అధికారులతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి శంకరనారాయణ
సాక్షి, పెనుకొండ : అర్హులైన స్థానికులందరికీ ‘కియా’ పరిశ్రమలో ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ స్పష్టం చేశారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలనే తలంపుతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవలే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు కూడా ఆమోదం పొందిందని ఆయన గుర్తు చేశారు. ఈ నెల 8న ‘కియా’ కారు ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రానున్న నేపథ్యంలో మంగళవారం మంత్రి శంకరనారాయణ జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ సత్యయేసుబాబుతో కలసి ‘కియా’ పరిశ్రమ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 8వ తేదీ(గురువారం) కియా పరిశ్రమలో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్న నూతన కారు ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారన్నారు. అనంతరం ఆయన నేరుగా వైఎస్సార్ కడప జిల్లాకు వెళ్తారని వెల్లడించారు. పెనుకొండను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ధృడ నిశ్చయంతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికుల సమస్యలన్నీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో స్వయంగా చూశారని, అందువల్లే ‘రైతు భరోసా’తో వారందరికీ ఆదుకునేందుకు సిద్ధమయ్యారన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, అధికారులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో మంగళవారం ఉదయం బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ సత్యయేసుబాబు ‘కియా’ పరిశ్రమలో భద్రతా ఏర్పాట్లను, ‘కియా’ పరిశ్రమలోని ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ‘కియా’ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈనెల 8న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘కియా’ పరిశ్రమలో ఉండే అవకాశం ఉందన్నారు. ‘కియా’ కారు ప్రారంభోత్సవానికి కూడా తక్కువ మందినే లోనికి అనుమతిస్తామని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. అనంతరం స్పెషల్ పార్టీ పోలీసులు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ‘కియా’ పరిశ్రమ అణువణువూ తనిఖీలు చేపట్టారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ జాహ్నవి, ఇన్‌చార్జ్ జేసీ సుబ్బరాజు, ‘కియా’ లీగల్ హెడ్ జూడ్, పరిశ్రమ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ థామస్ కిమ్, కియా ప్రభుత్వ అనుసంధానకర్త సోమశేఖర్‌రెడ్డి, ఏఎస్‌పీ చౌడేశ్వరి, ఆర్డీఓ శ్రీనివాస్, డీఎస్పీ ఆర్‌ఎస్ కృష్ణ, డీఎంహెచ్‌ఓ అనిల్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, మండల కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి, టౌన్ కన్వీనర్ తయూబ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment