తాండూరు, న్యూస్‌లైన్: ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు మీదుగా మత్తు పదార్థాలు, కర్ణాటక మద్యం రవాణా జోరుగా సాగుతోంది.సరిహద్దులో నిఘాను పటిష్టం చేస్తామని తాండూరు పర్యటనలో చెప్పే ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఆచరణలో విఫలమవుతున్నారు.
ఏం జరుగుతోంది..?
సరిహద్దు ప్రాంతం మీదుగా కర్ణాటక మద్యం(నాన్ పెయిడ్ డ్యూటీ) బాటిళ్లు, నిషేధిత మత్తు పదార్థాలైన క్లోరల్ హైడ్రే ట్ (సీహెచ్), డైజోఫాం, అల్ఫాజోలం తదితరాల అక్రమ రవాణాను నిరోధించేందుకు దాదాపు ఐదేళ్ల క్రితం బోర్డర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీ(బీఎంపీపీ)ని అధికారులు ఏర్పా టు చేశారు. దానిని ఇప్పుడు అధికారులు ఎత్తేశారు. ఈ పా ర్టీ ఉన్నప్పుడే తనిఖీలు అంతంత మాత్రం ఉండేవి. ఇప్పుడు మొత్తానికే ఎత్తివేయడంతో ఇంకేముంది స్మగ్లర్లకు వరంగా మారింది. బోర్డర్ మొబైల్ పార్టీకి నేతృత్వం వహించే ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు మహేశ్వరం సమీపంలోని మద్యం బాటిళ్లు సరఫరా చేసే డిపోలో బాధ్యతలు అప్పగించారని తెలిసింది. దీంతో కర్ణాటక కేంద్రంగా సాగుతున్న నిషేధిత మత్తు పదార్ధాల రవాణాకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. మొబైల్ పార్టీతోపాటు కర్ణాటక-ఆంధ్రా సరిహద్దులో చెక్‌పోస్ట్ లేకపోవడంతో సరిహద్దులోని తాండూరు మండల పరిధిలోని కోత్లాపూర్, బషీరాబాద్ మండలం మైల్వార్, పెద్దేముల్ మండలం తట్టేపల్లి, బంట్వారం మండలం బోపునారం సమీపంలోని కుంచారం మార్గాల మీదుగా క్లోరల్ హైడ్రేట్(సీహెచ్), డైజోఫాం, అల్ఫాజోలం తదితర నిషేధిత మత్తుపదార్ధాల రవాణా సాగుతోంది.
అధికారులు ఏం చేశారు..?
అధికారులు గత ఏడాది ఆగస్టులోతాండూరు మండలం చెన్‌గేష్‌పూర్ అనుబంధ గ్రామమైన కోనాపూర్‌లో 34.5కిలోల సీహెచ్, గత డిసెం బర్ మొదటి వారంలో పెద్దేముల్ మండలం రచ్చకట్ట తండాలో కర్ణాటక మద్యం (నాన్ పెయిడ్ డ్యూటీ) బాటిళ్లు, తాండూరు పట్టణంలోని శ్రీకాళికాదేవి దేవాలయం సమీపంలో నాలుగున్నర కిలోల డైజోఫాం, పట్టణంలోని శాంతప్ప కాలనీలో మరో 3 కిలోల డైజోఫాం, 2 కిలోల సీహెచ్ స్వాధీనం చేసుకున్నారు.
ఎవరు లాభపడుతున్నారు..?
సరిహద్దులో నిఘా పూర్తిగా లోపించడంతో తాండూరుకు చెందిన కొందరు బడా వ్యక్తుల కనుసన్నల్లో ఈ దందా ‘మూడు పువ్వులు ఆరుకాయలు’ అన్న చందంగా సాగుతోంది. రూ. లక్షల్లో మత్తుపదార్ధాల వ్యాపారం సాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. మత్తు కోసం కల్లులో నిషేధిత మత్తుపదార్ధాలను కలుపుతూ కల్తీ చేస్తూ జనం ప్రాణాలతో వ్యాపారులు ఆడుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. బోర్డర్ మొబైల్ పెట్రోలింగ్ లేదనే ధైర్యంతో స్మగర్లు రెచ్చిపోతున్నారు. పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు హడావిడి చేసి, పాత కేసులతో సంబంధం ఉన్న వారిపై కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుంటే ఈ దందాకు బ్రేక్‌కు పడే అవకాశం ఉందని జనం అభిప్రాయపడుతున్నారు.
తాండూరుకు కర్ణాటక ‘మత్తు’
Published Fri, Jan 17 2014 12:24 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement