చిత్తూరు మేయర్‌గా కటారి హేమలత
చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ కుర్చీని మరోసారి మహిళ అధిష్టించారు. నగర పాలక సంస్థ మేయర్‌గా కటారి హేమలత ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఎన్నికల ప్రిసైండింగ్ అధికారిగా వ్యవహరించి హేమలత చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 17 నెలల తర్వాత చిత్తూరు నగర మేయర్ కుర్చీ భర్తీ అయ్యింది. అప్పటివరకు మేయర్‌గా ఉన్న కటారి అనురాధ హత్యకు గురవడంతో బీసీ–మహిళకు రిజర్వు అయింది. అయితే మేయర్ స్థానంలో పురుషుడు ఉండడంపై మహిళా కార్పొరేటర్లు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగి చిత్తూరులో ఖాళీగా ఉన్న 33, 38వ వార్డులకు ఉప ఎన్నికలు నిర్వహించింది.
కలెక్టర్ సమక్షంలో..
కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ ఎన్నిక పూర్తిగా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సమక్షంలో నిర్వహించారు. 33వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన దివంగత మేయర్ అనురాధ కోడలు కటారి హేమలత చేత తొలుత ఇన్‌చార్జ్ మేయర్ ఆర్.సుబ్రమణ్యం కార్పొరేటర్‌గా ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం కౌన్సిల్ హాలుకు చేరుకున్న కలెక్టర్ కార్పొరేటర్ల హాజరును తనిఖీ చేసి, కోరం ఉన్నట్లు ప్రకటించారు. మేయర్ పదవికి హేమలతను టీడీపీ తరఫున అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించి విప్ జారీ చేయడంతో ఇన్‌చార్జ్ మేయర్ సుబ్రమణ్యం ఈమెను ప్రతిపాదిం చారు. కార్పొరేటర్ కిరణ్ బలపరిచారు.
ఎవరూ పోటీకి రాకపోవడంతో హేమలత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పేర్కొన్న కలెక్టర్ ఆమె చేత మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్యేలు సత్యప్రభ, సుగుణమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి, ఎమ్మెల్సీలు దొరబాబు, గౌనివారి శ్రీనివాసులు, కార్పొరేషన్ కమిషనర్ బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.