సాక్షి, న్యూఢిల్లీ : కియా మోటార్స్ తరలిపోతుందన్న వార్తలు అవాస్తవమని ఆ సంస్థ స్పష్టం చేసింది. కియా మోటార్స్లో పూర్తి స్థాయి ఉత్పత్తి చేయాలన్నదే తమ లక్ష్యమని కియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) కూఖ్యూన్ షిమ్ తెలిపారు. పూర్తి నిబద్ధతతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పని చేస్తున్నామన్నారు. ప్రస్తుత తయారీ పరిశ్రమను తరలించే యోచన లేదని అన్నారు. అనంతపురం పరిశ్రమను ప్రపంచ శ్రేణిగా తయారు చేయాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. కాగా రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని చంద్రబాబు నాయుడు దుష్పచారం చేస్తున్నారని ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఉన్న ఆయన కియా మోటార్స్ ప్రతినిధులతో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
(చదవండి : రాయిటర్స్‌కు బాబు సర్కారు పందేరం)
‘మా ప్రభుత్వంపై నమ్మకంతో కియా మోటార్స్ మరొక పరిశ్రమను కూడా పెట్టబోతోంది. జూలై నెలలో మరో కియా ప్లాంట్ వస్తుంది. కియా మోటార్స్ తమిళనాడుకు వెళ్తోందని టీడీపీ నేతలు ప్రచారం చేశారు. కానీ, కియా మోటార్స్‌తో మాట్లాడలేదని తమిళనాడు ప్రభుత్వమే స్వయంగా చెప్పింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడులు పెడుతున్నారు. ఒప్పందాలను గౌరవిస్తూ అమలు చేస్తున్నాం. శ్రీ సిటీ కంటే మెరుగైన దానిని తీసుకొచ్చేందుకు పాలసీ రూపొందిస్తున్నాం. చంద్రబాబు దిగజారి మాట్లాడడం బాధాకరం. మా ప్రభుత్వాన్ని, ప్రజలను ఇబ్బంది పెట్టడానికే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. రాజధాని కేంద్రీకృతంగా మాత్రమే అభివృద్ధి జరగాలనేది మా లక్ష్యం కాదు. అన్ని ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధి జరగాలి’అని మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment