పూర్తి స్థాయి నీటిమట్టంతో జూరాల ప్రాజెక్టు
సాక్షి, గద్వాల : మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి మళ్లీ వరద పెరగడం ప్రారంభమైంది. మంగళవారం నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 55,160 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కృష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులను దాటి జూలై 29వ తేదీన కృష్ణానది పరవళ్లు రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు వచ్చాయి. నాటి నుంచి రోజు రోజుకు వరద పెరిగింది. 2009లో కృష్ణానదికి వచ్చిన అతి భారీ స్థాయి వరదను తలపించేలా 8.67 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చాయి.
దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండడంతో పాటు, మిగులు విజయవాడ బ్యారేజిని దాటి సముద్రంలోకి వెళ్లాయి. అంతస్థాయిలో వచ్చిన వరద రోజురోజుకు శాంతిస్తు ఆగస్టు 23వ తేదీ నాటికి 22 వేల క్యూసెక్కుల దిగువకు వెళ్లి వారం రోజుల క్రితం కేవలం 2వేల క్యూసెక్కుల అతి తక్కువ స్థాయికి చేరింది. జూరాల, లోయర్ ప్రాజెక్టులలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. కృష్ణానది ఎగువ రాష్ట్రాలలో వర్షాలు కురుస్తుండడంతో మంగళవారం మధ్యాహ్నం ఆల్మట్టి నుంచి 52 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 55,160 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా జూరాల ప్రాజెక్టుకు బుధవారం సాయంత్రానికి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రాజెక్టుల్లో నీటినిల్వలు
ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 128.19 టీఎంసీల నీటినిల్వ ఉంది. దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 37.59 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తూ ఎగువ నుంచి వచ్చిన వరదను దిగువన ఉన్న జూరాల జలాశయానికి విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటినిల్వ 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.42 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి 11 వేల క్యూసెక్కుల వరద వస్తుంది.
ఎత్తిపోతల పథకాలకు పంపింగ్
జూరాల జలాశయంపై ఆధారపడిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంకు 1,500 క్యూసెక్కులను పంపింగ్ చేస్తున్నారు. అదే విధంగా భీమా ఎత్తిపోతల స్టేజి–1 ద్వారా 1,300 క్యూసెక్కులు, స్టేజి–2 ద్వారా 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 630 క్యూసెక్కులను పంపింగ్ చేస్తున్నారు. జూరాల కుడి ప్రధాన కాల్వ ద్వారా 725 క్యూసెక్కులు, ఎడమ ప్రధాన కాల్వ ద్వారా 1,000 క్యూసెక్కులు, సమాంతర కాల్వ ద్వారా 650 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జూరాల జలవిద్యుత్ కేంద్రంలోని ఒక యూనిట్‌లో విద్యుదుత్పత్తి కొనసాగిస్తూ 7,666 క్యూసెక్కులను వినియోగిస్తు దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment