సాక్షి, మహబూబ్‌నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కర్ణాటకలోని నారాయణపుర్ జలశయం నుంచి విడుదల చేసిన కృష్ణా జలాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. సోమవారం మధ్యాహ్నం నారాయణపేట జిల్లాలోకి చేరుకున్నాయి. మండు వేసవిలో తాగు నీటికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృష్ణానది జలాలు తరలి వస్తున్నాయి. పాలమూరు ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను అధిగమించడానికి కేసీఆర్ కర్ణాటక ముఖ్యమంత్రితో నడిపిన దౌత్యం కారణంగా మూడు రోజుల క్రితం నారాయణపుర్ నుంచి జూరాలకు నీటిని విడుదల ప్రారంభించిన విషయం తెలిసిందే. మంగళవారం నాటికి కృష్ణా జలాలు జూరాల జలశయానికి చేరనున్నాయి.
నారాయణపేట ప్రాజెక్టులో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి మొదట నారాయణపురకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం నారాయణపుర డ్యాం నుంచి జూరాలకు నీటి విడుదల జరుగుతోంది. మొదట 2,110 క్యూసెక్కులతో నీటి విడుదల ప్రారంభమైంది. మరుసటి రోజు 8 వేల క్యూసెక్కులకు పెంచారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాటికి కృష్ణా జలాలు జూరాల జలశయానికి చేరతాయి అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే 2.5 టీఎంసీల నీటి విడుదల పూర్తయిట్లు ప్రాజెక్టు ఇంజనీరు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment