విభజన ఆపడానికి కాదు...వీలైనన్ని రోజులు సీఎంగా కొనసాగడానికే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వైఖరి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బిల్లుపై చర్చ జరపకుండా కాలయాపన చేస్తూ... తెలంగాణను అడ్డుకుంటున్నారని వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకుంటూ... వీలైనన్ని రోజులు సీఎంగా కొనసాగడమే కిరణ్ లక్ష్యమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడే బిల్లుపై అసెంబ్లీలో చర్చింపచేస్తే బిల్లును వ్యతిరేకిస్తూ రాజీనామా చేయడం కూడా ఇప్పుడే చేయాల్సి ఉంటుందనీ... ఇంత త్వరగా పదవిని వదులుకోవడానికి సీఎం ఒప్పుకోవడం లేదనీ ప్రస్తుతం రాజకీయువర్గాల్లో ప్రచారం సాగుతోంది. అసెంబ్లీలో చర్చకు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రపతి ఇచ్చిన గడువు లెక్కలోకి వస్తుందనేది ముఖ్యమంత్రి అభిప్రాయంగా ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో చర్చను కూడా వీలైనన్ని రోజులు నిలుపుదల చేసేందుకు ఆయన వ్యూహాలు రచిస్తున్నారు.
బిల్లును సోమవారం సభ్యులకు పంపిణీ చేసినప్పటికీ... అది ఇంగ్లీషులో ఉందని, దాన్ని తెలుగు, ఉర్దూ లో తర్జుమా చేసి ఇస్తేగానీ అర్థం చేసుకోలేమని కొంద రు సభ్యులతో అడిగించాలనేది సీఎం ఎత్తుగడ. అలాగే తర్జుమా పేరుతో సభలో చర్చ చేపట్టడానికి ఆలస్యమైనందువల్ల చర్చకు మరో 20 రోజులు సమయం కావాలని కోరాలనేది కూడా సీఎం వ్యూహంగా ఉంది. వీలైనన్ని రోజులు సీఎంగా కొనసాగుతూనే, విభజనకు వ్యతిరేకంగా పనిచేసినట్లు ప్రచారం పొందడమే సీఎం అభిప్రాయుంగా తెలుస్తోంది. అసెంబ్లీలో బిల్లును వ్యతిరేకించిన తరువాత పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టాలనేది సీఎం లక్ష్యంగా ఉందని, అందుకు అనుగుణంగానే సీఎం ఎత్తుగడలు వేస్తున్నారని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కేంద్రం ఈ బిల్లుకోసం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినందున అప్పటివరకు చర్చను సాగదీయాలని, అప్పటివరకు సీఎం పదవిలో కొనసాగవచ్చుననేది కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యూహంగా ఉంది.