Rallabandi Kavitha Prasad
-
రాళ్లబండికి ఘన నివాళి
హైదరాబాద్: తెలుగుభాషకు, సాహిత్యానికి రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు రాళ్లబండి కవితాప్రసాద్ చేసిన సేవలు ఎనలేనివని మంత్రి చందూలాల్ అన్నారు. ఆదివారంరాత్రి గుండెపోటుతో మృతి చెందిన కవితాప్రసాద్ మృతదేహాన్ని సోమవారం మోతీనగర్‌లోని టింబు ఎన్క్లేవ్ అపార్టుమెంట్స్ ఆవరణలో ఉంచారు. అక్కడికి వెళ్లిన చందూలాల్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. నివాళులర్పించినవారిలో సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటి స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రెయిండ్ పీటర్లతోపాటు పి.వి.రాజేశ్వరరావు, దైవజ్ఞశర్మ, సినీనటుడు ఉత్తేజ్ తదితరులు ఉన్నారు. సుమారు ఒకటిన్నర గంట ప్రాంతంలో ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర కొనసాగింది. బల్కంపేట ఈఎస్ఐ హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. సీపీఐ సంతాపం: కవితాప్రసాద్ అకాల మరణంపట్ల సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సంతాపం ప్రకటించారు. కవితాప్రసాద్ మరణం తెలుగు సాహితీ, సాంస్కృతిక రంగాలకు తీరనిలోటని పేర్కొన్నారు. -
అవధాన రారాజు అస్తమయం
-
అవధాన రారాజు అస్తమయం
* తుదిశ్వాస విడిచిన రాళ్లబండి కవితా ప్రసాద్ * హృద్రోగ సమస్యతో బాధపడుతూ కన్నుమూత * సాహితీ లోకం దిగ్భ్రాంతి.. కేసీఆర్, చంద్ర బాబు, వైఎస్ జగన్ సంతాపం సాక్షి, హైదరాబాద్: అవధాన రారాజు అస్తమించాడు. తెలుగు సాహితీ జగత్తులో రాళ్లబండి కవితాప్రసాద్‌గా పేరొందిన రాళ్లబండి వెంకటేశ్వర ప్రసాదరాజు(55) తుది శ్వాస విడిచారు. కొద్దిరోజులుగా హృద్రోగ సమస్యతో బాధపడుతున్న రాళ్లబండి ఆదివారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో కన్ను మూశారు. ఫిబ్రవరి 24న ఆస్పత్రిలో చేరిన ఆయనకు.. వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే కొద్దిరోజులుగా కిడ్నీల పనితీరు క్షీణించడం, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో పరిస్థితి విషమించింది. ఆయన మరణవార్త తెలుసుకున్న ప్రముఖ కవులు, కళాకారులు కేర్ ఆస్పత్రికి తరలి వచ్చారు. రాళ్లబండి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, మిత్రులు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరయ్యారు. సాంఘిక సంక్షేమ శాఖ డెరైక్టర్‌గా, ఉమ్మడి రాష్ట్రంలో సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా సమర్థ సేవలు అందించిన రాళ్లబండి మంచి పేరు తెచ్చుకున్నారు. అవధాన ప్రయోగాలకు ఆద్యుడు రాళ్లబండి కవితా ప్రసాద్ 1961లో కృష్ణా జిల్లా నెమలి గ్రామంలో జన్మించారు. చిన్నప్పట్నుంచే సాహిత్యం పట్ల విపరీతమైన అభిమానం ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్-1 అధికారిగా సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగంలో చేరి వివిధ హోదాల్లో పనిచేసి ప్రజలకు సేవలు అందించారు. సాంస్కృతిక శాఖకు రెండు సార్లు సంచాలకుడిగా పనిచేశారు. ఆయన నేతృత్వంలోనే నాల్గవ ప్రపంచ తెలుగు మహా సభలు జరిగాయి. ప్రస్తుతం ఆయన షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జాయింట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. రాళ్లబండిని అవధాన ప్రయోగాలకు ఆద్యుడిగా చెప్పవచ్చు. సుమారు 500కు పైగా అవధానాలు చేసిన రాళ్లబండి అందులో అనేక ప్రయోగాలు చేశారు. అష్టావధానాలు, శతావధానాలు, ద్విశతావధానాలు వంటి అనేక ప్రక్రియలు నిర్వహించారు. సంప్రదాయ అవధానంతోపాటు కథా, వచనా కవిత, గణితం లాంటి అనేక నూతన ప్రక్రియలను అవధానంలో చొప్పించారు. అష్టావధానమే అత్యంత సంక్లిష్టం అంటే అందులో అష్టాదశావధానం చేసి ఔరా అనిపించారు. నవ రస నవావధానంలోనూ రాళ్లబండి ప్రసిద్ధులు. ఓసారి 25 నిమిషాల్లో విచిత్ర అష్టావదానం చేసి పండితుల మెప్పు పొందారు. వరంగల్ భద్రకాళి దేవాలయంలో ఏకదిన శతక రచనధార (ఒక్కరోజులో ఆశువుగా శతకం చెప్పడం) ఆయన ప్రజ్ఞకు తార్కాణం. అలంకార అష్టావదానంలోనూ రాళ్లబండిది అందెవేసిన చెయ్యి. ‘ఆశుకవితా ఝరి’ పేరుతో గంటకు 300 పద్యాలు అప్పటికప్పుడు చెప్పారు. వచన కవిత్వంలో అగ్నిహంస, ఒంటరి పూలబుట్ట, దోసిట్లో భూమండలం వంటి అనేక సుప్రసిద్ధ రచనలు చేశారు. కాదంబినీ, పద్యమండపం, సప్తగిరిధామ శతకం వంటి రచనలతో పద్యకావ్యాల్లోనూ ప్రతిభ చాటుకున్నారు. అవధాన విద్యపై ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ చేసి డాక్టరేట్ పొందారు. ఆయన కలం నుంచి జాలువారిన అనేక వందల వ్యాసాలు, కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పలువురి సంతాపం.. రాళ్లబండి మృతి పట్ల తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు భాషకు, సాహిత్యానికి ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆత్మీయ సాహిత్య మిత్రుడిని కోల్పోయామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, తెలుగు యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డిలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాళ్లబండి మృతితో గొప్ప అధికారిని కోల్పోయిందని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాండిత్యం మూర్తీభవించిన వ్యక్తి: సి.నారాయణరెడ్డి తెలుగు సాహిత్యంలో పాండిత్యం మూర్తీభవించిన వ్యక్తిగా రాళ్లబండి కవితా ప్రసాద్ మిగిలిపోతారని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, మహాకవి సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆయన అకాల మరణం సాహిత్య లోకానికి తీరని లోటని అన్నారు. -
రాళ్లబండి కవితా ప్రసాద్ ఆరోగ్యం విషమం
సాక్షి, హైదరాబాద్: గత రెండు రోజుల క్రితం గుండె సంబంధిత సమస్యతో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరిన ప్రముఖ సాహితీవేత్త, భాషా సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. మూత్రపిండాలు కూడా పని చేయకపోవడంతో రోజంతా డయాలసిస్ చేస్తున్నారు. డాక్టర్ కపాడియా నేతృత్వంలోని వైద్య బృందం ఆయనకు సేవలు అందిస్తోంది. -
సాహితీవేత్త రాళ్లబండికి అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త, భాషా సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు రాళ్లబండి కవితా ప్రసాద్ (ఆర్. ప్రసాదరాజు) గురువారం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ఇంటెన్సివ్‌కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్న రాళ్లబండి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. విషయం తెలిసి పలువురు ప్రముఖుల ఆసుపత్రికి వచ్చి రాళ్లబండి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. -
సాంస్కృతిక శాఖ సంచాలకునిగా హరికృష్ణ!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులుగా మామిడి హరికృష్ణ నియమితులుకానున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులుగా ఉన్న రాళ్లబండి కవితాప్రసాద్ తిరిగి సాంఘిక సంక్షేమ శాఖకు బదిలీ కానున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు ఉత్తర్వులు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో మామిడి హరికృష్ణను నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హరికృష్ణ ప్రస్తుతం కో- ఆపరేటివ్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతోనే తాను సాంఘిక సంక్షేమ శాఖకు తిరిగి వెళ్తున్నట్లు కవితాప్రసాద్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. -
రాళ్లబండి కవితాప్రసాద్‌కు 25వేలు జరిమానా
హైదరాబాద్ : రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్‌కు సమాచార హక్కు కమిషన్ రూ.25వేలు జరిమానా విధించింది. తెలుగు మహాసభల ఖర్చుకు సంబంధించి ఇంతవరకూ ఆయన వివరాలు సమర్పించలేదని సమాచారం. అంతే కాకుండా ఆడిట్ విషయంలో అడిగిన సమాచారం సకాలంలో అందించకపోవటంతో పాటు, తప్పుడు సమాచారాం ఇచ్చారంటూ సమాచార హక్కు కమిషనర్ విజయబాబు జరిమానా విధించారు. కోట్లాది రూపాయల అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదుల నేపథ్యంలో దీనిపై విచారణ జరిపించాలని సమాచార హక్కు కమిషన్.... ప్రభుత్వాన్ని కోరింది. ఇదిలా ఉండగా, ఎటువంటి విచారణకైనా తాను సిద్దమేనని రాళ్లబండి కవితాప్రసాద్ చెప్పారు. రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ తెలుగు మహాసభలు, రవీంద్ర భారతి హాలు కేటాయింపునకు సంబంధించి అడిగిన వివరాలను సమర్పించినట్లు ఆయన తెలిపారు.