ఘోరం..దారుణం..!
- కలకలం సృష్టించిన తల్లీబిడ్డల దుర్మరణం
- అవి హత్యలేనా!...
- బలపడుతున్నఅనుమానాలు
- ఆ దిశగానే పోలీసుల దర్యాప్తు
ఎంత ఘోరం!... ఎంత దారుణం... సాలిగ్రామపురంలో అనుమానాస్పద స్థితిలో దుర్మరణం పాలైన తల్లీబిడ్డల మృతదేహాలు చూసిన ప్రతి ఒక్కరు అన్న మాట ఇదే... అంతగా అందరి మనసులను కలచివేసిన ఈ దారుణానికి కారణం ఏమై ఉంటుందన్నది మాత్రం సందేహాస్పదంగానే ఉంది.
విశాఖపట్నం: గ్యాస్ సిలిండర్ పేలుడా?... అబ్బే కాదు. ఎందుకంటే సిలిండర్లు బాగానే ఉన్నాయి... విద్యుత్తు షార్ట్ సర్క్యూటా?... కానే కాదు... ఎందుకంటే ఆ సమయంలో విద్యుత్తు సరఫరాయే లేదు... మరి ఏమై ఉంటుంది?... ఎవరైనా హత్య చేశారా!?...
ఇదే ప్రస్తుతానికి అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. సాలిగ్రామపురం పోర్టు క్వార్టర్స్‌లో అనుమానాస్పద స్థితిలో తల్లీబిడ్డల దుర్మరణం నగరంలో కలకలం సృష్టించింది. పోర్టు ఉద్యోగి మొహిద్దీన్ భార్య సుల్తానా బేగం(40), కుమార్తె సోఫియా(17), కుమారుడు షఫీ(9) అనుమానాస్పద స్థితిలో బుధవారం దుర్మరణం పాలయ్యారు. మొహిద్దీన్ ఉద్యోగానికి వెళ్లిన కొద్దిసేపటికే ఈ ముగ్గురూ ఆహుతయ్యారు. వారి నివాసం నుంచి పొగలు రావడంతో స్థానికులు గుర్తించి లోపలికి వెళ్లేసరికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఇంతకీ ఈ ముగ్గురి దుర్మరణానికి కారణమేమిటన్నది అంతుచిక్కడం లేదు.
అన్నీ సందేహాలే.... : తొలుత గ్యాస్ సిలెండర్ పేలి ప్రమాదం సంభవించిందని భావించి, గ్యాస్ సిలిండర్లు చెక్కుచెదరకుండా ఉండడం, ఆ తర్వాత విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని అనుకున్నప్పటికి ఎటువంటి ఆధారాలు లేకపోవడం, భర్త ప్రవర్తన, ప్రమాదం జరిగినతీరు మొత్తం మీద హత్యే అనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసులు హత్యా, ఆత్మహత్యా అనే రెండు కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా హత్యచేసి,తర్వాత దహనం చేశారా? అనే దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాళాలు వేసిందెవరు? : ఇంటి బయటి నుంచి తాళం వేసి ఉండడం సందేహాలకు తావిస్తోంది. ఇంటి లోపల పడక గదికి కూడా బయటి నుంచి తాళం వేసి ఉండడం గమనార్హం. ఇంట్లో తల్లీబిడ్డలు ఉండగా బయట నుంచి ఎవరు తాళం వేసి ఉంటారన్నది కీలకంగా మారింది. ప్రమాదం సంభవించినా... ఆత్మహత్య చేసుకున్నా బయటి నుంచి తాళాలు వేయడం సాధ్యం కాదు. వారిని లోపల ఉంచి ఎవరో బయట నుంచి తాళం వేశారన్న నిర్ధారణ అవుతోంది. ముందే హత్య చేసి తర్వాత తాళాలు వేశారా అని సందేహం కలుగుతోంది. లేకపోతే ఆ ముగ్గుర్ని హత్య చేసిన తర్వాత పెట్రోల్‌గానీ మరేదైనా రసాయనం వేసిన తరువాత తాళం వేశారా?... వెళ్తూ వెళ్తూ ఇంటిలోపలికి నిప్పు వేసేసి వెళ్లిపోయారా అనే అనుమానాలకు బలం చేకూరుతోంది.
స్థానికులు చెబుతున్న ప్రకారం మృతురాలు సుల్తానాబేగం మానసిక పరిస్థితి సక్రమంగా లేనప్పుడు ప్రమాదం జరిగిన సమయంలో ఇంటి ప్రధాన ద్వారంతోపాటు బెడ్‌రూమ్‌లకు ముందు వెనుకవైపు తలుపుకు లోపల నుంచి తాళాలు వేసిఉండడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక, మరే ఇతర కారణాలు ఉన్నాయా?. కుమార్తెను ఇంజినీరింగ్‌లో చేర్పించేందుకు సుల్తానా బేగం కొన్ని రోజుల క్రితం ఆమదాలవలసలోని తమ పుట్టింటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్ చదువు కోసం కన్నవారిని ఆర్థిక సహాయం చేయమని అడిగినట్లు సమాచారం.
ఆర్తనాదాలు, హాహాకారాలు రాలేదు కదా!
ఆత్మహత్య చేసుకున్నట్టయితే శరీరం కాలుతున్నప్పటికి సహజంగా వచ్చే భయం ఏమైనట్టు?.. ఒకవేళ పెద్దవాళ్లకి మనోధైర్యం ఉన్నప్పటికి చిన్నపిల్లల ఆర్తనాదాలు, హాహాకారాలైన బయటికి వినిపించి ఉండేవి కదా. సంఘటన జరిగిన ఇల్లు ఎక్కడో నగర శివార్లలో కాకుండా వందలాది మంది నివాసం ఉండే క్వార్టర్స్.. ఇది ఎంతవరకు సాధ్యం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మొహిద్దీన్ తీరు సందేహాస్పదం...
సంఘటనా స్థలానికి వచ్చిన మొహిద్దీన్ ప్రవర్తన అసహజంగా ఉంది. తన భార్య, కుమారుడు, కుమార్తెల మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో చూసిన తర్వాత కూడా ఆయనలో ఎలాంటి స్పందన లేకపోవడం విస్మయపరుస్తోంది. మృతదేహాలను చూసినప్పటికి ఎటువంటి ఆవేదనకు గురికాకపోవడం, పోలీసులు, మీడియా ముందు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం, భర్త విధులకు హాజరైన కొద్దిసేపటికే ప్రమాదం సంభవించడం పలు అనుమానాలు బట్టి హత్య జరిగి ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అజ్ఞాత వ్యక్తి పాత్ర ఉందా?... : మృతురాలి భర్త మొహిద్దీన్ ఆవేశంతో ఇది కొంతమంది బ్రోకర్‌గాళ్ల పని అనే బలంగా చెప్పడం వెనుక ఉన్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరై ఉంటారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొహిద్దీన్ విధులకు వెళ్లిన అనంతరం ఆ ఇంటికి ఎవరైనా వచ్చారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ మిస్టరీ వీడాలంటే మొహిద్దీన్ నోరు విప్పాలి. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ విచారణను కొనసాగిస్తున్నారు. అతని నుంచి సమాచారాన్ని ఎంత త్వరగా రాబట్టితే ఈ సంఘటన వెనుక ఉన్న మిస్టరీ అంత త్వరగా వీడుతుంది. దాంతోపాటు మృతదేహాల పోస్టుమార్టం నివేదిక కీలకం కానుంది. సర్కిల్ ఇనస్పెక్టర్ డి.ఎస్.ఆర్.వి.ఎస్.ఎన్.మూర్తి ఆధ్వర్యంలో ఎస్‌ఐ రమేష్‌బాబు బృందం బుధవారం రాత్రి వరకు పంచనామాల కార్యక్రమాన్ని చేపట్టారు.