సాక్షి, న్యూఢిల్లీ: రాయల తెలంగాణ దిశగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా తమ జిల్లాను తెలంగాణలోనే కలపాలంటూ గళమెత్తేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు తగిన కారణాలను కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కూడా ఈ మేరకు వారు విజ్ఞప్తి చేయనున్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి నేతృత్వంలో కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మంగళవారం ఆమెతో సమావేశం కానున్నారు. ‘రాయల తెలంగాణపై అభిప్రాయం చెప్పేందుకు’ వారిప్పటికే అధినేత్రి అపాయింట్‌మెంట్ కోరినట్టు, ఆమె కార్యాలయం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది!
దిగ్విజయ్‌తో కర్నూలు నేతల భేటీ
సోమవారం రాత్రి కర్నూలు జిల్లా నేతలు దిగ్విజయ్‌సింగ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి నేతత్వంలో ఎంపీ ఎస్పీవై రెడ్డి, రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లబ్బి వెంకటస్వామి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రాంరెడ్డి, మురళీకృష్ణ వీరిలో ఉన్నారు. విభజనపై వ్యక్తమవుతున్న నిరసనలు, నేతల రాజీనామాలు, నదీ జలాల అంశం వీరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు చెబుతున్నా... విభజనకు తమ ప్రాంత ప్రజలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారని, విభజన అనంతరం సీమ మరింత వెనుకబడుతుందన్న అభిప్రాయం అక్కడి ప్రజల్లో బలంగా ఉందని నేతలు వివరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటు జరిగితే తమ ప్రాంతంలో నదీ జలాల వివాదం తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. ఇప్పటికే తుంగభద్ర నీటి కేటాయింపుల విషయంలో సరిహద్దున ఉన్న మహబూబ్‌నగర్‌తో నిత్య పోరాటం చేస్తున్నామని, రాజోలిబండ వాటర్ స్కీం కింద సైతం వివాదాలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు వస్తుందని, అక్కడ నీటి ప్రవాహాలకు అడ్డుకట్ట వేస్తే తమ జిల్లాకు చుక్క నీరందదని, తమ ప్రాంతం అంతా ఎడారిగా మారుతుందని తెలిపారు. అందువల్ల తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని, అప్పుడే న్యాయం జరుగుతుందని వారు కోరినట్లు సమాచారం. రాజకీయ కోణంలో కూడా కర్నూలును తెలంగాణలో కలిపితేనే మంచిదన్న అభిప్రాయాన్ని కొందరు నేతలు వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.
మూడుగా విభజించాల్సిందే: కోట్ల
రాష్ట్రం సమైక్యంగా ఉండటానికే తాము మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని, అలా కుదరని పక్షంలో రాష్ట్రాన్ని మూడుగా విభజించాలని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. లేనిపక్షంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని దిగ్విజయ్‌తో భేటీ అనంతరం ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని, హైదరాబాద్‌తోనే తాము కలిసుంటామని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు.
నేడు సోనియాతో భేటీ..
కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మంగళవారం తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలువనున్నారు. కోట్ల ఇప్పటికే అపాయింట్‌మెంట్ కోరారని, సోనియా కార్యాలయం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
రాయల తెలంగాణకే కర్నూలు జిల్లా నేతలు సై!
Published Tue, Aug 6 2013 2:58 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement