అవధాన రారాజు అస్తమించాడు. తెలుగు సాహితీ జగత్తులో రాళ్లబండి కవితాప్రసాద్‌గా పేరొందిన రాళ్లబండి వెంకటేశ్వర ప్రసాదరాజు(55) తుది శ్వాస విడిచారు. కొద్దిరోజులుగా హృద్రోగ సమస్యతో బాధపడుతున్న రాళ్లబండి ఆదివారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో కన్ను మూశారు. ఫిబ్రవరి 24న ఆస్పత్రిలో చేరిన ఆయనకు.. వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే కొద్దిరోజులుగా కిడ్నీల పనితీరు క్షీణించడం, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ రావడంతో పరిస్థితి విషమించింది. ఆయన మరణవార్త తెలుసుకున్న ప్రముఖ కవులు, కళాకారులు కేర్ ఆస్పత్రికి తరలి వచ్చారు. రాళ్లబండి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, మిత్రులు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరయ్యారు. సాంఘిక సంక్షేమ శాఖ డెరైక్టర్‌గా, ఉమ్మడి రాష్ట్రంలో సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా సమర్థ సేవలు అందించిన రాళ్లబండి మంచి పేరు తెచ్చుకున్నారు.