గోళ్లు గిల్లుకుంటున్న ధాన్యం కేంద్రాలు
Published Thu, Jan 23 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:53 AM
సత్తెనపల్లి, న్యూస్‌లైన్: ఖరీఫ్ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ప్రభుత్వం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) జిల్లాలో 52 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మెటీరియల్ ఇవ్వకపోగా అధికారులను కూడా సరిగా నియమించలేదు. దీనికి తోడు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.1345 కంటే ప్రైవేటు వ్యాపారులు ఇచ్చే ధర (రూ.1390) ఎక్కువగా ఉండటంతో వారే రైతులకు దేవుళ్లుగా కనిపిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో భారీ వర్షాలతో కొంత మేర నష్టం జరిగినా, కనీస మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందంటూ పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డీఆర్‌డీఏ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు ఒక గింజ కూడా కొనుగోలు చేయలేదు. ఈ నేపథ్యంలో రైతులు ధాన్యాన్ని ప్రైవేటు మిల్లర్లు, వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దెబ్బతిన్నధాన్యానికి కొంత ధర తగ్గించి ఇచ్చినా రైతులు వారికే అమ్మి అప్పులు తీర్చుకుంటున్నారు. నిబంధనల అడ్డంకి.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలను చూసి రైతులు వెనక్కు తగ్గుతున్నారన్నది అందరికీ తెలిసిందే. అధికారులు కూడా తేమ 17 శాతం కంటే ఎక్కువ ఉండకూడదని, మేలు, నాసిరకం విభాగాలుగా ధాన్యాన్ని వర్గీకరించడం వంటి నిబంధనల వల్ల రైతులు ప్రభుత్వ కేంద్రాల వైపు చూడడం మానేశారు. సొంత ఖర్చులతో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకు రావాలన్న నిబంధనలతో వారు వెనకడుగువేస్తున్నారు.
అధికారులు కూడా ఈ కొనుగోలేంటి మనకెందుకు తలనొప్పి అంటూ తప్పించుకుని మిల్లర్ల వద్దకు వెళ్లాలని సూచిస్తుండటంతో ప్రైవేట్ వ్యాపారులే దిక్కవుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు మేలు చేద్దామనే ధాన్యం కొనుగోలు కేంద్రాల లక్ష్యం కాస్త నీరుగారుతున్నట్టు స్పష్టమవుతుంది. మరికొంత మంది రైతులు మిల్లర్ల ధర నచ్చక కుప్పలు వేసి ధర కోసం ఎదురు చూస్తున్నారంటే పరిస్థితి అర్థమవుతుంది. ఇదిలా ఉండగా నాణ్యతా ప్రమాణాల పేరిట ప్రభుత్వ ప్రకటనలు చూసిన రైతులు రంగు మారిన ధాన్యాన్ని రూ. 200 నుంచి రూ. 300 వరకు తగ్గించి చేసిన అప్పులు తీర్చుకునేందుకు ప్రైవేటు వ్యక్తులకే విక్రయించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిబంధనలను సడలించి అన్నదాతలను ఆదుకునేందుకు ధాన్యం ధరను పెంచి దళారులు, మిల్లర్ల కొనుగోలుకు కళ్లెం వేసేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో
గ్రేడ్ ఏ రకం క్వింటా రూ.1345
కామన్ వెరైటీ క్వింటా రూ.1310,
బీపీటీ క్వింటా రూ.1500
ప్రైవేటు వ్యాపారులు
గ్రేడ్ ఏ ధాన్యం క్వింటా రూ.1390 (1010 రకం)
కామన్ వెరైటీ క్వింటా రూ.1300 (1010 రకం)
బీపీటీ క్వింటా రూ.1750
Advertisement
Advertisement