ఫాతిమా మెడికల్ కాలేజి విద్యార్థిని కౌసర్‌ఖాన్. చిత్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) : సీఎం చంద్రబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్ మాటలు నమ్మి తాము మోసపోయామని ఫాతిమా కళాశాల విద్యార్థిని కౌసర్‌ఖాన్ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్‌లో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్‌తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. ఫాతిమా కళాశాలలో 8 నెలలు చదివిన తర్వాత తమను రోడ్డున పడేశారన్నారు. మూడేళ్లుగా తమకు న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీలిస్తూనే ఉందని, కానీ ఫలితం లేదన్నారు. ప్రభుత్వం ఒకే పొరపాటును వరుసగా చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తమకెందుకు అన్యాయం చేస్తోందో అర్థం కావడం లేదని వాపోయారు. మైనార్టీ కళాశాల అయినందునే వివక్ష చూపుతున్నారని విమర్శించారు.
ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోర్టు వెలుపల సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపి కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జేసీ నడ్డా, ఎంసీఐ అధికారులతో చర్చించి విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం మాటలు నమ్మశక్యంగా లేవన్నారు. విద్యార్థుల సమస్యపై పూనం మాలకొండయ్యను ఢిల్లీకి పంపడం సమంజసం కాదని తెలిపారు. చంద్రబాబు హామీ మేరకు విద్యార్థులను ఇతర కళాశాలల్లో సర్దుబాటు చేయాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు ధనేకుల మురళీకృష్ణ, కొలనుకొండ శివాజీ, నరహరిశెట్టి నరసింహారావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment