
కాంగ్రెస్ పార్టీలో 'కండువా' కలకలం
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో 'కండువా' కలకలం రేగింది. సీమాంధ్ర నాయకులు కత్తులు దూసుకునేందుకు 'కండువా' ఆజ్యం పోశాయి. కాంగ్రెస్ పార్టీని వదిలివెళ్లే నేతలపై పీసీసీ అధ్యక్షుడు సత్తిబాబు చేసిన కామెంట్స్ చిచ్చు రేపాయి. కాంగ్రెస్ను వీడి వేరే పార్టీల్లో చేరేందుకు 'కర్చీఫ్' వేసిన నాయకులు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని ఆయన సెలవిచ్చారు. అయితే పక్కపార్టీలోకి వెళ్లాలన్న ఉద్దేశంతో సొంత పార్టీపై విమర్శలు చేస్తే మాత్రం ఉపేక్షించబోమని సత్తిబాబు హెచ్చరించారు. మంత్రులను కూడా వదిలిపెట్టబోమన్నారు. బొత్స వ్యాఖ్యలపై మంత్రులు రెండు వర్గాలుగా విడిపోయి మాటల యుద్ధానికి దిగారు.
రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ ఖాళీ అవుతుందని పెట్టుబడుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. నేతలు ఇతర పార్టీల వైపు చూడటం కాదని... పార్టీలే ఇతర పార్టీలపై కండువాలు వేస్తున్న సమయమిది అని చురక అంటించారు. గంటా వ్యాఖ్యలపై మంత్రి కొండ్రు మురళీ మండిపడ్డారు. వేరే పార్టీలో 'కర్చీఫ్' వేసుకుని కాంగ్రెస్ను విమర్శిస్తే సహించబోమని హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎంపీ లగడపాటి రాజగోపాల్, గంటా శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలతో మంత్రి పితాని సత్యనారాయణ శృతి కలిపారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే పార్టీ ఖాళీ అవుతుందని పితాని పేర్కొన్నారు. 'కండువా' వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ఇంకెంత దూరం వెళతాయో చూడాలి.