narayanapur project
-
మళ్లీ వరదొచ్చింది!
సాక్షి, గద్వాల : మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి మళ్లీ వరద పెరగడం ప్రారంభమైంది. మంగళవారం నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 55,160 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కృష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులను దాటి జూలై 29వ తేదీన కృష్ణానది పరవళ్లు రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు వచ్చాయి. నాటి నుంచి రోజు రోజుకు వరద పెరిగింది. 2009లో కృష్ణానదికి వచ్చిన అతి భారీ స్థాయి వరదను తలపించేలా 8.67 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చాయి. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండడంతో పాటు, మిగులు విజయవాడ బ్యారేజిని దాటి సముద్రంలోకి వెళ్లాయి. అంతస్థాయిలో వచ్చిన వరద రోజురోజుకు శాంతిస్తు ఆగస్టు 23వ తేదీ నాటికి 22 వేల క్యూసెక్కుల దిగువకు వెళ్లి వారం రోజుల క్రితం కేవలం 2వేల క్యూసెక్కుల అతి తక్కువ స్థాయికి చేరింది. జూరాల, లోయర్ ప్రాజెక్టులలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. కృష్ణానది ఎగువ రాష్ట్రాలలో వర్షాలు కురుస్తుండడంతో మంగళవారం మధ్యాహ్నం ఆల్మట్టి నుంచి 52 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 55,160 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా జూరాల ప్రాజెక్టుకు బుధవారం సాయంత్రానికి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టుల్లో నీటినిల్వలు ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 128.19 టీఎంసీల నీటినిల్వ ఉంది. దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 37.59 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తూ ఎగువ నుంచి వచ్చిన వరదను దిగువన ఉన్న జూరాల జలాశయానికి విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటినిల్వ 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.42 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి 11 వేల క్యూసెక్కుల వరద వస్తుంది. ఎత్తిపోతల పథకాలకు పంపింగ్ జూరాల జలాశయంపై ఆధారపడిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంకు 1,500 క్యూసెక్కులను పంపింగ్ చేస్తున్నారు. అదే విధంగా భీమా ఎత్తిపోతల స్టేజి–1 ద్వారా 1,300 క్యూసెక్కులు, స్టేజి–2 ద్వారా 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 630 క్యూసెక్కులను పంపింగ్ చేస్తున్నారు. జూరాల కుడి ప్రధాన కాల్వ ద్వారా 725 క్యూసెక్కులు, ఎడమ ప్రధాన కాల్వ ద్వారా 1,000 క్యూసెక్కులు, సమాంతర కాల్వ ద్వారా 650 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జూరాల జలవిద్యుత్ కేంద్రంలోని ఒక యూనిట్లో విద్యుదుత్పత్తి కొనసాగిస్తూ 7,666 క్యూసెక్కులను వినియోగిస్తు దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. -
తెలంగాణలోకి ప్రవేశించిన కృష్ణా జలాలు
సాక్షి, మహబూబ్‌నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కర్ణాటకలోని నారాయణపుర్ జలశయం నుంచి విడుదల చేసిన కృష్ణా జలాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. సోమవారం మధ్యాహ్నం నారాయణపేట జిల్లాలోకి చేరుకున్నాయి. మండు వేసవిలో తాగు నీటికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృష్ణానది జలాలు తరలి వస్తున్నాయి. పాలమూరు ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను అధిగమించడానికి కేసీఆర్ కర్ణాటక ముఖ్యమంత్రితో నడిపిన దౌత్యం కారణంగా మూడు రోజుల క్రితం నారాయణపుర్ నుంచి జూరాలకు నీటిని విడుదల ప్రారంభించిన విషయం తెలిసిందే. మంగళవారం నాటికి కృష్ణా జలాలు జూరాల జలశయానికి చేరనున్నాయి. నారాయణపేట ప్రాజెక్టులో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి మొదట నారాయణపురకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం నారాయణపుర డ్యాం నుంచి జూరాలకు నీటి విడుదల జరుగుతోంది. మొదట 2,110 క్యూసెక్కులతో నీటి విడుదల ప్రారంభమైంది. మరుసటి రోజు 8 వేల క్యూసెక్కులకు పెంచారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాటికి కృష్ణా జలాలు జూరాల జలశయానికి చేరతాయి అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే 2.5 టీఎంసీల నీటి విడుదల పూర్తయిట్లు ప్రాజెక్టు ఇంజనీరు వెల్లడించారు. -
శ్రీశైలానికి తగ్గిన వరద ప్రవాహం
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు ఆగిపోవడంతో పాటు వస్తున్న ప్రవాహాన్ని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో నిల్వ చేస్తుండటంతో శ్రీశైలంలోకి వచ్చే వరద ప్రవాహం తగ్గిపోయింది. సోమవారం ఉదయం శ్రీశైలం జలాశయంలోకి 55,431 క్యూసెక్కుల ప్రవాహం రాగా అది సాయంత్రానికి 37,196 క్యూసెక్కులకు తగ్గింది. శ్రీశైలం జలాశయం నుంచి కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు 11 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రసుత్తం శ్రీశైలం జలాశయంలో 157.88 టీఎంసీల నీరు నిల్వ ఉన్నాయి. తుంగభద్రలోనూ వరద ప్రవాహం తగ్గుతోంది. తుంగభద్ర జలాశయంలోకి 33,375 క్యూసెక్కులు చేరుతుండగా 26,475 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 94.61 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మంగళవారం నుంచి తుంగభద్ర నదిలో వరద మరింత తగ్గనుండటంతో శ్రీశైలంలోకి వచ్చే వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరనుంది. -
కృష్ణానదికి పెరిగిన వరద ఉధృతి
శ్రీశైలానికి భారీగా వరద నీరు తుంగభద్ర డ్యాంలో పది క్రస్టుగేట్ల ఎత్తివేత బెంగళూరు/ధరూరు/శ్రీశైలం/విజయపురిసౌత్/హోస్పేట: మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరద ఉధృతి పెరిగింది. దీంతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు దాదాపుగా నిండిపోవడంతో దిగువకు నీటిని వదులుతున్నారు. ఫలితంగా జూరాలకు, అక్కడినుంచి శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం ఆల్మట్టిలోకి ఇన్‌ఫ్లో లక్షా మూడు వేల 406 క్యూసెక్కులుండగా.. లక్షా 20 వేల 849 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అదే సమయంలో నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 20 క్రస్టుగేట్లను ఎత్తి లక్షా 20 వేల 849 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద తాకిడి మరింత పెరిగింది. ప్రాజెక్టుకు లక్షా 20 వేల 329 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 22 క్రస్టుగేట్లు ఎత్తి లక్షా 24 వేల 759 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ఇక్కడి జలవిద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్లలో పూర్తిస్థాయిలో 234 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతున్నట్లు జెన్కో అధికారులు తెలిపారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయంలో 59.5145 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయ నీటిమట్టం 838.40 అడుగులకు చేరుకుంది. నీటిమట్టం శనివారం ఉదయానికి 845 అడుగులకు చేరే అవకాశముంది. వరదనీటి రాక ఇదేరీతిలో కొనసాగితే మరో నాలుగు రోజుల్లో శ్రీశైలం నీటిమట్టం పూర్తిస్థాయిలో 890 అడుగుల గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు. అనంతరం ఇక్కడినుంచీ సాగర్ జలాశయానికి నీటిని విడుదల చేసే అవకాశముంది. ప్రస్తుతం శ్రీశైలంలో విద్యుదుత్పాదన అనంతరం 14,194 క్యూసెక్కుల నీటిని సాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు. తుంగభద్ర గేట్ల ఎత్తివేత: మరోవైపు తుంగభద్ర డ్యాం నిండడంతో శుక్రవారం పూజలు నిర్వహిం చిన అధికారులు పది గేట్లు పైకి ఎత్తి దిగువకు 22 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. -
ప్రారంభమై నిలిచిపోయిన విద్యుదుత్పత్తి
ధరూరు, న్యూస్‌లైన్: జెన్కో జలవిద్యుత్ కేంద్రంలో ఒక యూనిట్లో విద్యుదుత్పత్తి ప్రారంభమై నిలిచిపోయినట్లు జెన్కో అధికారులు తెలిపారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి 1835 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని, మంగళవారం సాయంత్రం 3 గంటలకు ఒక యూనిట్ విద్యుదుత్పత్తి నిమిత్తం ఆరువేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు పీజేపీ అధికారి కృష్ణయ్య తెలిపారు. విద్యుదుత్పత్తి ప్రారంభానికి ముందు జూరాల ప్రాజెక్టు నీటిమట్టం 318.50 మీటర్లుగా ఉండగా, రాత్రి 7 గంటల వరకు 318.45 మీటర్లకు తగ్గడంతో విద్యుదుత్పత్తిని నిలిపి వేశామని చెప్పారు. ఆయకట్టు రైతులకు కుడి, ఎడమ కాల్వల ద్వారా 850 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు నీటి మట్టం 491.246 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టుకు 6 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా ఔట్‌ఫ్లో లేవన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు నీటి మట్టం 517.200 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టుకు ఎలాంటి ఇన్‌ఫ్లో లేవని, విద్యుదుత్పత్తి ద్వారా 6వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. -
కర్ణాటక కరుణిస్తేనే..!
గద్వాల, న్యూస్‌లైన్: కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు ఆయకట్టుకు రబీలో నీటిని విడుదల చేస్తేనే జూరాల ఆయకట్టు సాగవుతుంది. పొరుగురాష్ట్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో జూరాలలో రబీ పంటలకు నీటి విడుదలపై సందిగ్ధం నెలకొంది. గత రెండేళ్లుగా ఎదురవుతున్న నీటి కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఏం చేద్దామనే మీమాంసలో ఆయకట్టు రైతులు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కర్ణాటక ప్ర భుత్వ నిర్ణయం కోసం జూరాల అధికారులు ఎదురుచూస్తున్నారు. గతేడాది నారాయణపూ ర్ ఆయకట్టులోని రబీ పంటలకు నీటిని విడుదల చేయకుండా తాగునీటి అవసరాల కోసం కర్ణాటక అధికారులు నిలిపేశారు. ఈ కారణంగా జిల్లాలోని జూరాల ప్రాజెక్టు పరిధిలో పంట పూర్తయ్యే దశలో నీళ్లివ్వలేకపోవడంతో రైతులు పెద్దఎత్తున నష్టపోయారు. చివరి సమయంలో కర్ణాటక అర్ధాంతరంగా నీటి విడుదలను నిలిపేయడంతో పంటలకు నీళ్లందని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉన్న నీళ్లను పంటలు ఎండిపోకుండా అందించేందుకు అధికారులు ఇబ్బందులు పడ్డారు. గత రెండు రబీ సీజన్లలో కర్ణాటక తీరు కారణంగా జూరాల రైతులు నష్టపోయిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈనెలాఖరులోగా నారాయణపూర్ ప్రాజెక్టు నీటివిడుదలపై కర్ణాటక అధికారులు స్పష్టమైన నిర్ణయం తీసుకుంటేనే జూరాల పరిధిలోని రబీకి నీటివిడుదలపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఇదీ జూరాల పరిస్థితి జూరాల ఆయకట్టు పరిధిలో కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా 1.70లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. గత రబీ సీజన్లో 57వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఐఏబీలో తీర్మానించారు. ఇది నమ్మిన రైతులు పంటలను సాగుచేసుకుని..ఆ తరువాత నీళ్లు రాకపోవడంతో నష్టపోవాల్సి వచ్చింది. పై నుంచి నీళ్లు రాకపోతే మళ్లీ నష్టపోతామన్న ఉద్దేశంతో రబీలో ఆరుతడి పంట వేరుశనగను సాగుచేయాలని జూరాల అధికారులు రైతులకు సూచిస్తున్నారు. వచ్చే నెలలో వేరుశనగను విత్తుకునేందుకు ఇప్పటినుంచే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉన్నందున జూరాల అధికారులను కలిసి నీటి విడుదల ఉంటుందా? లేదా? అనే విషయం చెప్పాలని రైతులు కోరారు. ఎస్ఈ ఏమన్నారంటే.. రబీకి నీటివిడుదల విషయమై జూరాల ఎస్ఈ ఖగేందర్‌ను వివరణ కోరగా.. నారాయణపూర్ ప్రాజెక్టు పరిధిలో రబీ సీజన్ ఉంటేనే అక్కడికి ఆయకట్టుకు విడుదల చేసిన నీళ్లు రీజనరేట్ అయి జూరాలకు వస్తాయన్నారు. అలా నదిలో ప్రవాహం మార్చి వరకు ఉంటుందని, కావునా రబీ సీజన్‌కు నీళ్లిచ్చేందుకు ఇబ్బంది ఉండదని తెలిపారు. ఈ దష్ట్యా నారాయణపూర్ నీటి విడుదలపై కర్ణాటక తీసుకునే నిర్ణయంపై జూరాల రబీ సీజన్ ఆయకట్టు ఆధారపడి ఉంటుందని ఎస్ఈ ఖగేందర్ తెలిపారు. కావునా రైతులు తుది నిర్ణయం వెలువడే వరకు రబీ పంటల సాగు విషయంలో వేచి ఉండాలని ఎస్ఈ సూచించారు.