కిరణ్ కుమార్ రెడ్డి యాక్సిడెంటల్గా సీఎం అయ్యారని టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కిరణ్ ఎమ్మెల్యేనే గాని ఆయనకు ప్రజల మద్దతు లేదన్నారు. పౌరుషం ఉంటే కేబినెట్ నుంచి వైదొలగాలని ఆయన కిరణ్ సర్కార్ను డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తు రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన హరికృష్ణను చూస్తే జాలి వేస్తుందని కడియం శ్రీహరి అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పోడవడంలో హరికృష్ణ కీలక పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు.
చంద్రబాబుది ఆత్మగౌరవ యాత్ర కాదు ఆత్మ వంచన యాత్రగా కడియం శ్రీహరి అభివర్ణించారు. వచ్చే నెలలో ఏపీఎన్జీవోలు ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన సభను అడ్డుకుని తీరతామన్నారు. అనంతరం జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కడియం శ్రీహరి స్ఫష్టం చేశారు.