సాక్షి ప్రతినిధి, ఏలూరు : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమాన్ని లెక్కచేయకుండా.. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా సొంత లాభమే లక్ష్యంగా చివరివరకూ రాజకీయం నడిపించిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఎట్టకేలకు పదవులను త్యజించారు.
తాజా అడుగు కూడా తన భవిష్యత్ కోసమే వేయడం విశేషం. త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడంపై ఆయన సన్నిహితులే పెదవి విరుస్తున్నారు. చంద్రబాబు అండతో బీజేపీలో చేరి ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశంతోనే ఆయన కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు తేటతెల్లమవుతోంది.
వరుస ఓటముల నుంచి...
కృష్ణా జిల్లాలో వరుస ఓటములతో అల్లాడుతున్న కావూరి సాంబశివరావుకు 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఏలూరు పార్లమెంటరీ సీటును ఇప్పించారు. 2009 ఎన్నికల్లోనూ కావూరితో ఇక్కడి నుంచి పోటీ చేయించారు. చివరకు కావూరి మాత్రం పదవే పరమార్థంగా వ్యవహరిస్తూ ప్రజల మనోభీష్టాలను తుంగలో తొక్కారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా సీడబ్ల్యుసీ నిర్ణయం తీసుకున్న సమయంలో ప్రజలు చేపట్టిన సమైక్యాం ధ్ర ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు.
అధిష్టానంతో చర్చలు కూడా జరిపారు. ఆ సమయంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని భావించారు. ఫలితం లేకపోవడంతో అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అధిష్టానం పిలిచి మాట్లాడటంతో వెనక్కి తగ్గారు. అనంతరం విభజనకు కేంద్రం వడివడిగా అడుగులు వేసింది. దీనికి కొద్దిరోజుల ముందే కావూరికి కేంద్ర క్యాబినెట్‌లో జౌళిశాఖను కట్టబెట్టింది. అప్పటివరకూ సమైక్యాంధ్ర ఉద్యమం రథసారధిగా వ్యవహరించిన కావూరి మంత్రి పదవి వచ్చిన తరువాత సమైక్యాంధ్ర విషయాన్ని పక్కన పెట్టేశారు.
ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతున్నా...
సీమాంధ్ర అంతటా ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతున్నా కావూరి పట్టించుకోలేదు. జిల్లాకు వచ్చినప్పుడు అనేకసార్లు ఆయన్ని సమైక్యవాదులు, ప్రజలు అడ్డుకుని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కావూరి మాత్రం రాజీనామా చేయకపోవడం ఉద్యమాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసి.. ఉద్యమకారులపై దుర్భాషలాడటం అప్పట్లో సంచలనం సృష్టించింది.
చివరకు రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత కూడా కావూరి పదవిని వదల్లేదు. రాష్ట్రపతి తెలంగాణ బిల్లుకు ఆమోద ముద్ర వేసిన తర్వాత పలువురు కేంద్ర మంత్రులు రాజీనామా చేసినా ఈయన మాత్రం పదవిని పట్టుకుని వేలాడారు. ఏ దశలోనూ రాష్ట్ర విభజన విషయంలో ఇక్కడి ప్రజల మనోభావాలను వ్యక్తీకరించే ప్రయత్నం చేయలేదనే అభిప్రాయం అందరిలోనూ ఉంది.
టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించి..
విభజన నిర్ణయం జరిగిపోయి ఎన్నికలు ముంచుకొచ్చిన తరుణంలో కావూరి రూటు మార్చారు. మంత్రి పదవిని అనుభిస్తూనే తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. టీడీపీలో చేరటం ద్వారా తిరిగి ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి పావులు కదిపారు. కానీ జిల్లా టీడీపీ నేతలంతా ఆయనను ముక్తకంఠంతో వ్యతిరేకించడంతో చంద్రబాబు వెనుకడుగు వేశారు. అయితే నేరుగా టీడీపీలో చేర్చుకోకుండా బీజేపీలోకి పంపించి ఆ పార్టీ నుంచి పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు కుదురుతుందనుకున్న నేపథ్యంలో ఆయనకు వీలైతే ఏలూరు లేకపోతే కృష్ణాజిల్లా మచిలీపట్నం సీటు ఇప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. దీంతోనే ఆయన పార్టీ, మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పణంగా పెట్టి మంత్రి పదవి తెచ్చుకున్న కావూరి ఆ తర్వాత ఉద్యమాన్నే కించపరిచి ఇక్కడి ప్రజలకు వ్యతిరేకంగా మారారు.
చివరివరకూ కేంద్ర మంత్రి పదవిని అనుభవిస్తూ తన రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని గురువారం రాజీనామా చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమైక్యాంధ్రకు అనుకూలంగా మాట్లాడుతూనే సమైక్య ఉద్యమానికి తూట్లు పొడిచిన కావూరి చివరకు రాష్ట్రాన్ని విడగొట్టడంలో తనవంతు పాత్ర పోషించిన బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌వాదిగా బీజేపీని, చంద్రబాబును వ్యతిరేకించిన కావూరి చివరకు రాజకీయ భవిష్యత్ కోసం వారి పంచనే చేరుతుండటం గమనార్హం.
కావూరి ‘సొంత’బాట!
Published Fri, Apr 4 2014 12:27 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement