గద్వాల, న్యూస్‌లైన్: కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు ఆయకట్టుకు రబీలో నీటిని విడుదల చేస్తేనే జూరాల ఆయకట్టు సాగవుతుంది. పొరుగురాష్ట్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో జూరాలలో రబీ పంటలకు నీటి విడుదలపై సందిగ్ధం నెలకొంది. గత రెండేళ్లుగా ఎదురవుతున్న నీటి కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఏం చేద్దామనే మీమాంసలో ఆయకట్టు రైతులు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కర్ణాటక ప్ర భుత్వ నిర్ణయం కోసం జూరాల అధికారులు ఎదురుచూస్తున్నారు.
గతేడాది నారాయణపూ ర్ ఆయకట్టులోని రబీ పంటలకు నీటిని విడుదల చేయకుండా తాగునీటి అవసరాల కోసం కర్ణాటక అధికారులు నిలిపేశారు. ఈ కారణంగా జిల్లాలోని జూరాల ప్రాజెక్టు పరిధిలో పంట పూర్తయ్యే దశలో నీళ్లివ్వలేకపోవడంతో రైతులు పెద్దఎత్తున నష్టపోయారు. చివరి సమయంలో కర్ణాటక అర్ధాంతరంగా నీటి విడుదలను నిలిపేయడంతో పంటలకు నీళ్లందని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉన్న నీళ్లను పంటలు ఎండిపోకుండా అందించేందుకు అధికారులు ఇబ్బందులు పడ్డారు. గత రెండు రబీ సీజన్లలో కర్ణాటక తీరు కారణంగా జూరాల రైతులు నష్టపోయిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈనెలాఖరులోగా నారాయణపూర్ ప్రాజెక్టు నీటివిడుదలపై కర్ణాటక అధికారులు స్పష్టమైన నిర్ణయం తీసుకుంటేనే జూరాల పరిధిలోని రబీకి నీటివిడుదలపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని ఎదురుచూస్తున్నారు.
ఇదీ జూరాల పరిస్థితి
జూరాల ఆయకట్టు పరిధిలో కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా 1.70లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. గత రబీ సీజన్‌లో 57వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఐఏబీలో తీర్మానించారు. ఇది నమ్మిన రైతులు పంటలను సాగుచేసుకుని..ఆ తరువాత నీళ్లు రాకపోవడంతో నష్టపోవాల్సి వచ్చింది. పై నుంచి నీళ్లు రాకపోతే మళ్లీ నష్టపోతామన్న ఉద్దేశంతో రబీలో ఆరుతడి పంట వేరుశనగను సాగుచేయాలని జూరాల అధికారులు రైతులకు సూచిస్తున్నారు. వచ్చే నెలలో వేరుశనగను విత్తుకునేందుకు ఇప్పటినుంచే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉన్నందున జూరాల అధికారులను కలిసి నీటి విడుదల ఉంటుందా? లేదా? అనే విషయం చెప్పాలని రైతులు కోరారు.
ఎస్‌ఈ ఏమన్నారంటే..
రబీకి నీటివిడుదల విషయమై జూరాల ఎస్‌ఈ ఖగేందర్‌ను వివరణ కోరగా.. నారాయణపూర్ ప్రాజెక్టు పరిధిలో రబీ సీజన్ ఉంటేనే అక్కడికి ఆయకట్టుకు విడుదల చేసిన నీళ్లు రీజనరేట్ అయి జూరాలకు వస్తాయన్నారు. అలా నదిలో ప్రవాహం మార్చి వరకు ఉంటుందని, కావునా రబీ సీజన్‌కు నీళ్లిచ్చేందుకు ఇబ్బంది ఉండదని తెలిపారు. ఈ దష్ట్యా నారాయణపూర్ నీటి విడుదలపై కర్ణాటక తీసుకునే నిర్ణయంపై జూరాల రబీ సీజన్ ఆయకట్టు ఆధారపడి ఉంటుందని ఎస్‌ఈ ఖగేందర్ తెలిపారు. కావునా రైతులు తుది నిర్ణయం వెలువడే వరకు రబీ పంటల సాగు విషయంలో వేచి ఉండాలని ఎస్‌ఈ సూచించారు.
కర్ణాటక కరుణిస్తేనే..!
Published Sun, Nov 24 2013 3:46 AM | Last Updated on Tue, Oct 30 2018 5:50 PM
Advertisement