విశాఖకు భాస్కరుడు.. పశ్చిమకు ప్రవీణుడు | Katamaneni Bhaskar Transfer From West Godavari | Sakshi
Sakshi News home page

విశాఖకు భాస్కరుడు.. పశ్చిమకు ప్రవీణుడు

Published Fri, Jan 18 2019 7:18 AM | Last Updated on Sat, Mar 9 2019 11:21 AM

Katamaneni Bhaskar Transfer From West Godavari - Sakshi

కాటమనేనిభాస్కర్‌ , ప్రవీణ్‌కుమార్‌

సాక్షి, విశాఖపట్నం: ‘సాక్షి’ చెప్పింది నిజమైంది. జిల్లా కొత్త కలెక్టర్‌గా కాటమనేని భాస్కర్‌ ఖరారయ్యారు. ఈ విషయాన్ని గతేడాది మార్చిలోనే సాక్షి చెప్పింది. సుదీర్ఘ కాలం పాటు వివిధ హోదాల్లో పనిచేసిన ప్రస్తుత జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఎట్టకేలకు బదిలీ అయ్యారు. ఆయనను పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా నియమించారు. అక్కడి కలెక్టర్‌ కాటమనేని భాస్కర్‌ను ఇక్కడ నియమిస్తూప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ అనీల్‌చంద్ర పునేఠా గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

వివిధ హోదాల్లో ఆరేళ్లు: 2006 బ్యాచ్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్‌ 2012లో జాయింట్‌ కలెక్టర్‌గా జిల్లాలో అడుగుపెట్టారు. ఆతర్వాత జీవీఎంసీ కమిషనర్‌గా.. ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌గా.. ఒకే జిల్లాలో మూడు కీలక పదవుల్లో ఏకబికిన పనిచేసిన ఐఏఎస్‌ అధికారి రాష్ట్రంలో లేరనే చెప్పవచ్చు. 2014 అక్టోబర్‌ 12న విశాఖపై హుద్‌హుద్‌ తుఫాన్‌ విరుచుకుపడిన సమయంలో జేసీ ఉన్న ప్రవీణ్‌కుమార్‌ అప్పటి జిల్లా కలెక్టర్‌ యువరాజ్‌తో కలిసి సహాయ, పునరావాస చర్యల్లో తనదైన ముద్ర వేశారు. బాధితులకు పరిహారం పంపిణీలో కొద్దిపాటి ఆరోపణలు వచ్చినా సహాయ చర్యల్లో సఫలమయ్యారన్న పేరుపొందారు. ఆ తర్వాత జీవీఎంసీ కమిషనర్‌ హోదాలో ఏడాదిన్నర పాటు విశాఖకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్మార్ట్‌సిటీ గుర్తింపు తీసుకొచ్చారు. జాతీయ స్థాయిలో విశాఖను టాప్‌–3లో నిలిపారు. యువరాజ్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌గా ప్రవీణ్‌కుమార్‌కు పగ్గాలు అప్పగించింది. జేసీగా, జీవీఎంసీ కమిషనర్‌గా, కలెక్టర్‌గా ఒకేచోట పనిచేసిన ఘనత ఆయన సొంతమైంది. 2016 జూలై 25న కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్‌కుమార్‌ గత 31 నెలల్లో తీవ్ర ఒత్తిళ్ల మధ్యే విధులు నిర్వర్తించారు.

రికార్డుల ట్యాంపరింగ్‌ను బయటపెట్టింది ప్రవీణుడే  ప్రభుత్వంపై విమర్శలు వస్తాయంటే ఎవరైనా వెనుకడుగు వేస్తారు. ప్రభుత్వ పెద్దలతో చర్చించి, వారి అనుమతి లేకుండా ఆ విషయాలను బయటపెట్టరు. అలాంటిది జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది తిరక్కుండానే ప్రవీణ్‌కుమార్‌ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రికార్డుల ట్యాంపరింగ్, భూ కబ్జాల భాగోతాన్ని బయటపెట్టి ఒక విధంగా ఇబ్బందులు కొనితెచ్చుకున్నారు. మధురవాడ, కొమ్మాదిల్లో అధికారుల నిర్వాకం వల్ల రూ.2,200కోట్ల కుంభకోణం జరిగిందంటూ ట్యాంపరింగ్‌కు గురైన రికార్డులను బయటపెట్టి సంచలనం సృష్టించారు. దాదాపు లక్ష ఎకరాలకు చెందిన రికార్డులు గల్లంతైన విషయాన్ని కూడా బయటపెట్టి కలకలం సృష్టించారు. ఈ కుంభకోణం విపక్షాలకు ఆయుధం కాగా, ఆ తర్వాత వరుసగా వెలుగు చూసిన భూ కుంభకోణాలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. వైఎస్సార్‌సీపీతో సహా విపక్షాల ఆందోళనల నేపథ్యంలో పరువును కాపాడుకునేందుకు విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం విశాఖ భూ కుంభకోణాలపై సిట్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. భూ కుంభకోణాలు వెలుగుచూసిన సమయంలోనే ప్రవీణ్‌కుమార్‌ బదిలీపై ఊహాగానాలు విన్పించాయి. కానీ వెంటనే బదిలీ చేస్తే ప్రజల నుంచి తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతుందన్న భావనతో అప్పట్లో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

జాతీయ, అంతర్జాతీయ సదస్సులు: సదస్సులు, సమ్మేళనాల నిర్వహణలో ప్రవీణ్‌కుమార్‌ అరుదైన రికార్డే సృష్టించారు. అంతర్జాతీయ ప్లీట్‌ రివ్యూతోపాటు మూడు భాగస్వామ్య సదస్సులు, రెండు ఎడ్యుటెక్‌ సదస్సులు, కామన్‌వెల్త్‌ దేశాల స్పీకర్ల సదస్సు, అగ్రిటెక్, బ్లాక్‌చైన్‌ కాన్ఫరెన్స్, పిన్‌టెక్, బ్రిక్స్,స్ప్రింగ్‌ కాన్ఫరెన్స్‌లతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్పోర్ట్స్‌ ఈవెంట్స్, వరుసగా విశాఖ ఉత్సవాలు, విండ్,బెలూన్‌ ఫెస్టివల్స్‌.. ఇలా గత ఆరేళ్లలో ఎన్నో ఈవెంట్ల నిర్వహణలో కీలకపాత్ర పోషించారు.

మూడో భాగస్వామ్య సదస్సు తర్వాతే బదిలీపై ఊహాగానాలు : గతేడాది ఫిబ్రవరిలో మూడోసారి నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగిసిన తర్వాత మళ్లీ ప్రవీణ్‌కుమార్‌ బదిలీపై అధికార వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ప్రవీణ్‌ కుమార్‌కు బదిలీ తప్పదని ప్రభుత్వం నుంచి సంకేతాలు అందాయి. దీంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖ కలెక్టర్‌గిరీపై ఆశలు పెట్టుకున్న పలువురు ఐఏఎస్‌లు తీవ్రంగా ప్రయత్నించారు. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి ప్రద్యుమ్నతో సహా బాబూరావు నాయుడు, సత్యనారాయణ, కార్తికేయ మిశ్రా, పాటు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజులు కలెక్టర్‌గా వచ్చేందుకు పోటీపడ్డారు.

కాటమనేనికే పచ్చజెండా: చాలామంది పోటీ పడినా ప్రభుత్వం మాత్రం యువ ఐఏఎస్‌ అధికారి కాటమనేని భాస్కర్‌ వైపే మొగ్గు చూపింది. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా దాదాపు నాలుగున్నరేళ్లుగా భాస్కర్‌ సేవలందిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పర్యవేక్షణలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాటమనేని భాస్కర్‌ను కాస్త ఆలస్యమైనా విశాఖకు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రానుంది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. దీంతో ఫిబ్రవరి వరకు ఈ ఇరువురి బదిలీలు జరకపోవచ్చునని భావించారు. కానీ ప్రభుత్వం సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే వీరిని బదిలీ చేసింది.

చాలా సంతృప్తిగా ఉంది
ఒకే జిల్లాలో జేసీగా, జీవీఎంసీ కమిషనర్‌గా, కలెక్టర్‌గా ఆరేళ్లపాటు మూడు కీలక పదవులను నిర్వహించగలిగే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఇక్కడ నేను ఎంతో నేర్చుకున్నాను. విశాఖవాసులు నిజంగా ఎంతో సౌమ్యులు. నేను ఎక్కడకు వెళ్లినా వీరు చూపిన ఆదరాభిమానాలు, ఇక్కడ అధికారులు అందించిన సహాయ సహకారాలు మరువలేను. ప్రభుత్వ సహకారంతో ఎన్నో సంస్కరణలు తీసుకురాగలిగాం. ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించగలిగాం. జిల్లాను ఓడీఎఫ్‌ జిల్లాగా తీర్చిదిద్దగలిగాం. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామినయ్యే అవకాశం లభించడం అరుదైన గౌరవంగా భావిస్తున్నా.– ప్రవీణ్‌కుమార్, జిల్లా కలెక్టర్‌

విశాఖ రావడం ఆనందంగా ఉంది
రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖకు కలెక్టర్‌గా రానుండం ఆనందంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో సుదీర్ఘకాలం పాటు పనిచేసాను. ఇక్కడి ప్రజలు నాపై చూపించిన ఆదరాభిమానాలు మర్చిపోలేను. అమరావతి తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు, ప్రాధాన్యత కలిగిన పారిశ్రామిక రాజధాని విశాఖలో పనిచేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా కృషి చేస్తాను.– కాటమనేని భాస్కర్, నూతన కలెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement