మా కష్టాన్ని దోచుకోవద్దు
ఎంపీ కేశినేని ట్రావెల్స్ కార్యాలయం వద్ద 500 మంది కార్మికుల ధర్నా
సాక్షి, అమరావతి బ్యూరో: ‘మీరు టీడీపీ ఎంపీ... రాష్ట్రంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంత మాత్రాన అంతా మీ ఇష్టమా? పేదల కష్టాన్ని దోచుకుంటారా? మాకు జీతాలు ఇవ్వకుండా వేధి స్తారా? చెప్పాపెట్టకుండా ట్రావెల్స్‌ను మూసివేసి మా జీతాలు చెల్లించకుండా ముఖం చాటేశారు. బ్యాంకులను మోసం చేసేందుకే ఇలా చేశారు. ఏడాదిగా జీతాల్లేక అప్పులపాలయ్యాం. ఇంకా మాకు అన్యాయం చేయొద్దు’ అంటూ కేశినేని ట్రావె ల్స్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
కేశినేని ట్రావెల్స్ డ్రైవర్లు, సిబ్బంది ప్రత్యక్ష పోరాటా నికి దిగారు. బకాయిలతోసహా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం విజయవాడలోని ఎంపీ కేశినేని నాని కార్యాలయాన్ని ముట్టడించారు. ఏపీ, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 500 మంది కార్మికులు విజయవాడలోని ఎంపీ కేశినేని కార్యాలయం వద్దకు తరలివచ్చారు. జీతాలు అందక తమ బాధలను చెప్పుకునేందుకు వచ్చిన కార్మికులను ఎంపీ కేశినేని కార్యాలయంలోకి అనుమతించ లేదు. ఆ సమయంలో కేశినేని నాని తన కార్యాలయంలో లేరు. ఆయన ప్రతినిధులు అప్పటికే పోలీసులను పిలిపించారు. డ్రైవర్లు, సిబ్బందిని ఎంపీ కార్యాలయానికి వెళ్లనీయకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు.