అవధాన రారాజు అస్తమయం | Kavitha prasad passes away | Sakshi
Sakshi News home page

అవధాన రారాజు అస్తమయం

Published Mon, Mar 16 2015 2:08 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

అవధాన రారాజు అస్తమయం - Sakshi

అవధాన రారాజు అస్తమయం

* తుదిశ్వాస విడిచిన రాళ్లబండి కవితా ప్రసాద్
* హృద్రోగ సమస్యతో బాధపడుతూ కన్నుమూత
* సాహితీ లోకం దిగ్భ్రాంతి.. కేసీఆర్, చంద్ర బాబు, వైఎస్ జగన్ సంతాపం

 
సాక్షి, హైదరాబాద్: అవధాన రారాజు అస్తమించాడు. తెలుగు సాహితీ జగత్తులో రాళ్లబండి కవితాప్రసాద్‌గా పేరొందిన రాళ్లబండి వెంకటేశ్వర ప్రసాదరాజు(55) తుది శ్వాస విడిచారు. కొద్దిరోజులుగా హృద్రోగ సమస్యతో బాధపడుతున్న రాళ్లబండి ఆదివారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో కన్ను మూశారు. ఫిబ్రవరి 24న ఆస్పత్రిలో చేరిన ఆయనకు.. వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.
 
అయితే కొద్దిరోజులుగా కిడ్నీల పనితీరు క్షీణించడం, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ రావడంతో పరిస్థితి విషమించింది. ఆయన మరణవార్త తెలుసుకున్న ప్రముఖ కవులు, కళాకారులు కేర్ ఆస్పత్రికి తరలి వచ్చారు. రాళ్లబండి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, మిత్రులు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరయ్యారు. సాంఘిక సంక్షేమ శాఖ డెరైక్టర్‌గా, ఉమ్మడి రాష్ట్రంలో సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా సమర్థ సేవలు అందించిన రాళ్లబండి మంచి పేరు తెచ్చుకున్నారు.
 
 అవధాన ప్రయోగాలకు ఆద్యుడు
 రాళ్లబండి కవితా ప్రసాద్ 1961లో కృష్ణా జిల్లా నెమలి గ్రామంలో జన్మించారు. చిన్నప్పట్నుంచే సాహిత్యం పట్ల విపరీతమైన అభిమానం ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్-1 అధికారిగా సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగంలో చేరి వివిధ హోదాల్లో పనిచేసి ప్రజలకు సేవలు అందించారు. సాంస్కృతిక శాఖకు రెండు సార్లు సంచాలకుడిగా పనిచేశారు. ఆయన నేతృత్వంలోనే నాల్గవ ప్రపంచ తెలుగు మహా సభలు జరిగాయి. ప్రస్తుతం ఆయన షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జాయింట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. రాళ్లబండిని అవధాన ప్రయోగాలకు ఆద్యుడిగా చెప్పవచ్చు. సుమారు 500కు పైగా అవధానాలు చేసిన రాళ్లబండి అందులో అనేక ప్రయోగాలు చేశారు. అష్టావధానాలు, శతావధానాలు, ద్విశతావధానాలు వంటి అనేక ప్రక్రియలు నిర్వహించారు. సంప్రదాయ అవధానంతోపాటు కథా, వచనా కవిత, గణితం లాంటి అనేక నూతన ప్రక్రియలను అవధానంలో చొప్పించారు.
 
  అష్టావధానమే అత్యంత సంక్లిష్టం అంటే అందులో అష్టాదశావధానం చేసి ఔరా అనిపించారు. నవ రస నవావధానంలోనూ రాళ్లబండి ప్రసిద్ధులు. ఓసారి 25 నిమిషాల్లో విచిత్ర అష్టావదానం చేసి పండితుల మెప్పు పొందారు. వరంగల్ భద్రకాళి దేవాలయంలో ఏకదిన శతక రచనధార (ఒక్కరోజులో ఆశువుగా శతకం చెప్పడం) ఆయన ప్రజ్ఞకు తార్కాణం. అలంకార అష్టావదానంలోనూ రాళ్లబండిది అందెవేసిన చెయ్యి. ‘ఆశుకవితా ఝరి’ పేరుతో గంటకు 300 పద్యాలు అప్పటికప్పుడు చెప్పారు. వచన కవిత్వంలో అగ్నిహంస, ఒంటరి పూలబుట్ట, దోసిట్లో భూమండలం వంటి అనేక సుప్రసిద్ధ రచనలు చేశారు. కాదంబినీ, పద్యమండపం, సప్తగిరిధామ శతకం వంటి రచనలతో పద్యకావ్యాల్లోనూ ప్రతిభ చాటుకున్నారు. అవధాన విద్యపై ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ పొందారు. ఆయన కలం నుంచి జాలువారిన అనేక వందల వ్యాసాలు, కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
 
 పలువురి సంతాపం..
 రాళ్లబండి మృతి పట్ల తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు భాషకు, సాహిత్యానికి ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆత్మీయ సాహిత్య మిత్రుడిని కోల్పోయామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, తెలుగు యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డిలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాళ్లబండి మృతితో గొప్ప అధికారిని కోల్పోయిందని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
 
 పాండిత్యం మూర్తీభవించిన వ్యక్తి: సి.నారాయణరెడ్డి
 తెలుగు సాహిత్యంలో పాండిత్యం మూర్తీభవించిన వ్యక్తిగా రాళ్లబండి కవితా ప్రసాద్ మిగిలిపోతారని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, మహాకవి సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆయన అకాల మరణం సాహిత్య లోకానికి తీరని లోటని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement