ప్రొద్దుటూరు క్రైం:
పట్టణంలోని కరిష్మా జ్యువెలర్స్ యజమాని యాకూబ్ కిడ్నాప్‌కు గురుయ్యాడు. అతన్ని వీఎన్‌పల్లి మండలానికి చెందిన ఓ ఆయిల్ మిల్ యజమాని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెల 12న హైదరాబాద్‌లోని కొండాపురం ప్రాంతంలో ఉన్న శ్రీరాంనగర్‌లో ఆయిల్‌మిల్ యజమానితోపాటు అతని అనుచరులు యాకూబ్‌ను కిడ్నాప్‌ను చేశారు. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పట్టణంలోని బంగారు వ్యాపారుల్లో చర్చనీయాంశమైంది.
స్థానిక మెయిన్‌బజార్‌లో ఉన్న కరిష్మా జ్యువెలర్స్ యజమానులు యాకూబ్ సోదరులు నెల రోజుల క్రితం సుమారు రూ.7.30 కోట్లకు ఐపీ పెట్టిన విషయం తెలిసిందే. పట్టణంతో పాటు చుట్టు పక్కల సుమారు 35 మంది దగ్గర డబ్బులు తీసుకొని వీరు బాకీ అయ్యూరు. కోర్టులో ఐపీ పిటిషన్ దాఖలు చేసిన వీరు కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. అయితే వీఎన్‌పల్లి మండలంలోని ఓ ఆయిల్ మిల్ యజమానికి యాకూబ్ సుమారు రూ. 50 లక్షలు దాకా బాకీ ఉన్నాడు.
యాకూబ్ సోదరులు హైదరాబాద్‌లో ఉన్నారని తెలుసుకున్న ఆయిల్‌మిల్ యజమాని తన అనుమాయులతో కిడ్నాప్ చేయించడానికి గత వారం రోజుల నుంచి ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఈ క్రమంలో అతను గత ఆదివారం హైదరాబాద్‌లోని శ్రీరాంనగర్ ప్రాంతంలో తిరుగుతుండగా కిడ్నాప్ చేశారు. యాకూబ్‌ను కిడ్నాపర్లు బెంగుళూరుకు తరలించినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో కూడా ఆయిల్ మిల్ యజమాని యాకూబ్‌పై దాడికి యత్నించాడు.
ప్రొద్దుటూరులో
హైదరాబాద్ పోలీసుల దర్యాప్తు
యాకూబ్ కిడ్నాప్ అయ్యాడని విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని శ్రీరాంనగర్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయిల్ మిల్ యజమానికి సంబంధించిన సెల్‌ఫోన్ మూడు రోజుల నుంచి స్విచ్చాఫ్ చేసి ఉంది. అంతేగాాక అతని బంధువులతో పాటు మిల్‌లో పని చేసే గుమాస్తాల ఫోన్‌లు కూడా పని చేయలేదు. మూడు రోజుల నుంచి మిల్లు కూడా మూసి ఉండటంతో అతనే కిడ్నాప్ చేసి ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
వారి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. సంబంధిత స్టేషన్ ఎస్‌ఐతో పాటు సిబ్బంది కిడ్నాప్ కేసును దర్యాప్తు చేయడానికి మంగళవారం ప్రొద్దుటూరుకు వచ్చారు. వీఎన్‌పల్లిలోని కిడ్నాపర్ బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. అంతేగాక వీఎన్‌పల్లి ఎస్‌ఐని కూడా కలసి వివరాలు సేకరించారు. హైదరాబాద్ పోలీసులు స్థానిక డీఎస్పీతో పాటు వన్‌టౌన్ పోలీసులను కలిశారు.
కిడ్నాప్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వారు ప్రొద్దుటూరు పోలీసులకు వివరించినట్లు తెలిసింది. ఇప్పటికే ఆయిల్‌మిల్ యజమానికి సంబంధించిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. యాకూబ్‌ను కిడ్నాప్ చేసి మూడు రోజులైనా ఇంత వరకూ అతని జాడ తెలియక పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
కరిష్మా జ్యువెలర్స్ యజమాని కిడ్నాప్
Published Wed, Oct 15 2014 2:51 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement