
విద్యార్థి నేతల్నిఎమ్మెల్యేలను చేస్తా: కేసీఆర్
- విద్యార్థి నేతలకు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హామీ
- ఎల్లారెడ్డి ఈ దఫా ఎన్నికల్లో మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంటారు. ఇప్పటివరకు ఆ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరించిన దేవరి మల్లప్పకు పార్టీకి వచ్చే మొదటి అవకాశంలోనే ఎమ్మెల్సీగా చేస్తా.
- విద్యార్థి నాయకుడు పిడమర్తి రవిని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీలో ఉంచుతా. రవి విద్యార్థి టైగర్, ఎక్కడి నుంచి పోటీ చేసినా సులభంగా గెలుపొందగలరు. రవిని పార్టీలోకి రమ్మని నేనే స్వయంగా ఆహ్వానించా. ఉద్యమంలో పాల్గొన్న జిల్లాల్లోని విద్యార్థి నాయకులకు ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలలో అవకాశమిస్తా.
- ఎన్నికల తరువాత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీఆర్‌ఎస్సే. ఉద్యమం చేసి అధికారంలో వచ్చినవారే ఇక్కడి ప్రజల బాధలు తెలుసుకోగలరు. రాష్ట్ర పునర్ నిర్మాణం బ్రహ్మాండంగా చేయగలరు.
- ఈవేళ అనేకపార్టీలు, బహురూపులు, గజకర్ణ గోకర్ణ, టక్కుటమార విద్యలతో ఇక్కడి ప్రజలను గందరగోళ పర్చడానికి వస్తున్నారు. కాబట్టి టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసుకొని ముందుకుపోవాలంటే ఎన్నికలలో విజయం సాధించాల్సిన అవసరం ఉంది.
- 14 ఏళ్ల ఉద్యమకాలంలో నేను ఏనాడూ విరాళాలు అడగలేదు. ఇప్పుడు సాధారణ ఎన్నికలకు పోతున్న టీఆర్‌ఎస్ పార్టీకి విరాళాలివ్వమని ప్రజలను అభ్యర్థిస్తున్నా. పది రూపాయలు, ఆపైన మీ ఇష్టం. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో బ్యాంకు ఆఫ్ బరోడా శాఖలో పార్టీ పేరుతో ఉన్న 266- 101- 0000-2075 ఎకౌంట్‌కు పంపండి.
- జిల్లా జడ్జీల కోటాలో హైకోర్టు న్యాయమూర్తులను చేసేందుకు కొలీజియం ఏర్పాటు చేయబోతున్నట్టు నాకు సమాచారం అందింది. హైదరాబాద్‌లో జిల్లా జడ్జీ హోదా ఉన్నవారు 85 మంది. అందులో 75 మంది ఆంధ్రోళ్లే. తెలంగాణ వారు పది మందే. ఇలాంటి అన్యాయం జరుగుతుందనే తెలంగాణ కోరుకుంటున్నం. అందుకే ఇప్పుడు కొలీజియం నిర్వహించవద్దని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరుతున్నా. అందుకోసం ఆయనకు లేఖ రాస్తా. ఆ లేఖను రాష్ట్రపతికి కూడా పంపుతా.