందుకు అధికారులు నిరాకరించారు.
బ్లాక్ లిస్టులో పెట్టేందుకు సిఫార్సు
కాంట్రాక్టర్ తీరుతో విసిగిపోయిన ఆలయ అధికారులు సదరు కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాలని కోరుతూ దేవాదాయశాఖ కమిషనర్‌కు నివేదించారు. తనకున్న రాజకీయ పలుకుబడితో దేవాదాయ కమిషనర్‌ను కలిసిన కాంట్రాక్టర్ తనకు అనుకూలంగా అంతా చక్కబెట్టుకున్నారు. బ్లాక్‌లిస్టులో పెట్టేందుకు సిఫార్సు చేస్తూ నివేదించిన అధికారులకు దేవాదాయశాఖ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు దిమ్మదిరిగేలా చేశాయి. కల్యాణకట్టలో ఉన్న నాయీబ్రాహ్మణులకు తోడుగా వందమంది నాయిబ్రాహ్మణులను అదనంగా నియమించాలని కమిషనర్ ఆదేశించారు. దీంతో చేసేదిలేక మళ్లీ కాంట్రాక్టర్‌పైనే ఒత్తిడి తెచ్చేందుకు అధికారులు సిద్ధపడ్డారు. తలనీలాలను భద్రపరిచే స్టోర్‌రూంను సీజ్‌చేశారు. బకాయి మొత్తం చెల్లించాకే అందులో ఉన్న వెంట్రుకలు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. దీంతో దిగివచ్చిన కాంట్రాక్టర్ ఇటీవలే రూ.16 లక్షలు చెల్లించారు.
వెంట్రుకలు సొమ్ము రాలుస్తాయా?
ఒకవేళ కాంట్రాక్టర్ డబ్బు చెల్లించకుంటే.. సీజ్ చేసిన స్టోర్‌రూంలోని వెంట్రుకలు రికవరీ కావల్సిన సొమ్ముతో సరితూగుతాయా.. లేదా అన్నది ప్రశ్న. ఆ వెంట్రుకలను ఆలయ అధికారులు వేలం వేద్దామన్నా వాటిని కొనేవారు ఇక్కడ అందుబాటులో లేరు. దీంతో వెంట్రుకలను వేలం వేసేవరకు వేచిచూసి బినామీ పేరిట ప్రస్తుత కాంట్రాక్టరే తక్కువ రేటుకు కొనుగోలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని స్థానిక నాయీబ్రాహ్మణులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. బకాయిలు కట్టకుండా దాటవేస్తున్న కాంట్రాక్టర్‌కు అనుకూలంగా కమిషనర్ వత్తాసు పలకడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లోగుట్టు ఏమిటో.. రాజన్నకే తెలియాలి!
లోగుట్టు రాజన్నకెరుక!
Published Mon, Mar 3 2014 4:54 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 AM
Advertisement
Advertisement