నా రికార్డులు బ్రేక్ చేస్తే రూ.లక్ష నజరానా
శ్రీకాకుళంలో రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభించిన కరణం మల్లీశ్వరి
శ్రీకాకుళం న్యూకాలనీ: ఒలింపిక్స్‌లో తాను నెలకొల్పిన రికార్డులను బ్రేక్ చేసిన వారికి రికార్డుకి రూ.లక్ష చొప్పున బహుమతిగా ఇస్తానని ఒలింపిక్ కాంస్య పతక గ్రహీత, శాప్ బోర్డ్ సభ్యురాలు కరణం మల్లీశ్వరి ప్రకటించారు. శ్రీకాకుళంలోని డా.అంబేడ్కర్ ఆడిటోరియంలో రెండు రోజుల ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి అండర్–14, అండర్–17 బాలబాలికల వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ.. శ్రీకాకుళంలో తన పేరిట త్వరలో వెయిట్ లిఫ్టింగ్ అకాడమీని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మిగిలిన క్రీడా అకాడమీలతో పోలిస్తే వెయిట్ లిఫ్టింగ్ ఖర్చుతో కూడుకున్నదని అన్నారు. కాగా, పోటీల్లో సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న చిత్తూరు జిల్లా మినహా అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నుంచి కనీస ప్రాతినిధ్యం లేకపోవడం చర్చనీయాంశమైంది.