Transportation of alcohol
-
ఆబ్కారీ చెక్‌పోస్టుల ఆధునీకరణ
మరింత పకడ్బందీగా తనిఖీలు సరిహద్దు రాష్ట్రాల నుంచి యథేచ్ఛగా మద్యం రవాణా సాక్షి, హైదరాబాద్: నాటుసారా అక్రమ రవాణాను నియంత్రించడంలో భాగంగా చెక్‌పోస్టులను ఆధునికీకరించాలని ఆబ్కా రీ శాఖ నిర్ణయించింది. గోవా, మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలకు అక్రమంగా సారా తరలివస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ సూచనల మేరకు చెక్‌పోస్టు వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఆబ్కారీ డిప్యూటీ కమిషనర్లకు కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్ ఆదేశాలు జారీ చేశారు. ఆధునికీకరణకు అవసరమయ్యే నిధులు, ఇతర మౌలిక వసతుల కోసం సమగ్ర ప్రతిపాదనలు పంపాలని పేర్కొన్నారు. 4 ఇంటిగ్రేటెడ్ సహా 24 చెక్‌పోస్టులు రాష్ట్రానికి అక్రమంగా ఎన్డీపీఎల్ దిగుమతికి ఆస్కారమున్న ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ప్రధాన రహదారుల వద్ద చెక్‌పోస్టులున్నాయి. అయితే చెట్టు నీడ, దాబా, వాణిజ్యపన్నుల శాఖ చెక్‌పోస్టులే ఆబ్కారీ సిబ్బందికి ఆవాసాలు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం దిగుమతిని ఈ చెక్‌పోస్టులు అడ్డుకోలేకపోతున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ మినహా 8 జిల్లాలను గుడుంబా రహిత జిల్లాలుగా ప్రకటించినా, సింగరేణి కోల్‌బెల్ట్ ఏరియా, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్‌లలో గుట్టుచప్పుడు కాకుండా గుడుంబా ప్రవహిస్తోందని ఎన్ఫోర్స్మెంట్ విభాగం గుర్తించింది. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 24 అంతర్రాష్ట్ర, అంతర్జిల్లా చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని ఆబ్కారీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిల్లో నాలుగు ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులను నిర్మించాలని అకున్ సబర్వాల్ సూచించారు. ఈ మేరకు బుధవారం కమిషనర్ చంద్రవదన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, యుద్ధప్రాతిపదికన చర్యలకు ఆదేశించారు. జిల్లాల నుంచి వచ్చిన డిమాండ్‌కు అనుగుణంగా వారంలోగా సర్కార్‌కు చెక్‌పోస్టుల ఆధునికీకరణ ఫైలును పంపించనున్నారు. నిధులు సమకూర్చేందుకు సర్కార్ ఆసక్తి చూపని పక్షంలో టీఎస్‌బీసీఎల్ నిధుల్లోంచి సుమారు రూ.100 కోట్ల వరకు వెచ్చించాలని నిర్ణయించారు. సిబ్బందికి అవసరమైన మౌలిక వసతులు, కెమెరాలు, కంప్యూటర్లు, గోడౌన్లను సమకూర్చే అవకాశముంది. -
మద్యం రవాణాపై డేగ కన్ను
బిచ్కుంద, న్యూస్‌లైన్ : రానున్న ఎన్నికల నేపథ్యంలో మ ద్యం అక్రమ రవాణాపై పొలీసులు దృషి సారించారు. మ హారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల వెంట జుక్కల్ నియోజకవర్గంలో మద్యం ప్రవేశించకుండా గట్టి నిఘా పెట్టారు. ఏ మార్గం ద్వారానైనా మద్యం రవాణా లేకుండా పొలీసులు డేగ కన్ను ఉంచారు. ఎన్నికల్లో మద్యం సరఫరాను అరికట్టేందుకు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నిర్ధేశిత మద్య దుకాణాలకే సరఫరా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కోరినంత మద్యం అందడం లే దు. మద్యం కొరత ఏర్పడింది. అయినా కొందరు అడ్డదారుల్లో మద్యం రవాణాకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యం గా చెక్‌పోస్టుల దగ్గర ఎవరికి అనుమానం రాకుండా కాలినడకతో పొలాల నుంచి వెళ్లి చెక్‌పోస్టు దాటిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి మద్యం దిగుమతికి ఎత్తులు వేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో మండల కేంద్రాల్లో ఉన్న వైన్స్‌ల్లో నిర్దేశిత స్టాక్ ఉంది. దీంతో ఎన్నికల ముందు కోరినంత మద్యం అందడం కష్టంగా మారింది. ఇప్పటి నుంచే వ్యాపారులు మద్యం సేకరించి రహస్య ప్రదేశాల్లో ఉంచుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చెక్‌పోస్టుల ఏర్పాటు.. మద్యం అక్రమ రవాణా ఎత్తులను చిత్తు చేసేందుకు పొలీ స్ అధికారులు సన్నద్ధమయ్యారు. ఏ మార్గం ద్వారానైనా మద్యం రవాణాను నిరోధించేందుకు నిఘాను తీవ్రతరం చేశారు. ఏడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా సరిహద్దు కల్హెర్ మండలం మాసన్పల్లి గేటు వద్ద, కర్ణాటక సరిహద్దులో జుక్కల్ మండలం గుల్లా, చండేగాం, సోమూర్, పిట్లం మండలం గోద్మెగాం, తిమ్మనగర్, మహారాష్ట్ర సరిహద్దు ఎస్ఎన్ఏ రోడ్డు మద్నూర్ మండలం సలాబత్పూర్ వద్ద పొలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అక్రమ మద్యాన్ని అడ్డుకుంటాం.. ఎన్నికల సందర్భంగా అక్రమంగా మద్యం రవాణా కాకుండా నిఘా కట్టుదిట్టం చేశాం. నిఘాను పెంచాం. అక్రమ వ్యాపారుల మార్గాలను నిరోధించి తీరుతాం. నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులో అక్కడక్కడ 7 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. అన్నిరకాలుగా ముమ్మర తనిఖీలు చేస్తున్నాం. రాత్రివేళ్లల్లో ప్రత్యేక దృష్టి పెట్టాం. - వెంకటేశం, జుక్కల్ నియోజకవర్గ ఇన్చార్జి సీఐ, బిచ్కుంద. -
తాండూరుకు కర్ణాటక ‘మత్తు’
తాండూరు, న్యూస్‌లైన్: ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు మీదుగా మత్తు పదార్థాలు, కర్ణాటక మద్యం రవాణా జోరుగా సాగుతోంది.సరిహద్దులో నిఘాను పటిష్టం చేస్తామని తాండూరు పర్యటనలో చెప్పే ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఆచరణలో విఫలమవుతున్నారు. ఏం జరుగుతోంది..? సరిహద్దు ప్రాంతం మీదుగా కర్ణాటక మద్యం(నాన్ పెయిడ్ డ్యూటీ) బాటిళ్లు, నిషేధిత మత్తు పదార్థాలైన క్లోరల్ హైడ్రే ట్ (సీహెచ్), డైజోఫాం, అల్ఫాజోలం తదితరాల అక్రమ రవాణాను నిరోధించేందుకు దాదాపు ఐదేళ్ల క్రితం బోర్డర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీ(బీఎంపీపీ)ని అధికారులు ఏర్పా టు చేశారు. దానిని ఇప్పుడు అధికారులు ఎత్తేశారు. ఈ పా ర్టీ ఉన్నప్పుడే తనిఖీలు అంతంత మాత్రం ఉండేవి. ఇప్పుడు మొత్తానికే ఎత్తివేయడంతో ఇంకేముంది స్మగ్లర్లకు వరంగా మారింది. బోర్డర్ మొబైల్ పార్టీకి నేతృత్వం వహించే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్కు మహేశ్వరం సమీపంలోని మద్యం బాటిళ్లు సరఫరా చేసే డిపోలో బాధ్యతలు అప్పగించారని తెలిసింది. దీంతో కర్ణాటక కేంద్రంగా సాగుతున్న నిషేధిత మత్తు పదార్ధాల రవాణాకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. మొబైల్ పార్టీతోపాటు కర్ణాటక-ఆంధ్రా సరిహద్దులో చెక్‌పోస్ట్ లేకపోవడంతో సరిహద్దులోని తాండూరు మండల పరిధిలోని కోత్లాపూర్, బషీరాబాద్ మండలం మైల్వార్, పెద్దేముల్ మండలం తట్టేపల్లి, బంట్వారం మండలం బోపునారం సమీపంలోని కుంచారం మార్గాల మీదుగా క్లోరల్ హైడ్రేట్(సీహెచ్), డైజోఫాం, అల్ఫాజోలం తదితర నిషేధిత మత్తుపదార్ధాల రవాణా సాగుతోంది. అధికారులు ఏం చేశారు..? అధికారులు గత ఏడాది ఆగస్టులోతాండూరు మండలం చెన్‌గేష్‌పూర్ అనుబంధ గ్రామమైన కోనాపూర్‌లో 34.5కిలోల సీహెచ్, గత డిసెం బర్ మొదటి వారంలో పెద్దేముల్ మండలం రచ్చకట్ట తండాలో కర్ణాటక మద్యం (నాన్ పెయిడ్ డ్యూటీ) బాటిళ్లు, తాండూరు పట్టణంలోని శ్రీకాళికాదేవి దేవాలయం సమీపంలో నాలుగున్నర కిలోల డైజోఫాం, పట్టణంలోని శాంతప్ప కాలనీలో మరో 3 కిలోల డైజోఫాం, 2 కిలోల సీహెచ్ స్వాధీనం చేసుకున్నారు. ఎవరు లాభపడుతున్నారు..? సరిహద్దులో నిఘా పూర్తిగా లోపించడంతో తాండూరుకు చెందిన కొందరు బడా వ్యక్తుల కనుసన్నల్లో ఈ దందా ‘మూడు పువ్వులు ఆరుకాయలు’ అన్న చందంగా సాగుతోంది. రూ. లక్షల్లో మత్తుపదార్ధాల వ్యాపారం సాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. మత్తు కోసం కల్లులో నిషేధిత మత్తుపదార్ధాలను కలుపుతూ కల్తీ చేస్తూ జనం ప్రాణాలతో వ్యాపారులు ఆడుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. బోర్డర్ మొబైల్ పెట్రోలింగ్ లేదనే ధైర్యంతో స్మగర్లు రెచ్చిపోతున్నారు. పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు హడావిడి చేసి, పాత కేసులతో సంబంధం ఉన్న వారిపై కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుంటే ఈ దందాకు బ్రేక్‌కు పడే అవకాశం ఉందని జనం అభిప్రాయపడుతున్నారు.